News

Realestate News

బొర్రాగుహల అందాలు అద్భుతం

బొర్రాగుహల అందాలు అద్భుతం
కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ
అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: బొర్రాగుహలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కుటుంబంతో సహా గుహలను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన ఇవి ఎంతో సౌందర్యంగా ఉన్నాయని చెప్పారు. గుహలను ఆనుకుని నది ప్రవహించడం మరింత అలరించిందన్నారు. వీటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం అరకులోయ బయలుదేరి వెళ్లారు. ఆయతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి, వివివి.రమణ, ఏటీడబ్ల్యూ సూర్యనారాయణ, మండల విద్యాశాఖాధికారి ఎల్‌బీ వెంకటరావు పాల్గొన్నారు.

రికార్డుస్థాయిలో ఆదాయం
అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: బొర్రాగుహలకు పర్యటకులు అధికంగా వస్తున్నారు. గత మూడు రోజుల్లో సుమారుగా 26 వేలమంది  గుహలను తిలకించారు. దీనివల్ల రూ.18 లక్షల వరకు ఆదాయం సమకూరింది.
క్రిస్మస్‌ సెలవులు కావడంతో అధిక సంఖ్యలో పశ్చిమబంగా, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చారు. వాహనాలు నిలపడానికి ఎక్కడికక్కడే పార్కింగ్‌ స్థలాలను అనంతగిరి ఎస్‌ఐ డోలా వెంకన్న తన బృందంతో కలిసి కేటాయించారు. మొత్తం 30 మంది పోలీసులు వాహనాలు రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

సందర్శకుల వెల్లువ
అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రా ఊటీ అరకులోయకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. రాత్రి తొమ్మిది దాటుతున్నా సందర్శిత ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తదితర ప్రదేశాలు పర్యటకులతో సందడిగా ఉంటున్నాయి. పర్యటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని అదనపు సమయాన్ని సైతం కేటాయించి సందర్శకులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అతిథిగృహాలు, ప్రైవేట్‌ లాడ్జిలు నిండిపోయాయి. శని, ఆదివారాల్లో అరకులోయ మ్యూజియాన్ని సుమారు 6500 మంది, సోమవారం సుమారు 3 వేల మందిపైగా మ్యూజియాన్ని సందర్శించారు.