News

Realestate News

భక్తికొండ కదిలె..

Simhachalam picture

గోవిందనామంతో మార్మోగిన సింహాచలం
పుష్పరథం వెనక కిలోమీటర్లమేర భక్తజనం బారులు
దేవదేవుని గిరి ప్రదక్షిణం…
విశాఖ ‘శక్తి’కి నిదర్శనం..!
ఈనాడు – విశాఖపట్నం, న్యూస్‌టుడే బృందం

కోర్కెలెన్ని తీర్చావో.. కష్టాలెన్ని ఒడ్డెక్కించావో.. కనీవినీ ఎరుగనంత జనం.. కాలినడకన గిరి ప్రదక్షిణం..! ఒకటా, రెండా 32 కి.మీ.లు.. ఒకరా, ఇద్దరా 3 లక్షలకు పైగా భక్తులు.. అందరి ఆత్మలందు శ్రీహరి ఉండగా.. సుదూరమైనా సమీప పయనంగా.. సాగిపోయింది.. సింహగిరి ప్రదక్షిణం! భూతల అరుదైన ఆధ్యాత్మిక¹ వేడుక ఇదేనన్నట్లు.. నిజమైన భక్తికి ప్రతీకగా నిలిచినట్లు.. వీఐపీలు, సాధారణ భక్తులనే భేదాల్లేవు.. అందరిదీ ఒకటే దారి.. భక్తసులభుడైన వరాహలక్ష్మీ నృసింహుని దర్శించుకోవడం.. దేవతలకు కొలువైన, దివ్య ఔషధ వృక్షాలతో అలరారుతున్న సింహగిరి చుట్టి రావడం..!

అడివివరం తొలిపావంచా వద్ద సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో పాదయాత్ర మొదలవగా.. చిన్న పెద్దా తేడాలేకుండా అశేష భక్తజన వాహని పోటెత్తగా.. బిరబిర మంటూ అడుగులు మొదలవగా.. ఉత్సాహం, ఉద్వేగం.. చూసేవారంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటే.. నడిచేవారంతా నిండైన మనస్సుతో స్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతుంటే… లక్షలాది భక్తుల పాదసవ్వడిని భూమాత చల్లగా స్వీకరిస్తుంటే.. సాయంత్రమయ్యేసరికి దివి నుంచి ఆశీర్వాదంలా చిరుజల్లు కురుస్తుంటే.. ముప్పై రెండు కి.మీ.ల దూరం కళ్ల ముందున్నటు కరిగిపోయింది.. మధ్యలో నీరు, తేనీరు, మజ్జిగ, పులిహోరా తక్కువ అనే మాటలేదు.. దాతలు, నివాసితులు, స్వచ్ఛంద సంస్థలు ‘పుణ్య’మూర్తులెందరో..

పుష్పాలతో చక్కగా అలంకరించిన రథం.. అందులో మిలమిలా మెరుస్తూ స్వామివారు. సింహాచలంలో తొలిపావంచా వద్ద రథం ఇలా కదలగానే ప్రాంతమంతా అపన్నస్వామి నామస్మరణతో మార్మోగిపోయింది. రథం ముందుకు కదిలి వెళ్తొంటే.. ఆ వెనకే కొన్ని కిలోమీటర్ల మేర భక్తులు బారులుతీరి ముందుకు సాగారు. సోమవారం తొలిపావంచలో రథం కదిలి అరగంట దాటినా.. ఆ ప్రాంగణం నుంచి కదిలే భక్తులు ఇంకా వేలాదిగా ఉన్నారంటే.. సింహాచలం వీధులు ఎంతగా కిక్కిరిసిపోయాయో అర్థం చేసుకోవచ్చు. తొలిపావంచ నుంచి పాత అడవివరం కూడలి వరకు పుష్పరథం వెనుక వస్తున్న భక్తుల సంఖ్య నిమిషానికి 800 నుంచి 1000 మధ్య సాగింది. రథం పాతఅడవివరం కూడలి నుంచి మరో నాలుగు కిలోమీటర్లు ముందుకెళ్లిన తర్వాత కూడా నిమిషానికి 600 మంది వరకు కూడలి నుంచి ముందుకు సాగడం కనిపించిందని ఆలయ అధికారుల అంచనాలో తెలిసింది. మిట్టమధ్యాహ్నం నడక ప్రారంభమవగా ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు లక్షలాదిగా తరలిరావడం విశేషం. ఆలయ ఈవో రామచంద్రమోహన్‌ మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం కన్నా సాయంత్రం భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మా అంచనాల మేరకు 3 లక్షలకు పైగా భక్తులు ప్రదక్షిణ యాత్రలో పాల్గొన్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి మరింత పెరిగారు’ అని వివరించారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు తొలిపావంచ వద్ద జెండా ­పి ‘గిరిప్రదక్షిణ’ రథయాత్రను ప్రారంభించారు.

దారిపొడవునా దర్శనాలు.. : గిరి ప్రదక్షిణ పుష్పరథంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. యాత్ర పొడవునా ఎక్కడికక్కడ స్థానికులు స్వామికి హారతి పట్టారు. రద్దీ పెరగడంతో మధ్యమధ్యలో కొన్నిచోట్ల రథాన్ని కాసేపు ఆపి భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. రథాన్ని తాకేందుకు, అక్కడి కుంకుమతో బొట్టు పెట్టుకునేందుకు ఎక్కువమంది భక్తులు ఆసక్తిచూపారు. సింహాచలంలో మొదలైన ప్రదక్షిణ పైనాపిల్‌కాలనీ, ముడసర్లోవ పార్కు, హనుమంతవాక కూడలి, అప్పుఘర్‌, వెంకోజీపాలెం, మద్దిపాలెం, సత్యం కూడలి, ఎన్‌ఏడీ, గోపాలపట్నం మీదుగా ముందుకెళ్లింది. భక్తులు వెంకోజీపాలెం వరకు రథం వెనుక వచ్చి అనంతరం కైలాసగిరి మీదుగా తీరం వద్దకు చేరుకొని, సముద్రస్నానాలు ఆచరించారు. అనంతరం అప్పుఘర్‌, ఎంవీపీ, సీతమ్మధార, కప్పరాడ, మురళీనగర్‌ మీదుగా ఎన్‌ఏడీవైపు నడక సాగించారు. 32 కిలోమీటర్ల పొడవునా భక్తులు పాదయాత్రగా గిరిప్రదక్షిణ చేశారు. నడక సాగించలేని భక్తులు మంగళవారం తెల్లవారుజాము నుంచి 32 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలుచేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆశాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మంగళవారం స్వామివారి దర్శనాలు భక్తులకు లభించనున్నాయి.

సముద్రస్నానాలపై నియంత్రణ..: కైలాసగిరి మీదుగా బీచ్‌ వద్దకు వచ్చిన భక్తులు సముద్రంలో స్నానం చేశారు. అలల ఉదృృతి ఎక్కువగా ఉండటంతో ఎక్కువ లోతుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టంగా భద్రత చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు గజ ఈతగాళ్లను ఉంచారు. భక్తులకు వైద్యసేవల పరంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌పరంగా పలుచోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం భక్తులు పోటెత్తడంతో పాతఅడవివరం కూడలి నుంచి హనుమంతవాక వరకు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బీఆర్‌టీఎస్‌ రహదారిలో రెండు వరసలను భక్తులకు కేటాయించి మరో రెండువరసలను వాహనాలకు కేటాయించడంతో కొంతవరకు వాహనదారులకు ఉపశమనం లభించింది. హనుమంతవాకలో జాతీయ రహదారిని దాటే క్రమంలో అటు భక్తులు, ఇటు వాహనదారులకు సమస్యలు ఎదురయ్యాయి. రోడ్డు దాటేందుకు కొంతసమయం భక్తుల్ని, మరికొంత సమయం వాహనాల్ని నియంత్రిస్తూ ట్రాఫిక్‌ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.