News

Realestate News

బీచ్‌ రోడ్డులో బడ్జెట్‌ హోటల్‌

బీచ్‌ రోడ్డులో బడ్జెట్‌ హోటల్‌

వుడాకు ప్రతిపాదనలు సమర్పించిన సంస్థలు

సందిగ్ధంలో సంస్కృతి ప్రాజెక్టు

విశాఖపట్నం

బీచ్‌ రోడ్డులోని కురుసురా జలాంతర్గామి ప్రదర్శన శాలకు ఎదురుగా ఉన్న 1600 గజాల స్థలంలో బడ్జెట్‌ హోటల్‌ నిర్మాణానికి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) మరో అడుగు ముందుకేసింది. దీనితోపాటు వుడా పార్కులో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటుకు మూడు నెలల క్రితం వివిధ ప్రయివేటు సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ రెండు ప్రాజెక్టులకు అర్హులైన వారు తమ ప్రణాళికలు, అంచనా వ్యయంతో హాజరవవచ్చని పేర్కొంది.

సోమవారం ఏడు సంస్థలు ముందుకొచ్చాయి. వీటి ప్రతినిధులు వుడా ఉన్నతాధికారులను కలిసి తమ ప్రణాళికలు, నమూనాలు, బడ్జెట్‌ అంచనా వ్యయాన్ని దృశ్యరూపంలో ప్రదర్శించారు. బడ్జెట్‌ హోటల్‌ ఏర్పాటుకు శ్రీకన్య గ్రూప్‌, అంబికా, ఆదిలక్ష్మి రాయల్‌ పార్క్‌ కాకినాడ, కీస్‌ హోటల్‌కు చెందిన బెర్గ్యూన్‌, ఆస్ట్రేలియాలో గొలుసు హోటళ్లు నడుపుతున్న బురిటో గ్రూప్‌ ఆసక్తిని ప్రదర్శించాయి. ఒక్కో సంస్థ బడ్జెట్‌ హోటల్‌పై రూ. 5 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సముఖంగా ఉన్నట్లు వాటి ప్రతినిధులు.. అధికారులకు వివరించారు. ప్రస్తుతం ఇవి పరిశీలనలో ఉన్నాయి.

సంస్కృతి ప్రాజెక్టుపై సందిగ్ధం
రాజస్థాన్‌ రాష్ట్రంలో చౌకీథాని పేరుతో నిర్వహిస్తున్న సంస్కృతి పర్యాటక ప్రాజెక్టును గతంలో వుడా అధికారులు పరిశీలించారు. నగరంలోనూ అదే తరహాలో ఓ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావించారు. వుడా పార్కును ఆనుకుని ఉన్న ఎంజీఎమ్‌ పార్క్‌ స్థలం 8 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఇందులో పల్లె వాతావరణంతో జాతరను తలపించేలా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలన్నది అధికారుల ఉద్దేశం. రాత్రి వేళల్లో ప్రవేశం కల్పించి, పర్యాటకంగా మంచి ఆదాయ వనరుగా రూపొందించాలనుకున్నారు. ఈ ప్రాజెక్టుపై సవివర పథక నివేదికలతో ఆసక్తి ఉన్న సంస్థలను రమ్మని ఆహ్వానించారు. బడ్జెట్‌ హోటల్‌ ఏర్పాటుకు ఆసక్తి కనబర్చిన సంస్థలతో పాటు జలవిహార్‌ సంస్థ కూడా ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అంచనాలు మారిపోయాయి.

మొదట్లో ఎనిమిది ఎకరాల స్థలం ఉన్నట్లు చూపించిన అధికారులు.. మధ్యలో కొంతభాగంలో హెలీ పర్యాటకం కోసమని హెలీప్యాడ్‌ నిర్మించారు. ఇటీవల యుద్ధ విమాన ప్రదర్శనశాల కోసమని రెండు ఎకరాలను కేటాయించారు. నౌకాదళ మ్యూజియం కోసం 5 వేల గజాల స్థలాన్ని చూపించారు. దీంతో ఎనిమిది ఎకరాల్లో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది. ఏటా నిర్వహించే విశాఖ ఉత్సవ్‌లో పుష్ప ప్రదర్శన, ఇతర స్టాల్స్‌ ఏర్పాటుకు ఈ స్థలాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ స్థలాన్ని సంస్కృతి పర్యాటక ప్రాజెక్టుకు కేటాయిస్తే భవిష్యత్తులో స్థలం ఇబ్బంది ఎదురవుతుందని వుడా అధికారులు ఆలోచనలో పడ్డారు. పైగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మధురవాడలో ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటు కానుందని, అదే తరహా ఇక్కడ ఏర్పాటు చేయడం అవసరమా? అన్న కోణంలోనూ చర్చలు జరుపుతున్నారు. దీంతో రూ. 30 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుపై సందిగ్ధం నెలకొంది.