News

Realestate News

బీచ్‌రోడ్డులో భూగర్భ కరెంటు

Underground current in Beach road vizag picture

వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ
తొలి విడత పనులు అక్టోబరులో మొదలు

రూ. 720 కోట్లు
మొత్తం ప్రాజెక్టు విలువ

రూ. 240 కోట్లు
తొలి విడత అంచనా వ్యయం

68 శాతం
తొలివిడతలో ప్రపంచబ్యాంకు వాటా

32 శాతం
రాష్ట్ర ప్రభుత్వ వాటా

ఈనాడు – విశాఖపట్నం

భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు కోసం తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఒప్పంద నమూనా పత్రాలు రెండ్రోజుల క్రితమే ఈపీడీసీఎల్‌ అధికారులకు అందాయి. ఆగస్టులోపే రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు, ఈపీడీసీఎల్‌ కలిసి ఈ ప్రాజెక్టుమీద ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. అనంతరం టెండర్లను ఆహ్వానించాలని ఈపీడీసీఎల్‌ భావిస్తోంది.

విశాఖలో భూగర్భ విద్యుత్తు తీగల వ్యవస్థ ద్వారా ప్రకృతి విపత్తుల సమయంలో సమర్ధంగా సేవలందించవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం ప్రపంచబ్యాంకుతో గతంలో ఒప్పందం కుదిరింది. రూ. 720 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును నాలుగు భాగాలుగా చేశారు. ఇప్పటికే మూడు భాగాల సవివర పథక నివేదికలను తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. తొలి విడతలో బీచ్‌రోడ్డులో ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీని అంచనా వ్యయం రూ. 240 కోట్లు.

ప్రాజెక్టు ఎలా ఉంటుందంటే..
* రహదారికిరువైపులా కాలువలున్నాయి. అవి దెబ్బ తినకుండా కాలిబాటల పక్క నుంచి రహదారివైపు పనులు చేసేలా అధికారులు డిజైన్లు రూపొందించారు.

* రెండు మీటర్ల లోతున, 1.2 మీటర్ల వెడల్పుతో గోతులను తీస్తారు. రహదారులు, వీధుల వెడల్పులను బట్టి ఈ కొలతలు మారొచ్చు. మరీ ఇరుగ్గా ఉన్న వీధుల్లో ఏం చేయాలన్నదానిపై ఈపీడీసీఎల్‌ ఆలోచన చేస్తోంది. ఇలాంటిచోట్ల తీగల్ని పైనుంచి తీసుకెళ్లాలా లేక మరో మార్గం చూడాలా? అన్నది చర్చల్లో ఉంది.

శాఖల సహకారం లేకపోతే..
నగరవ్యాప్తంగా చాలాచోట్ల వివిధ సంస్థల కేబుళ్లు భూగర్భంలో ఉన్నాయి. జీవీఎంసీ సివరేజ్‌ పైపులైన్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుళ్లు, ప్రైవేటు కంపెనీల తీగలు.. ఇలా చాలా ఉన్నాయి. గోతులను తవ్వేటపుడు వీటికి ఇబ్బంది రాకుండా చూడాల్సి ఉంది. ఇందుకు ఆయా సంస్థల సహకారం కీలకం. ఎక్కడ పైపులైన్లు ఉన్నదీ, ఎక్కడ తీగలున్నదీ ఆయా విభాగాలకు కచ్చితంగా తెలిసిఉంటుంది కాబట్టి.. వారి సమక్షంలో పనులను చేపట్టాలన్నది అధికారుల ఆలోచన. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెండు మూడు సమావేశాలు జరిగాయి. ఇప్పుడు తీసే గోతుల్లోనే బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన తీగలు కూడా ఉంటే బాగుంటుందనే కోణంలో సంప్రదింపులు జరుగుతున్నాయి.

పర్యవేక్షణకూ టెండరు..
ఈ ఆగస్టులో మొదటి విడత పనులకు టెండర్లు పిలవాలని ఈపీడీసీఎల్‌ భావిస్తోంది. అక్టోబరులో పనులు మొదలుపెట్టాలని చూస్తోంది. 4 ఫేజ్‌లు కలిపి ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 2019 జనవరి వరకు గడువు ఉంది. అక్టోబరులో మొదటివిడత పనులు మొదలుపెడితే వెనువెంటనే ఇతర ఫేజ్‌ల పనుల టెండర్లనూ పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎండీ రేవు ముత్యాలరాజు తెలిపారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణకూ, పనుల సమయంలో సాంకేతిక సలహాలు ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా టెండరు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకబృందం కోల్‌కతా వెళ్లి అక్కడ భూగర్భ విద్యుత్తు ప్రాజెక్టును పరిశీలించి వచ్చింది.