‘భూ భ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణ

‘భూ భ్రమణ కాంక్ష’ పుస్తకావిష్కరణ
సీతంపేట, న్యూస్‌టుడే : తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు ఆచార్య ఎం. ఆదినారాయణ రచనలు ఉంటాయని, ఆయన రచనలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.రవిప్రకాశ్ అన్నారు. మంగళవారం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో ఆచార్య ఎం. ఆదినారాయణ రచించిన ‘భూ భ్రమణ కాంక్ష’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వి.వి.రమణమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి రవిప్రకాశ్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితమే ఆదినారాయణ ‘భ్రమణ కాంక్ష’ పుస్తకాన్ని రాశారని, ఆ పుస్తం తాను చదివాక కవిత్వం పద్యరూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని గ్రహించానన్నారు. యాత్ర సాహిత్యాలపై అనేక పుస్తకాలు వచ్చినప్పటికీ ఆదినారాయణ రాసిన భ్రమణ కాంక్ష పుస్తకానికి సాటిరావని పేర్కొన్నారు. ఈసందర్భంగా ‘భూ భ్రమణ కాంక్ష’ పుస్తక సమీక్షను రవి ప్రకాశ్ నిర్వహించారు. రమణమూర్తి మాట్లాడుతూ ఆదినారాయణ బహుదూరపు బాటసారన్నారు. ఇంతవరకు ఆరు ఖండాలు, 14 దేశాలు, 30వేల కిలోమీటర్లు కాలినడకన పర్యటించారన్నారు. సోదరి దిల్లీలో మరణిస్తే ప్రకాశం జిల్లా నుంచి దిల్లీ వరకు కాలినడకన వెళ్లి ఆమెకు సమాధి కట్టారని గుర్తుచేశారు. రచయిత ఆదినారాయణ మాట్లాడుతూ 1989లో తాను భ్రమణ కాంక్ష పుస్తకం రాశాక తెలుగులో 50వరకు యాత్రా సాహిత్య పుస్తకాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలుగు రచయితలు యాత్రా సాహిత్యాలు రాయాలని అన్నారు. ఆయా దేశాల్లో రచించిన యాత్రా సాహిత్యాలను తెలుగులో అనువదిస్తానన్నారు.కార్యక్రమంలో మాజీ పోలీస్ అధికారి సత్యనారాయణ ప్రసంగించారు