News

Realestate News

బ్రాండ్‌సిటీ’ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి విశాఖ అనువైనదని ప్రతినిధి బృందం సూచన

బ్రాండ్‌సిటీ… వాణిజ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లే నయా వ్యూహమిది… ప్రపంచ నలుమూలల్లో తయారైన అత్యంత నాణ్యమైన ఉత్పత్తులకు వేదిక ఇది… ప్రజలకు సుఖమైన, సౌకర్యవంతమైన, ఒకరకంగా విలాస జీవితాన్ని అందుబాటులోకి తేవడమే కాక వాణిజ్య పర్యాటకానికి పునాదులు వేస్తుంది… మన రాష్ట్రంలోనూ ఇలాంటి బ్రాండ్‌ సిటీ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది… దాన్ని విశాఖలో ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది…

ఈనాడు-విశాఖపట్నం

విభజన తర్వాత విశాఖ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పారిశ్రామికంగా, వస్తు ఎగుమతి-దిగుమతులకు కీలక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలో తెరపైకి వచ్చిన అంతర్జాతీయ బ్రాండ్‌ సిటీని మహా నగరంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో పరిశీలన జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు అధికారులు రంగంలో దిగారు. తీర ప్రాంతమైన విశాఖ నగరం బ్రాండ్‌ సిటీ ఏర్పాటుకు అన్ని విధాలా అనువైనదని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే ఈ మహా నగరం పారిశ్రామికీకరణలో మరో మైలురాయిని అధిగమించినట్లవుతుంది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులొచ్చి పర్యాటకంగా కూడా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయి.

బ్రాండ్‌ సిటీ అంటే ఏమిటి..?
ప్రపంచంలోని నాణ్యమైన వస్తూత్పత్తికి చిరునామాగా నిలిచే బ్రాండ్‌(సంస్థ)లన్నీ ఒకేచోట తమ ఉత్పత్తులను అమ్మకానికి పెడుతుంటాయి. ఫార్చ్యూన్‌ 500 జాబితాలో ఉన్నవాటిలో పలు సంస్థలు బ్రాండ్‌సిటీల వేదికగా వాణిజ్యాన్ని విస్తరిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపయోగపడే వస్తువుల దగ్గరి నుంచి గృహోపకరణాలు, శరీర సౌందర్య సాధనాలు, దుస్తులు, ఆహార సంబంధ ఉత్పత్తులు, మోటారు వాహనాలు ఇలా వస్తువునూ వాటిని తయారుచేసే బ్రాండ్‌లు తమ విక్రయశాలలను ఈ బ్రాండ్‌సిటీలో ఏర్పాటుచేస్తాయి.

ఇటు వ్యాపారం… అటు ఉపాధి…
విశాఖలో బ్రాండ్‌ సిటీ ఏర్పాటైతే ప్రపంచస్థాయి కంపెనీల నుంచి బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని ఫెసిలిటేటర్‌గా వ్యవహరించే డాక్టర్‌ రిక్‌ కార్డిన్‌ నేతృత్వంలోని హార్వార్డ్‌ స్క్వేర్‌ టెక్నాలజీ పార్టనర్స్‌ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అగ్రశేణి ఫార్చ్యూన్‌ విభాగంలో 500 ఉత్పత్తుల్లో వంద ఉత్పత్తులను ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారని తెలిసింది. దీంతో ఈ నగరం దేశానికే తలమానికంగా మారే అవకాశాలున్నాయని వెల్లడించారు. బ్రాండు సిటీ ఏర్పాటైతే ఏటా 20 లక్షల మంది ప్రపంచస్థాయి పర్యాటకులు సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేసే వీలుందని అంచనా వేస్తున్నారు. నిత్యం లక్షల మంది సాధారణ సందర్శకులు రావడంతో పాటు లక్ష మందికి బ్రాండు సిటీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో…
అమెరికా, జపాన్‌, సింగపూర్‌ వంటి అభివృద్ధి దేశాల్లో బ్రాండ్‌ సిటీలకు ఎంతో ఆదరణ ఉంది. అమెరికాలోనే వివిధ నగరాల్లో పది ప్రఖ్యాత బ్రాండ్‌ సిటీలున్నాయి. వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ బ్రాండ్‌ సిటీల్లో సందర్శకుల కోసం భారీ హోటళ్లు, క్రీడా ప్రాంగణాలు, అంకుర కేంద్రాలు కూడా ఉంటాయి. ఈ సిటీలను ఎక్కువగా విదేశీ పర్యాటకులు సందర్శించి తమకు అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు.

అంకురించిన ఆలోచన…
ఇదే తరహా బ్రాండ్‌ సిటీని మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు ఫెసిలిటేటర్‌గా వ్యవహరించే డాక్టర్‌ రిక్‌ కార్డిన్‌ నేతృత్వంలోని హార్వార్డ్‌ స్క్వేర్‌ టెక్నాలజీ పార్టనర్స్‌ ప్రతినిధి బృందం బుధవారం రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. తీర ప్రాంతమై.. ఎగుమతులు, దిగుమతులకు అనువైన, విదేశాలకు విమాన సర్వీసులు నడిచే, ఇప్పటికే తగిన మౌలిక సదుపాయాలు కలిగిన నగరమైతే బ్రాండ్‌ సిటీ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ఆయా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ సందర్భంలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, కృష్ణపట్నం ఓడరేవు వంటివి ప్రస్తావనకు వచ్చాయి. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న తీర నగరమైన విశాఖను బ్రాండ్‌ సిటీ ఏర్పాటుకు అనువుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రతినిధి బృందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బ్రాండ్‌ సిటీ ఎక్కడైతే బాగుంటుంది.. వ్యాపార అవకాశాలు.. మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

విశాఖే ఎందుకంటే…
విశాఖ నగరం మౌలిక వసతుల పరంగానే కాదు.. కొనుగోలు శక్తి కోణంలోనూ ముందడుగులో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు తలసరి ఆదాయం విషయంలో హైదరాబాదు తర్వాత రెండోస్థానంలో ఉండేది. విభజన తర్వాత తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విశాఖ జిల్లాయే మొదటిస్థానంలో ఉంది. అంతేకాదు.. దీని చుట్టుపక్కల గల జిల్లాల్లో తూర్పుగోదావరి నుంచి కృష్ణా జిల్లా వరకూ చక్కటి ఆర్థిక వనరులు గల ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు విశాఖ నగరం అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలతో కూడా చక్కని రోడ్డు, రైలు, వైమానిక అనుసంధానతను కలిగిఉంది. దీంతో ఇక్కడ బ్రాండ్‌ సిటీని ఏర్పాటుచేస్తే నగరానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్థల సేకరణ ఎలా?
బ్రాండు సిటీని విశాఖలో ఏర్పాటు చేయాలని అనుకుంటే అనువైన ప్రాంతం, ఇందుకోసం అవసరమైన భూముల సేకరణ ఎలా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకేచోట వందలాది ఎకరాల భూములను సమీకరించి అందజేయడమంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని సంబంధిత అధికారులే చెబుతున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజడ్‌)లో కొన్ని ఖాళీ భూములున్నా, బ్రాండు సిటీ ఏర్పాటుకు అనువైన ప్రాంతమా? కాదా? అన్నది సందేహం. నగర పరిధిలోనే కావాలనుకుంటే కొంత సమయం అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే యోచనతో సంబంధిత వర్గాలు ఉన్నాయి.

బ్రాండ్‌సిటీల విస్తరణ ఇలా…
అమెరికాలో 10 బ్రాండ్‌ సిటీలు మనుగడలో ఉన్నాయి. అత్యధిక నగరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత సంస్థలకు చెందిన అన్ని రకాల ఉత్పత్వులు వీటిలో అందుబాటులో ఉంటాయి. దేశీయంగా, విదేశీ పర్యాటకులంతా బ్రాండ్‌ సిటీలను సందర్శించి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. వీటిలో ఎక్కువగా క్రయ, విక్రయాలు జరిగి అమెరికాకు విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది.

సింగపూర్‌లోనూ 5 బ్రాండు సిటీలు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఈ దేశం గత కొన్నేళ్లుగా బ్రాండు సిటీలను స్వాగతిస్తోంది. విదేశీ పర్యాటకుల కోసం వీటిని అందుబాటులో ఉంచి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని సింగపూర్‌ ప్రభుత్వం సాధిస్తోంది. అన్ని ప్రఖ్యాత సంస్థల ఉత్పత్తులు ఈ సిటీల్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పర్యాటకుల వినోదం కోసం పెద్దపీట వేస్తున్నారు.

మలేషియాలోనూ 10 బ్రాండు సిటీలు ఉన్నాయి. అన్ని ప్రఖ్యాత ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో ఉండటంతో ప్రజలు వీటి సందర్శనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సిటీల్లో మార్కెటింగ్‌తోపాటు వినోద, విజ్ఞాన, క్రీడా సంబంధిత అంశాలకు పెద్దపీట వేశారు. దీంతో నిత్యం లక్షల మంది ఈ బ్రాండు సిటీలను సందర్శిస్తుంటారు.

చైనాలోనూ 12 బ్రాండు సిటీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గత 15 ఏళ్లుగా ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రజల్లో ఎక్కువమంది తమకు కావలసిన ప్రఖ్యాత సంస్థల ఉత్పత్తుల కోసం ఈసిటీలను సందర్శిస్తుంటారు. చైనాతోపాటు ఇతర దేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ఉత్పత్తులు వీటిలో కొనుగోలు చేయొచ్చు. వీటిలో అంతర్జాతీయస్థాయి హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.