భీమిలి పర్యటకానికి వూపు
మూలకుద్దులో జెట్టీ టెర్మినల్ ఏర్పాటు
సవివర పథక నివేదిక తయారీ
విశాఖపట్నం – న్యూస్టుడే, గ్రామీణ భీమిలి

మూలకుద్దులో జెట్టీ టెర్మినల్
భీమిలికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలకుద్దులో జెట్టీ టెర్మినల్ నిర్మించడానికి నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వ భూములు సుమారు 257 ఎకరాల వరకు ఉన్నాయి. టెర్మినల్ నుంచి సముద్రంలోకి వెళ్లడానికి అనువుగా కాలువను నిర్మించాల్సి ఉంటుంది. 40 నుంచి 60 మంది పర్యటకులతో సముద్ర జలాల్లో బోట్లు విహరించేందుకు వీలుగా జెట్టీల్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు వెచ్చించనున్నారు. జెట్టీ టెర్మినల్ పాటు, పర్యటకులు విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబ సభ్యులతో విహరించడానికి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారు. ఇప్పటి వరకు మారుమూల గ్రామంగా ఉన్న మూలకుద్దు ఈ ప్రాజెక్టుతో పర్యటక ప్రాంతంగా మారేలా ప్రణాళిక చేసినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
విశాఖలో అంతంత మాత్రంగానే సేవలు
ప్రస్తుతం విశాఖ హార్బర్లో పర్యటక శాఖ ఒక జెట్టీ నిర్వహిస్తోంది. దీనికి పర్యటకుల నుంచి మంచి ఆదరణ ఉంది. 30 మంది పర్యటకులతో జెట్టీ నుంచి పర్యటక బోట్లు ఒకసారి సముద్రంలోకి వెళితే మరో గంట వరకు పర్యటకులు ఒడ్డున నిరీక్షించాల్సిందే. ప్రస్తుతమున్న జెట్టీ కూడా పాడైపోయింది. ఈ ప్రదేశం పోర్టు పరిధిలో ఉండటంతో పర్యటకులు విశ్రాంతి తీసుకోవడానికి సరైన వసతి లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేయబోయే జెట్టీతోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని పర్యటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పర్యటక ప్రదేశంగా అభివృద్ధి
ఇప్పటి వరకు భీమిలి తీరంలో స్నానాలు చేసి వెళ్లిపోవడమే తప్ప, సముద్ర పర్యాటకాన్ని ఆస్వాదించే అవకాశం పర్యటకులకు లేకుండా పోయింది. ఈ కొత్త ప్రాజెక్టుతో భీమిలితో పాటు చుట్టు పక్కల గ్రామాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను సైతం ఈ ప్రాజెక్టుకు సేకరించడానికి పర్యటక శాఖ సిద్ధమని చెబుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతున్న భోగాపురానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండడంతో పర్యటకంగా ఎక్కువ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. భోగాపురం నుంచి సముద్ర తీరానికి సమాంతరంగా భీమిలి వరకు రహదారి నిర్మాణం జరగనుంది. ఇవి మూలకుద్దు ప్రాజెక్టుకి కలిసొచ్చే అంశాలు.
టెండర్ దశకు చేరుకుంది
సాగరమాలలో భాగంగా భీమిలిలో జెట్టీ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ఇప్పటికే కన్సల్టెంట్ సంస్థ ఈ ప్రాజెక్టుపై సవివర నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపించింది. సాంకేతిక పరమైన అనుమతులు రావడమే తరువాయి టెర్మినల్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి టెండర్ పిలుస్తాం. ఈ ప్రాజెక్టుకు పర్యటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాం.