భూముల ధరలకు రెక్కలు
ఆగస్టు ఒకటి నుంచి అయిదు శాతం రిజిస్ట్రేషను విలువ పెంపు
పది మండలాల పరిధిలో ప్రభావం
కిటకిటలాడుతున్న కార్యాలయాలు

జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా 10 రిజిస్ట్రేషను కార్యాలయాల పరిధిలోనే భూముల విలువ పెంచారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కాశీబుగ్గ , రాజాం, పాలకొండ మున్సిపాల్టీలు, ఉడా పరిధిలో ఉన్న పొందూరు, రణస్థలం, కోటబొమ్మాలి, నరసన్నపేట మండలాల పరిధిలో భూములు ధరలు ఐదు శాతం పెంచారు.
ధరలు ఇలా పెరగనున్నాయి
బలగ ప్రాంతంలో ప్రస్తుతం చదరపు అడుగు రూ.6500 ఉంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రూ.6900కు పెరగనుంది. అపార్ట్మెంటు చదరపు అడుగు ప్రస్తుతం రూ.1500 ఉండగా రూ.1600 పెరగనుంది. వ్యవసాయ భూమి సింగుపురం ప్రాంతంలో ఎకరా రూ.10 లక్షలు విలువ ఉండగా ప్రస్తుతం రూ.10.5 లక్షలకు పెరగనుంది. రాగోలు ప్రాంతంలో ఎకరా రూ.15 లక్షలుండగా రూ.15.75 లక్షలకు పెరగనుంది. ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్పురం ప్రాంతంలో ఎకరా రూ.5 లక్షలుండగా రూ.5.25 లక్షలకు పెరగనుంది. పొందూరు మండలం రాపాక ప్రాంతంలో చదరపు అడుగు విలువ ప్రస్తుతం రూ.700 ఉండగా రూ.750 పెరగనుంది. ఇచ్ఛాపురం ప్రాంతంలో చదరపు అడుగు రూ.2500 ఉండగా రూ.2600 పెరగనుంది. రణస్థలం ప్రాంతంలో చదరపు అడుగు రూ.2000 ఉండగా, రూ.2100 పెరగనుంది. పైడిభీమవరం ప్రాంతంలో వ్యవసాయ భూమి రూ.10లక్షలుండగా, రూ.10.50 లక్షలకు పెరగనుంది. జాతీయ రహదారికి ఆనుకొని ఎకరా భూమి విలువ ప్రస్తుతం రూ.35 లక్షలుండగా రూ.36.75 లక్షలకు పెరగనుంది.
* మున్సిపాల్టీ పరిధిలో శ్లాబు ఇల్లు అడుగు రూ.980 నుంచి రూ.1030కు పెరగనుంది. పెంకుటిల్లు రూ.530 నుంచి రూ.560కు పెరగనుంది. శ్రీకాకుళంలలో పాలకొండ రహదారి పరిధిలో చదరపు అడుగు రూ.14000 నుంచి రూ.14,700కు పెరగనుంది. పెరిగిన ధరలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
ఒకటో తేదీ నుంచి అమలులోకి
పెరిగిన రిజిస్ట్రేషను ధరలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. పది మండలాల పరిధిలోనే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా ఐదు శాతం పెంచారు. రిజిస్ట్రేషను విలువ పెరిగినప్పటికీ భూములు క్రయవిక్రయాలు యథాస్థితిలోనే ఉంటాయి. ఆగస్టు ఒకటో తేదీ లోపు పాత విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తాం.