బ్రిక్స్ సదస్సు విజయవంతం

వూపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
190 మంది ప్రతినిధుల హాజరు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్‌తో పాటు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు, బ్రిక్స్ దేశాల ప్రముఖులు, వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సదస్సుకు హాజరయ్యారు. ముందుగా అనుకున్నప్రకారం 500 మంది ప్రతినిధులు వస్తారని అంచనావేశారు. అయితే మూడురోజుల సదస్సులో 190 మంది మాత్రమే పాల్గొన్నారు. వీరిలో 53 మంది విదేశీ ప్రతినిధులు కాగా, మిగతావారం స్వదేశీ ప్రతినిధులు. వీరంతా నగరంలోని బీచ్ అందాలు, ఐఎన్ఎస్ కురుసురా మ్యూజియం, కైలాసగిరి, తొట్లకొండ, భీమిలి, సెంట్రల్ పార్కును సందర్శించారు. సింహాచలం వెళ్లి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. అరకు కాఫీని రుచి చూశారు. రెండు రోజుల పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, కమిషనర్ హరినారాయణన్, వుడా వీసీ బాబూరావునాయుడు, నగర పోలీసు కమిషనర్ యోగానంద్ తదితర అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 200 ఇన్నోవా వాహనాలు, ఏసీ బస్సులు, 15 మినీ బస్సులను అతిథుల కోసం వినియోగించారు. పట్టణీకరణ, ఆకర్షణీయ నగరాలపై చర్చ జరగడంతో రానున్న కాలంలో విశాఖ అభివృద్ధికి ఈ అంశాలు ఉపకరిస్తాయని అధికార యంత్రాంగం భావిస్తోంది.
ఫలితాన్నిచ్చిన భద్రత చర్యలు
సదస్సు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో నగరంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల సెగ సదస్సుపై పడకుండా పోలీసు యంత్రాంగం భధ్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేసింది. సదస్సు జరిగే వేదికకు దారి తీసే మార్గాల వద్ద పోలీసు అవుట్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టింది. మొత్తంగా సదస్సు సాఫీగా ముగియడం, నగరానికి ఉన్న ప్రతిష్ఠ మరోసారి ఇనుమడింపచేసే విధంగా కార్యక్రమాలు కొనసాగడంతో యంత్రాంగం వూపిరి పీల్చుకుంది. ఈనెల 23 నుంచి నగరంలో జరగనున్న అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై యంత్రాంగం ఇప్పుడు దృష్టి సారించనుంది.