News

Realestate News

బృహత్తర అభివృద్ధి

An ambitious development

బృహత్తర అభివృద్ధి
మాస్టర్‌ ప్లాను తయారీకి రంగం సిద్ధం
వుడాలో కొత్త ప్రాంతాలకూ ప్రణాళిక
ఈనాడు – విశాఖపట్నం

విశాఖ మెట్రో పాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాను) తయారీకి రంగం సిద్ధమవుతోంది. దాదాపు 2036 సంవత్సరం వరకూ ఈ కొత్త ప్రణాళిక అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బృహత్తర ప్రణాళిక తయారీ బాధ్యతను ప్రభుత్వం ఇప్పటికే ‘లీ అసోసియేట్స్‌’కు అప్పగించింది. ఈ నెల 30న వివిధ సంస్థల అధికారులతో నగరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) 2006వ సంవత్సరంలో 1725 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి తయారు చేసిన బృహత్తర ప్రణాళికనే ప్రస్తుతం అమలు చేస్తోంది. దీని ఆధారంగానే కొత్త లేఅవుట్లు, వివిధ నిర్మాణాలు, పరిశ్రమల స్థాపనకు వుడా అధికారులు అనుమతులిస్తున్నారు. ప్రభుత్వం 2010లో కొత్త ప్రాంతాలను కలిపి వీఎండీఆర్‌ఏగా ప్రకటించింది. దీంతో వుడా విస్తీర్ణం 6,764 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. కొత్తగా కలిసిన 5039 చదరపు కిలోమీటర్లకు ఇప్పటివరకు బృహత్తర ప్రణాళిక లేక పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వుడాలో కొత్తగా కలిసిన ప్రాంతాల్లో అధికభాగం పంచాయతీలే ఉన్నాయి. సరైన ప్రణాళిక లేక అనేకచోట్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలిశాయి.

పాత, కొత్త ప్రాంతాలతో కలిపి….
వుడాలోని పాత ప్రాంతానికి ఇప్పటికే ఉన్న బృహత్తర ప్రణాళికకు సవరణ, కొత్త ప్రాంతాలకు ప్రణాళిక తయారీ కోసం ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వుడాకు విశాఖ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎండీఏ)గా ఉన్నత స్థాయి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈలోగా వుడా పరిధిలో కొత్తగా కలిసిన ప్రాంతాలకూ బృహత్తర ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఎండీఏ ఏర్పాటు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం, ఇతర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి భారీగా నిధులొచ్చే అవకాశాలున్నాయి.

ఈ నేపథ్యంలోనే వుడా పరిధిలోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. బృహత్తర ప్రణాళిక ఎలా ఉండాలి? ఉన్న ప్రణాళికలో ఎలాంటి సవరణలు చేయాలో అందరి నుంచీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు సేకరించనున్నారు. అనంతరం ప్రణాళిక తయారీ కోసం తదుపరి చర్యలు తీసుకుంటారు.

ఐదు దశల్లో ప్రణాళిక తయారీ….
స్టేజ్‌-1
వుడా పరిధిలోని 6,764 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రస్తుత పరిస్థితులపై పరిశీలన చేసి 2017 మార్చికి నివేదిక సిద్ధం చేస్తారు. ఇందుకోసం మూడు విడతలుగా సర్వే నిర్వహించి సేకరించిన సమాచారాన్ని మదించి నివేదికను రూపొందిస్తారు.

స్టేజ్‌-2
వుడా పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై 2017 నవంబరుకు నివేదిక రూపొందిస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి, ఏయే రంగాల అభివృద్ధికి అవకాశాలున్నాయి? తీసుకోవాల్సిన చర్యలను ఇందులో సూచిస్తారు. దీన్ని ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రణాళికగా చెప్పుకోవచ్చు.

స్టేజ్‌-3
వుడా పరిధిలోని 6,764 చదరపు కిలోమీటర్ల ప్రాంత బృహత్తర ప్రణాళిక ముసాయిదాను 2018 జనవరికి సిద్ధం చేస్తారు. నివాస, పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాలను ఇందులో నిర్దేశిస్తారు.

స్టేజ్‌-4
వుడా కొత్త, పాత ప్రాంతాలకు బృహత్తర ప్రణాళిక ముసాయిదాతోపాటు జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రతిపాదనలను 2018 మార్చికి సిద్ధం చేయనున్నారు. వీటిని అధికారులు పరిశీలించి పలు సూచనలు చేస్తారు. ఈ మేరకు సవరణలు చేసే అవకాశాలున్నాయి.

స్టేజ్‌-5
ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకొని 2018 ఆగస్టుకు వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక తయారు చేయనున్నారు. ప్రభుత్వ తుది పరిశీలన తరువాత దీన్ని ఆమోదిస్తారు.

బృహత్తర ప్రణాళిక ఉద్దేశమిది….
* భవిష్యత్తులో గృహ నిర్మాణాల కోసం అమలు చేయాల్సిన పద్ధతులు, అందుబాటులోఉన్న భూముల వివరాలను స్పష్టంగా గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవచ్చు..
* వుడాలో కొత్తగా చేర్చిన ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాల నిర్వహణకు వీలుందో గుర్తిస్తారు. ప్రత్యేకించి పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలను స్పష్టంగా ప్రణాళికలో పేర్కొంటారు.
* రాబోయే అవసరాలకు వీలుగా రహదారుల నిర్మాణాన్ని నిర్దేశిస్తారు. ఏయే ప్రాంతాల్లో ఆవాసాలు, జనాభా పెరిగే అవకాశాలున్నాయో గుర్తించి అక్కడ రహదారుల నిర్మాణ ఆవశ్యకతను ప్రస్తావిస్తారు.
* పర్యావరణపరంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రణాళికలు రూపొందిస్తారు. పెరిగే జనాభా, మోటారు వాహనాల వినియోగంతో తలెత్తే పర్యావరణ సమస్యలను ప్రస్తావిస్తూ, వీటిని అధిగమించే మార్గాలను సూచిస్తారు.
* ప్రజా రవాణా వ్యవస్థను ఏవిధంగా మెరుగు పరుచుకోవాలి, ఇందుకోసం అనుసరించాల్సిన విధానాలను సూచిస్తారు. వుడా పరిధిలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితి, కొత్త ప్రాంతాలతో కలుపుకొని ప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాల వినియోగం తదితర అంశాలపై సూచనలు చేస్తారు.
* వుడా పరిధిలో చేపట్టే వ్యాపార కార్యకలాపాలపైనా సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. ఎలాంటి ప్రాజెక్టుల నిర్వహణకు వీలుంది, ఇందుకోసం నిధుల సమీకరణ, ప్రాజెక్టుల నుంచి ఆదాయ వృద్ధి వంటి అంశాలను సూచిస్తారు. రాబోయే రోజుల్లో వుడా చేపట్టే కార్యకలాపాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

బృహత్తర ప్రణాళికలో కలిసే ప్రాంతాలు….
విశాఖపట్నం: 19 మండలాలు, 374 గ్రామాలు
శ్రీకాకుళం: 11 మండలాలు, 417 గ్రామాలు
విజయనగరం: 16 మండలాలు, 521 గ్రామాలు
తూర్పు గోదావరి: 4 మండలాలు, 28 గ్రామాలు
నాలుగు జిల్లాల్లో కలిసే జనాభా: 52,93,369
విస్తీర్ణం: 6,764 చదరపు కిలో మీటర్లు
నగరపాలక సంస్థలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం
పురపాలక సంఘాలు: ఆమదాలవలస, తుని, ఎలమంచిలి
నగర పంచాయతీలు: రాజాం, నెల్లిమర్ల

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo