భళా…ఉత్సవ్
హుషారెత్తించిన ప్రీతమ్ సంగీతం..షణ్ముఖప్రియ గాత్రం..
అబ్బురపరిచిన ఇంద్రజాల ప్రదర్శన.. ఆకట్టుకున్న నృత్యరూపకం
విశాఖ ఉత్సవ్ చివరి రోజున పోటెత్తిన సందర్శకులు

గానం.. సంగీతం.. నాట్యం.. రూపకం.. తీన్మార్.. తప్పెటగుళ్లు.. సంబల్పూరి నృత్యం.. సకల కళల విందు.. కనుల పండువగా ముగిసింది. ఆర్కేబీచ్లో శనివారం పోటెత్తిన జన సందోహం విభిన్నాంశాలను ఆస్వాదించింది.
* డాక్టర్ కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో గోదాదేవి నృత్యరూపకం ఆహూతులను కట్టిపడేసింది. గోదాదేవిగా శ్రేయ, విష్ణుమూర్తిగా షీలా ఇచ్చిన ప్రదర్శనకు విశేష స్పందన వచ్చింది. అమెరికా నుంచి వచ్చిన ఈ అక్కచెల్లెళ్లతోపాటు ఇతర కళాకారులు ఆకట్టుకున్నారు.
* విశాఖకు చెందిన బీఎస్ రెడ్డి ఇంద్రజాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* షణ్ముఖ ప్రియ గీతాలాపనలు ఆహూతులను హుషారెత్తించాయి. అమెరికన్ వెరైటీ యాక్ట్ ఆకట్టుకుంది.
* ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రబర్తి తొలిసారిగా విశాఖలో ఇచ్చిన ప్రత్యక్ష ప్రదర్శన ఉత్సాహాన్ని నింపింది.
* జాతర వేదిక వద్ద నిర్వహించిన ఫోక్ కార్నివాల్, క్లాసికల్ డాన్స్, కాంటెంపరరీ డ్యాన్స్, తప్పెటగుళ్లు, గార్గాలు, టాకింగ్ డాల్ షో, సినిమా గీతాలాపన, సంబల్పూర్ డ్యాన్స్.. ఆకట్టుకున్నాయి.
* టీయూ ప్రదర్శనశాల పక్కవేదికలో కురుక్షేత్ర రాయభారం పద్యనాటకం.. వుడా పుష్పప్రదర్శనశాల ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
వ్యాఖ్యాతగా మారిన ఆర్డీ..: విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా దీపిక వ్యవహరించారు. ఈమె తెలుగుభాష ఉచ్ఛరణ క్రమంలో తడబడడంతో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకుడు రెడ్డి శ్రీరాములు నాయుడు మైకు తీసుకుని అతిథులను వేదికపైకి పేరుపేరునా పిలిచారు.
* ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, కాలువ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జడ్పీఛైర్‌పర్సన్ లాలం భవానీ తదితరులు పాల్గొన్నారు.
* విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు వేదికపై ప్రసంగించడానికి నిరాకరించారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తొలుత వేదికపైకి రావడానికి నిరాకరించినా.. తర్వాత కేంద్ర మంత్రి, ఇతర ప్రముఖుల పిలవడంతో వెళ్లారు. ముగింపు వేడుకల్లో తూర్పు నౌకాదళాధిపతి కరంబీర్‌సింగ్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవిందసత్యనారాయణ, వుడా మాజీ ఛైర్మన్ ఎస్.ఎ.రెహమాన్, పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమాదేవి పాల్గొన్నారు.
ప్రదర్శనల పొడిగింపు..: వుడా పార్కు పక్కనున్న ఎంజీఎం మైదానంలో ఏర్పాటు చేసిన పరిమళ పుష్ప ప్రదర్శనశాలకు సందర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ప్రదర్శనతోపాటు.. చిల్డ్రన్స్ రైడ్స్‌ను జనవరి 1 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
ఉత్సాహంగా హెలి రైడ్స్..
విశాఖ ఉత్సవ్ రెండోరోజు మధ్యాహ్నం నుంచి వుడా – పవన్హ్యాన్ ఆధ్వర్యంలో హెలి పర్యాటకం అందుబాటులోకి వచ్చింది. తొలిరోజు 88 మంది హెలికాప్టర్లో పర్యటించి నగర అందాలను వీక్షించారు. శనివారం 104 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. వెలుతురు తగ్గిపోవడంతో 101 మందికి మాత్రమే తిరిగే అవకాశం దక్కింది. శనివారం హెలిపర్యాటకం ద్వారా రూ. 2.52 లక్షల ఆదాయం సమకూరింది.