మబ్బుల్లో మైమరపు…
మబ్బుల్లో మైమరపు…
గాలి గుమ్మటాల పండుగకు భలే స్పందన
సాయంత్రం విన్యాసాలకు పోటెత్తిన జనాలు
లాటరీతో బెలూన్‌లో విహార అవకాశం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, అరకులోయ పట్టణం:
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దక్షిణాంధ్రాకు పరిచయం చేసిన బెలూన్ పండగ సందర్శకులు, మన్యంవాసులను మైమరిపించింది. మంగళవారం ఉదయం కొత్తభల్లుగుడ సమీపంలో బెలూన్ పండగను ప్రారంభించగా సాయంత్రం ఎన్టీఆర్ మైదానంలో గాలి గుమ్మటాల విన్యాసాలను ప్రదర్శించారు. ఉదయం కాస్త జనం సందడి తక్కువగా ఉన్నా సాయంత్రం పర్యాటకులతో పాటు స్థానికులు వెల్లువెత్తడంతో మైదానం కిక్కిరిసిపోయింది. పారా మోటరింగ్తో మైదానం చుట్టూ చేసిన విన్యాసాలు అందరినీ కట్టిపడేశాయి. 13 దేశాలకు చెందిన బృందాలు తమ బెలూన్ల వరుసుగా నిలబెట్టి ప్రదర్శించే సమయంలో జనాలు కేరింతలు కొట్టారు. బెలూన్లలో విహారం కోసం పేర్లు నమోదుకు మైదానంలో బారులు తీరారు. నమోదు చేసుకున్న వారిలో లాటరీ ద్వారా 150 మందిని ఎంపిక చేశారు. వారిని మైదానంలో నిలువగా ఎగిరే బెలూన్లను ఎక్కించారు. సినిమాల్లోనే కనిపించే పెద్దపెద్ద బెలూన్లు కళ్ల ముంగిట కనిపించడం.. అందులో విహరించే అవకాశం రావడంతో పర్యాటకులు, స్థానికులు ఉబ్బితబ్బిబయ్యారు. ఓవైపు రాక్ మ్యూజిక్.. మరోవైపు బెలూన్ల వెలుగు జిలుగులు చూపరులను హత్తుకున్నాయి. బెలూన్లు గాలిలో స్థిరంగా నిలబడేందుకు గ్యాస్‌తో వెలిగించే నిప్పు వాయువులను విడుదల చేసిన ప్రతిసారి చూపరులు ఈలలు వేసి కేరింతలు కొట్టారు. విదేశీ బెలూన్ పైలెట్లు గాలి గుమ్మటాలను జనం చెంతకు తీసుకువెళ్లి దగ్గర నుంచి చూసే వీలు కల్పించడంతో మైదానం వీక్షకులు చప్పట్లతో మార్మోగిపోయింది. చల్లని వాతావరణంలో చక్కని వేడుక చూశామనే సంతృప్తితో పర్యాటకులు సందడి చేశారు. బెలూన్లు, విదేశీ పైలెట్లతో స్వీయచిత్రాలు (సెల్ఫీ) దిగి తమ ఆనందాన్ని చాటుకున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనుండడంతో మరింత మంది వీటిని తిలకించడానికి వస్తారని నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవంపై ప్రచారం చేసుంటే మరింత మంది వచ్చుండేవారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక గిరిజనులకు మరింతగా బెలూన్లలో విహరించే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
పటిష్ఠ భద్రత..
బెలూన్ ఉత్సవం.. మరో అరకు ఉత్సవాన్ని తలపించింది. సాయంత్ర వేళ ఎటుచూసినా జనాలు, వాహనాలతో అరకు రహదారులు రద్దీగా మారిపోయాయి. దీనికి తోడు బెలూన్ ఉత్సవంలో విన్యాసాలు చేసేవారంతా విదేశీయులే కావడంతో పోలీసులు పటిష్ఠ భద్రత కల్పించారు. పాడేరు డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పారా మిలటరీ దళాలు నగరంతో పాటు రహదారి పొడవునా గస్తీ కాశారు. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేశారు. మొదటి రోజు ఉత్సవం విజయవంతం కావడం పట్ల ఇటు పర్యాటక శాఖ, అటు పోలీసు శాఖ వూపిరి పీల్చుకున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనుండడంతో మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇది ప్రయోగాత్మకమే..
ఈ ఏడాది చేపడుతున్న బెలూన్ ఫెస్టివల్ ప్రయోగాత్మకమే. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో వీటిని ఏర్పాటు చేశాం. మొదటి రోజు విన్యాసాలకు జనాల నుంచి కనిపించే స్పందన చాలా బాగుంది. రాజస్థాన్‌తో పాటు ఇతర చోట్ల నిర్వహించే బెలూన్ ఉత్సవాల్లో విహరించడానికి ఎంతో డబ్బులు ఖర్చుచేస్తారు. మనం పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగానే పర్యాటకులకు విహరించే అవకాశం కల్పిస్తున్నాం. వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా భారీ ఎత్తున బెలూన్ ఉత్సవం నిర్వహించడానికి ముందుగానే ప్రణాళిక చేసుకుంటాం. గాలి గుమ్మటాల పండుగ విజయవంతంలో పోలీసులు, పర్యాటకులు సహకారం ఉంది. నిర్వహాణ సంస్థ ఈ ఫ్యాక్టర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే వేడుకను నిర్వహిస్తోంది. ఇలాంటి వేడుకలతో జిల్లాకు వచ్చే దేశ, విదేశి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పగలను
స్పందన బాగుంది..
మేం ఇదివరకు రెండు మూడు చోట్ల నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్లో పాల్గొన్నాం. ఇక్కడ జనాల నుంచి కనిపించినంత స్పందన అక్కడ లేదు. అరకులో వాతావరణం చాలా బాగుంది. మళ్లీమళ్లీ రావాలనే విధంగా ఇక్కడ పర్యాటక ప్రాంతాలున్నాయి. ఈ ఉత్సవంలో పాల్గొవడం చాలా సంతోషంగా ఉంది.
అరకు అందాలు బాగున్నాయి..
మేం బెలూన్ ఉత్సవం కోసం వచ్చినా అరకు అందాలు మమ్మల్ని కట్టిపడేశాయి. ఉదయం బెలూన్లను ఎగురవేసిన తరువాత చుట్టుపక్కల పరిసరాలన్నీ తిరిగి చూశాం. జలపాతాలు, పచ్చని పూలు చాలా బాగున్నాయి. బెలూన్ ఉత్సవానికి మంచి స్పందన వచ్చింది. మిగతా రెండు రోజులు చక్కగా విన్యాసాలు చేస్తాం. స్థానికులు చక్కగా సహకరిస్తున్నారు.