News

Realestate News

మన్యంలో మొనగాళ్లు

మన్యంలో మొనగాళ్లు
గిరి పల్లెల నుంచి జాతీయ స్థాయికి
యుద్ధవిద్యల్లో రాణిస్తున్న యువత
చింతపల్లి, న్యూస్‌టుడే
ఎటుచూసినా ఎత్తయిన, పచ్చని కొండలు. ఆ కొండల మద్య దూరంగా ఓమూల విసిరేసినట్టుండే కుగ్రామాలు. చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించే పేదరికం. కళ్లలో అమాయకత్వం. వ్యవసాయ పనులతోనే కాలం వెళ్లదీస్తున్న అమాయక గిరిజనం. విశాఖ మన్యం అనగానే గుర్తుకొచ్చే అంశాలు ఇవి. అదే మన్యంలోని ఆదివాసీ యువత మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నారు. తమ అభిరుచులకు తగిన రంగాలను ఎంచుకుని అందులో చక్కగా రాణిస్తున్నారు. ఒకవైపు చదువుతోపాటు మరోవైపు మార్షల్‌ ఆర్ట్స్‌లో (యుద్ధవిద్యలు) చక్కగా రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తున్నారు.

ఆత్మరక్షణ కోసం నేర్చుకునే యుద్ధవిద్యలపై గిరిజన యువత అవగాహన పెంచుకుంటున్నారు. యుద్ధవిద్యల సాధన ద్వారా శారీరక సౌష్ఠవంతోపాటు మానసిక ప్రశాంతత, దుర్య్వసనాలకు దూరంగా ఉండవచ్చనే గిరిజన యువత ఈ కళలపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేవలం విద్యను నేర్చుకోవడమే కాకుండా ఈ విద్యలో మెరుగైన ప్రతిభ కనపరచి అంచెలంచెలుగా డివిజన్‌, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొని బహుమతులతోపాటు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

అతడే ఒక సైన్యం..
చింతపల్లి కేంద్రంగా బాకూరు పాండురాజు సుమారు 12 ఏళ్ల నుంచి కరాటేలో గిరిజన యువతకు శిక్షణ ఇస్తున్నారు. కరాటే కొఫోకాన్‌ విద్యలో సంపూర్తి శిక్షణ పొంది జిల్లా స్థాయిలో ముఖ్య శిక్షకునిగా అంచలంచెలుగా ఎదిగారు. ఇప్పటివరకూ మన్యం 11 మండలాలకు చెందిన 10 వేల మంది గిరిజన విద్యార్థులు ఈయన వద్ద శిక్షణ పొందారు. చింతపల్లి కేంద్రంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. యుద్ధవిద్యపై మోజు ఉన్న మన్యంలోని 11 మండలాల యువత అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతున్నారు. నేర్చుకున్న అంశాలపై ప్రతి రెండు మూడునెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించి ఆ పోటీల్లో గెలుపొందిన వారిని పైస్థాయి పోటీలకు పంపేందుకు మరింత పదును పెడుతున్నారు.

ఏదో ఒకరంగంలో ప్రతిభ చాటాలి
ప్రస్తుతం చదువు సహా మిగిలిన అన్ని రంగాల్లోనూ పోటీతత్వం బాగా పెరిగిపోయింది. ఈ పోటీలను తట్టుకుని రాణించాలంటే ప్రస్తుతం యువత నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలి .కేవలం చదువు మాత్రమే కాకుండా ఏదైనా కళల్లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే ప్రత్యేక గుర్తింపు ప్రయోజనం ఉంటుంది. తద్వారా ఉపాధి అవకాశాలూ మెరుగుపడతాయి. ప్రభుత్వం కూడా గిరిజన యువతకు పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇస్తే బాగుంటుంది.

– మొట్టడం సత్యసురేష్‌, దేవరాపల్లి, గూడెంకొత్తవీధి మండలం

అందరి ప్రోత్సాహం అవసరం
కరాటేలో రాణించాలంటే తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, తోటి స్నేహితుల ప్రోత్సాహం అవసరం. మండల స్థాయి నుంచీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే వీరందరి ప్రోత్సాహమే కారణం. ఇదే వూపుతో మరిన్ని అవార్డులు సాధించేందుకు కృషి చేస్తాను.

– వెలుసూరి అప్పన్న, సోమవరం గ్రామం చింతపల్లి మండలం

జాతీయస్థాయిలో రాణించాలని..
చిన్నతనం నుంచీ మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉంది. ప్రస్తుతం డిగ్రీ చదువుకుంటూనే పోటీల్లో పాల్గొంటున్నా. జిల్లాస్థాయిలో రెండుసార్లు ప్రతిభ కనపరచడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యాను. జాతీయ స్థాయిలో రాణించాలన్నది నా ముందున్న లక్ష్యం.

– గెమ్మెలి అజయ్‌

మంచి లక్షణాలు అలవడతాయి
మార్షల్‌ ఆర్ట్స్‌ను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మనశక్తి సామర్థ్యాలపై నియంత్రణ వస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీర దారుఢ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మితాహారం, దురలవాట్లకు దూరంగా ఉండటం వంటి మంచి లక్షణాలు అలవడతాయి.

– కొర్రా బుజ్జిబాబు

12 ఏళ్లలో యువత సాధించిన విజయాలివీ
2005 నుంచి చింతపల్లి కేంద్రంగా కరాటే కొఫోకాన్‌ శిక్షణ తరగతులు మొదలయ్యాయి.

2006 మార్చిలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో చింతపల్లి ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు ప్రథమస్థానం, ఇద్దరు యువకులు ద్వితీయ స్థానాలు సాధించారు.

2007 ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో చింతపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు గిరిజన యువకులు ప్రథమ స్థానం, ఒకరు ద్వితీయ స్థానం సాధించారు.

2008లో హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో చింతపల్లి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు.

2009 ఆగస్టులో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఎనిమిదిమంది గెలుపొందారు వీరిలో ఐదుగురు ప్రథమస్థానంలో, ముగ్గురు ద్వితీయ స్థానంలో నిలిచారు.

2011 మార్చి లోవిజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆల్‌రౌండ్‌ ఛాంపియన్‌షిప్‌ను చింతపల్లి ప్రాంత విద్యార్థులు గెలుచుకున్నారు. వారికి అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారథి బహుమతులు ప్రదానం చేశారు.

2013లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఎనిమిది మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

2014 జనవరిలో చెన్నైలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలకు చింతపల్లి ప్రాంతం నుంచి ముగ్గురు యువకులు పోటీలకు హాజరయ్యారు. వీరిలో అన్నవరానికి చెందిన వెలుసూరి అప్పన్న జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరచి బ్లాక్‌బెల్టు సాధించాడు. ఇదే పోటీల్లో చింతపల్లిలో డిగ్రీ చదువుతున్నమొట్టడం సత్యసురేష్‌ తృతీయ స్థానం సాధించాడు. వీరికి జపాన్‌కు చెందిన ప్రపంచస్థాయి గ్రాండ్‌ మాస్టర్‌ కె.ఇ.జి తోమియామా బహుమతులు, అర్హత ధ్రువపత్రాలను అందించారు.

2015 నుంచీ బ్లాక్‌బెల్టు సాధన కోసం పలువురు గిరిజన యువకులు పోటీ పడుతున్నారు. చింతపల్లి కేంద్రంగా రెండుదఫాలుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు 12 మంది గిరిజన యువకులు ఎంపికయ్యారు.