News

Realestate News

మరుగుదొడ్ల నిర్మాణాలు ఉద్యమంలా సాగాలి

మరుగుదొడ్ల నిర్మాణాలు ఉద్యమంలా సాగాలి
ఆరునెలల్లో స్వచ్ఛ విజయనగరం సాధించాలి
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పిలుపు
విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే
ఓడీఎఫ్‌ జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. సర్పంచి నుంచి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్జీవోలు అందరి భాగస్వామ్యం ఉండాలి.

…ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి జవహార్‌రెడ్డి అధికారులకు సూచిస్తూ చేసిన వ్యాఖ్యలివి…

జిల్లా నీరు, పారిశుద్ధ్య యాజమాన్య విభాగం, వెలుగు ఆధ్వర్యంలో గురువారం జడ్పీ సమావేశ మందిరంలో ఆత్మగౌరవం శిక్షణ తరగతుల కార్యశాల జరిగింది. జిల్లాలో పారిశుద్ధ్య ప్రమాణాలు వెనుకబడి ఉండడాన్ని వక్తలంతా ఎత్తిచూపారు. వెనుకబాటు అపవాదు లేకుండా చూసుకోవలని పేరుపేరునా పిలుపునిచ్చారు. వ్యక్తిగత ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని జవహార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ శిక్షణ తరగతుల కార్యశాలలో మాట్లాడారు. లబ్ధిదారుల్లో మరుగుదొడ్డి నిర్మించాలన్న సంకల్పం వచ్చేటట్లు చేయాలన్నారు. రానంతవరకు పలు కారణాలను చెబుతుంటారన్నారు

ఏపీకి బిహార్‌కు తేడా లేదు..?
ఆంధ్రప్రదేశ్‌కు బీహార్‌కు పెద్దగా తేడా లేదని ఫీడ్‌ బ్యాక్‌ ఫౌండేషను ముఖ్య కార్యనిర్వహణాధికారి అజయ్‌ సిన్హా పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాలైన సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలు ఓడీఎఫ్‌ సాధించాయన్నారు. హరియాణా, ఉత్తరాఖండ్‌లో ఓడీఎఫ్‌కు చేరువలో ఉన్నాయన్నారు. ఏపీలో ఒక్క మండలం, జిల్లా కాని పూర్తిగా ఓడీఎఫ్‌ సాధించిన పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నా బయటకే వెళుతున్నారన్నారు. చత్తీస్‌గఢ్‌ తరహా నిర్ణయాన్ని ఇక్కడా అమలు చేయాలన్నారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌ మాదిరిగా పంచాయతీలకిచ్చే రాయితీని నిలిపివేయాలని సూచించారు. అలా చేయబట్లే ఆయా దేశాలు ప్రగతి పొందాయన్నారు. పూర్వకాలంలో బహిరంగ మలవిసర్జన లేదన్నారు. సింధునాగరికత కాలంలోనే మరుగుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని బట్టి పరిశుభ్రతపై అవగాహన తెలుస్తుందన్నారు. మధ్యతో పరిస్థితుల మార్పు వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. యునిసెఫ్‌ ఇండియా వాష్‌ అధికారి ఎ.వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలో లక్ష్యాన్ని ఉద్యమరూపంగా తీసుకుంటేనే ఫలితాలు వస్తాయన్నారు. ప్రత్యేక వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. యునిసెఫ్‌ ప్రతినిది,µ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ ఆచారిణి వాల్‌కర్టిస్‌ మాట్లాడుతూ ఓడీఎఫ్‌ సాధించే విషయంలో ఓ విప్లవం తేవాలన్నారు. స్వచ్ఛభారత్‌ మిషను కన్సల్టెంట్‌ నీరజ్‌ తివారీ మాట్లాడుతూ కార్యశాల శిక్షణ తరగతుల ద్వారా ప్రతిఒక్కరూ స్ఫూర్తి పొందాలన్నారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ ఏపీలో జిల్లా 13 స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. ప్రత్యేక కేంపెయిన్‌, ఉద్యమ విధానంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చత్తీస్‌గఢ్‌ విధానాన్ని అనుకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎస్పీ ఎల్‌.కె.వి.రంగారావు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతిఒక్కరూ మార్పుకు కృషిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి కర్తవ్యంగా గుర్తించాలన్నారు. గ్రామీణాభివృద్ధి పీడీ ఎస్‌.ఢిల్లీరావు, డ్వామా పీడీ ప్రశాంతి, జడ్పీ సీఈవో జి.రాజకుమారి, గ్రామీణనీటి సరఫరా ఎస్‌ఈ ఎన్‌.వి.రమణమూర్తి, డీఈ రాంనగేష్‌, పొదుపు మహిళలు, గ్రామీణ యువత పాల్గొన్నారు.