News

Realestate News

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు
పద్మనాభం, న్యూస్‌టుడే :
భోగాపురం సమీపంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడానికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పాండ్రంగి గ్రామంలో మంగళవారం జరిగిన అల్లూరి సీతారామరాజు 120వ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్లూరి పార్కులో ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అల్లూరి జన్మ గృహంలో ఉన్న అల్లూరి సీతారామరాజు, ఆయన తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పాండ్రంగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. రూ. 147 కోట్లతో పద్మనాభం మండల అభివృద్ధికి ప్రత్యేకంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. అనంతపద్మనాభ స్వామి కొండపైకి నిర్మిస్తున్న ఘాట్‌రోడ్డుకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, డిపిఆర్‌ సైతం సిద్ధంగా ఉందని త్వరలోనే అనుమతులు వస్తే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

పాండ్రంగి గ్రామానికి గోస్తనీ నదిపై వంతెన నిర్మాణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. పాండ్రంగి యూపి పాఠశాల భవనానికి రూ. 15 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పాండ్రంగి గ్రామాన్ని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు దత్తత తీసుకున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ట్రిబుల్‌ ఐటికి ఎంపికైన స్థానిక కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థిని గంగిరెడ్ల హేమలతకు మంత్రి జ్ఞాపిక అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, అల్లూరి ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్‌.ఎస్‌.డి.పి.ఎన్‌.రాజు మార్గ నిర్దేశకత్వంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జ్ఞానవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, పద్మనాభం, ఆనందపురం, భీమునిపట్నం ఎమ్పీపిలు కె.పద్మ, వరలక్ష్మి, మండల తెదేపా అధ్యక్షుడు కె.నగేష్‌కుమార్‌, జిల్లా రూరల్‌ తెలుగు మహిళా అధ్యక్షరాలు కె.లీలావతి, పాండ్రంగి సర్పంచ్‌ ఆర్‌.ఎస్‌.వజ్రకుమార్‌రాజు, ఎమ్పీటీసి బి.చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు తప్పని అవస్థలు
విద్యాశాఖ మంత్రి వస్తున్నారని చెప్పి విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మంత్రికి స్వాగతం పలకడానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చారు. మంత్రికి పూలు చల్లి స్వాగతం పలకడానికి ఎండలో రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టారు. అందులో చాలా మంది విద్యార్థులకు కనీసం చెప్పులు సైతం లేవు. తొమ్మిది గంటలకు మంత్రి వస్తారని చెప్పి విద్యార్థులను నిలబెట్టారు. చివరకు మంత్రి పావుతక్కువ పదకొండు గంటలకు వచ్చారు. విద్యార్థులకు కనీసం మంచినీరు కూడా అందలేదు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo