News

Realestate News

భారత ఫిన్‌టెక్‌ వ్యాలీగా విశాఖను అభివృద్ధి చేస్తాం

development of Visakha

భారత ఫిన్‌టెక్‌ వ్యాలీగా విశాఖను అభివృద్ధి చేస్తాం
రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారు జె.ఎ.చౌదరి

విశాఖపట్నం, ఈనాడు: విశాఖపట్నాన్ని ‘ఫిన్‌టెక్‌’ సంస్థలకు భారతదేశ కేంద్రంగా, ఫిన్‌టెక్‌ వ్యాలీగా అభివృద్ధి చేయబోతున్నట్లు రాష్ట్రప్రభుత్వ ఐ.టి. సలహాదారు జె.ఎ.చౌదరి చెప్పారు. గురువారం విశాఖలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం, ఎకనామిక్‌టైమ్స్‌ ఆధ్వర్యంలో ‘ఇ.టి.సి.ఐ.ఒ. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ సమ్మిట్‌’ పేరిట ‘డిజిటల్‌ అవరోధాలు, ఆవిష్కరణలు: భవిష్యత్తుతర విప్లవం’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు అనేక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకొచ్చాయన్నారు. అనేక సంస్థలు విశాఖలో వాటి కేంద్రాలను ఏర్పాటుచేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఆసక్తి చూపాయని మరికొన్ని సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఐదో పారిశ్రామిక విప్లవ అవకాశాల్ని అందిపుచ్చుకుని దానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా మార్గసూచీ తయారు చేస్తున్నామన్నారు. డిజిటలైజ్‌ సమాచార భద్రత కోసం బ్లాక్‌చైన్‌ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నామని వెల్లడించారు. స్విస్‌ బ్యాంకు ప్రతినిధి ఎన్‌.టి.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ రియల్‌టైమ్‌ సమాచారాన్ని తెప్పించుకోవడం, దాన్ని ఉపయోగించుకుని నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న ప్రయత్నం ఏ దేశంలోనూ లేదేమోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కొనియాడారు. ఎ.ఎన్‌.ఎస్‌.ఆర్‌. కన్సల్టింగ్‌ సంస్థ సీఈవో లలిత్‌ అహూజా మాట్లాడుతూ రాష్ట్రం, దేశం అభివృద్ధి జరగాలంటే డిజిటల్‌ ట్రాన్సఫర్‌మేషన్‌ జరగడం అనివార్యమని పేర్కొన్నారు. సుమారు 25 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో తమతమ శాఖలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చాయని గుర్తు చేశారు. బి.టి. అండ్‌ బి.టి. ప్రతినిధి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు చేపట్టే చర్యలు అంతిమంగా ప్రజల్ని సంతోషపెట్టేలా చేయాలన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘హ్యాపీ ఏపీ’ పేరిట ఓ కార్యక్రమాన్ని తయారుచేశామన్నారు. ఉద్యోగం కలిగి ఉండడం, కొనుగోలు శక్తి పెరగడం, పుష్కలమైన వనరులు, భద్రమైన వాతావరణం, మంచి చదువు, ఆరోగ్యం, మంచి సంస్కృతి, లింగవివక్షకు తావులేని, అవినీతిరహితమైన వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. భారత్‌ క్రియేటివిటీ సూచీలో 91వ స్థానం, సంతోష సూచిలో 118వ స్థానంలో ఉందని ఇవి మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 130 మున్సిపాలిటీలకుగాను 50 మున్సిపాలిటీల్లో ఎక్కడ లైట్లు వెలుగుతున్నాయో? ఎక్కడ వెలగడంలేదో? తెలుసుకోవడానికి వీలుగా విజయవాడలోని ముఖ్యమంత్రి డాష్‌బోర్డ్‌కు అనుసంధానించామన్నారు. భూగర్భజలాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా 1600 ఫిజోమీటర్ల ఏర్పాటుచేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల కి.మీ. దూరంపాటు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లను ఏర్పాటుచేసి ప్రతి ఇంటికీ అంతర్జాలం, ఫోన్‌, టీవీ సదుపాయాలు రూ. 149కే అందుబాటులోకి తేనున్నామని పేర్కొన్నారు.