భోజనం అందక.. ఆకలితో విలవిల
భోజనం అందక.. ఆకలితో విలవిల
భీమిలిలో నవప్రయాస సంస్థ నిర్వాకం
భోజనం అందక.. ఆకలితో విలవిల
భీమిలిలో పలు పాఠశాలలకు బుధవారం మధ్యాహ్న భోజనం సకాలంలో సరఫరా కాకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు.
కొన్ని పాఠశాలలకు ఆలస్యంగా మధ్యాహ్నం 2 గంటలకు భోజనాలు వచ్చాయి. మరికొన్ని పాఠశాలలకు ఈ భోజనాలు రాకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపారు.
ఈ విషయమై భీమిలి ఎంఈవో కె.ఎ.బాలామణి మధ్యాహ్నభోజన పథకం ఏజెన్సీలపై జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
భీమిలి మండలం దాకమర్రి సమీపంలోని మోదవలస వద్దఉన్న నవప్రయాస సంస్థ ఆధ్వర్యంలో ప్రతీరోజు భోజనాలను తయారుచేసి మధ్యాహ్నం 12 గంటల సమయానికి భీమిలి మండలంలోని పాఠశాలలకు సరఫరా చేస్తుంటారు.
ఆయా పాఠశాలల్లో రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యార్థులు భోజనాలు చేస్తుంటారు. కానీ ఆటోల ద్వారా రావాల్సిన భోజనాల క్యారేజీలు చేరకపోవడంతో పాఠశాల వర్గాలు వాకబు చేశాయి.
భోజన సమయం దాటిపోవడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను ఇళ్లకు పంపివేశారు. హాస్టల్ విద్యార్థులను ఆయా వసతిగృహాలకు పంపగా అక్కడ వంట పూర్తిచేసి పిల్లలకు వడ్డించేసరికి సాయంత్రం 5 గంటలైంది.
భీమిలి సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ హైస్కూలు, సీబీఎం ఎయిడెడ్ హైస్కూలు, పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూలు, ఝాన్సీ లక్ష్మీభాయి మున్సిపల్ యూపీ స్కూళ్లకు అసలు భోజనాలు రాలేదు.
మరికొన్నింటికి ఆలస్యంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత రావడంతో ఎలాగోలా ఆకలిని తీర్చుకున్నారు.
ఎన్నడూ లేనివిధంగా చోటుచేసుకొన్న ఈ ఘటన గురించి భీమిలి ఎంఈవో కె.ఎ.బాలామణి వద్ద ప్రస్తావించగా నవప్రయాస సంస్థ భోజనాలు సరఫరా చేసే సిబ్బందిని కుదించడంతో పాటు వాహనాలను తగించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తమ విచారణలో తేలిందన్నారు.
భీమిలి పరిధిలో పది పాఠశాలల్లో చదువుతోన్న 1,700 మంది విద్యార్థులు భోజనం విషయంలో బుధవారం ఇబ్బందులు పడ్డారన్నారు.