News

Realestate News

మన ఊరు – మన బడి

మన ఊరు – మన బడి
నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమం
ఈ నెల 30 వరకు..
చదువుకునే వయసులో పాఠశాలలో కాకుండా బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 14 ఏళ్లలోపు వయసున్న ప్రతిఒక్కరు బడిలో ఉండాలనే విద్యాహక్కు చట్టాన్ని అమలుచేసే ఉద్దేశంతో మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చినప్పటికీ ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు డ్రాపౌట్లను నివారించడం కార్యక్రమం ముఖ్యోద్దేశం.

ఈ నెల 30 వరకు…
నేటి (సోమవారం) నుంచి 30వ తేదీ వరకు మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు షెడ్యూలు విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి పాఠశాలకు సెలవులు ప్రకటించినప్పటికీ ఒక రోజు ముందు నుంచే ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2018-19 విద్యాసంవత్సరంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బడిబయట ఉన్న వారిని బడిలో చేర్పించడంతో పాటు, డ్రాపౌట్లను నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు.
* బడి ఈడుకు వచ్చి బడికి రాని పిల్లల వివరాలు సేకరించి, వారి తల్లిదండ్రులను సంప్రదించి వారి బడిలో చేర్పించేందుకు చర్యలు చేపడతారు. కొంతకాలం బడికి వచ్చి మధ్యలో మానేసినవారిని గుర్తించి… వారిని తిరిగి బడిబాట పట్టేలా చర్యలు చేపడతారు.
* జిల్లాలో డీఈఓల పర్యవేక్షణలో పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులతో కలిసి ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఇదీ పరిస్థితి..: జిల్లాలో 2267 ప్రాథమికోన్నత పాఠశాలలు, 569 ప్రాథమికోన్నత పాఠశాలలు, 472 ఉన్నత పాఠశాలలు, 32 కేజీబీవీలు, 14 ఆదర్శ పాఠశాలలు, 3403 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 789 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఒకటో తరగతిలో ప్రవేశించాల్సిన పిల్లలు 40 వేల మంది, 5వ తరగతి నుంచి ఆరో తరగతిలో చేరాల్సినవారు 30 వేల మంది, 7 నుంచి 8వ తరగతిలో చేరాల్సినవారు 30 వేల మంది విద్యార్థుల వరకు ఉన్నారు. వీరందర్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ధ్యేయంతో విద్యాశాఖ ఈ కార్యక్రమం చేపడుతోంది.

24 నుంచి సర్వే…: బడిబాట కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో విద్యార్థుల పెంపునకు చర్యలు చేపడతారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు బడిబాట నిర్వహిస్తారు.
* 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతారు.
* 24న అంగన్‌వాడీల ఆధ్వర్యాన బడిబాటపై ప్రచారం చేస్తారు.
* 25న అయిదో తరగతి పూర్తి చేసిన పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడతారు.
* 26వ తేదీన 7, 8 తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులను గుర్తించి వారిని 8, 9 తరగతుల్లో చేర్పిస్తారు.
* 27న ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలి.
* 28న పాఠశాలకు రాకుండా బడిబయట ఉన్న వారిపై సర్వే చేస్తారు.
* 29న మురికివాడల్లో నివసిస్తూ బడికి దూరమవుతున్న విద్యార్థులను గుర్తిస్తారు.
* 30వ తేదీన మన బడి వివరాలను మండల స్థాయిలో పాఠశాలల వారీగా అప్‌లోడ్‌ చేస్తారు.

మూడుస్థాయిల్లో కమిటీలు: బడిబాట కార్యక్రమం కార్యాచరణను అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ మూడు స్థాయుల్లో – జిల్లా, మండల, పాఠశాల కమిటీలను వేసింది, ఈ రెండు కమిటీలు వారి పరిధిలో చేపడుతున్న కార్యక్రమాన్ని కమిటీ పర్యవేక్షణలో నిర్వహించాలి.

జిల్లా స్థాయి కమిటీ: అధ్యక్షులుగా కలెక్టర్‌, ఉపాధ్యక్షులుగా డీఈవో, కన్వీనర్‌గా సర్వశిక్షా అభియాన్‌ పీవో, సభ్యులుగా డీపీవో, జడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో
మండల స్థాయి కమిటీ: అధ్యక్షులుగా ఎంపీడీవో లేదా ప్రత్యేకాధికారి, ఉపాధ్యక్షులుగా ఎంఈవో, కన్వీనర్‌గా పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధి, సభ్యులుగా క్లస్టర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయుడు
పాఠశాల స్థాయి కమిటీ: అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు, ఉపాధ్యక్షులుగా పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, కన్వీనర్‌గా స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు, సభ్యురాలిగా అంగన్‌వాడీ కార్యకర్త

ప్రణాళికాబద్ధంగా చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు 20 మంది విద్యార్థులను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రమాణ పత్రాలు కూడా తీసుకుంటాం. సర్వశిక్షా అభియాన్‌తో సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం.

-ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాఖాధికారి

ఏర్పాట్లు పూర్తి
బడిఈడులో ఉన్న పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా మన ఊరు- మన బడి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

-ఎస్‌.త్రినాథరావు, పీవో, సర్వశిక్షా అభియాన్‌

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo