News

Realestate News

బీఆర్టీఎస్‌ పనుల్లో కదలిక

Real Estate News

అడివివరంలో సర్వే ప్రారంభం

అడివివరం, న్యూస్‌టుడే: సింహాచలం ట్రాన్సిట్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగంగా అడివివరంలో నిలిచిపోయిన బీఆర్టీఎస్‌ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు సూచన మేరకు స్థానికంగా గోశాల కూడలి నుంచి పాత అడివివరం వరకు ప్రస్తుత రహదారికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలు, ఖాళీ స్థలాల వివరాల సేకరణకు సోమవారం సర్వే ప్రారంభమైంది. ఆరో జోన్‌ టీపీఏ రామలింగేశ్వరెడ్డి, సర్వేయర్‌ బాబూరావు ఆధ్వర్యంలో సిబ్బంది సర్వేను ప్రారంభించారు. సర్వేలో భాగంగా గతంలో సేకరించిన వివరాల ఆధారంగా ప్రస్తుతం 50శాతం కన్నా తక్కువ, 50శాతం పైబడి, వంద శాతం నష్టపోతున్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి..? నష్టపోయే శాతం వివరాలను కొలతల ద్వారా నిర్ధారిస్తామని టీపీఏ రామలింగేశ్వరరెడ్డి తెలిపారు. సర్వే సందర్భంగా ఆస్తులు, స్థలాలు కోల్పోతున్న వారు తమ హక్కు పత్రాలు, ఇంటి పన్ను, విద్యుత్తు బిల్లు, తదితర వివరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి నివేదికను కమిషనర్‌కు అందజేస్తామని పేర్కొన్నారు. తొలుత గోశాల సమీపంలో జరుగుతున్న సర్వేను తెదేపా నాయకులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో తెదేపా అర్బన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పాశర్ల తెదేపా 72వ వార్డు అధ్యక్షుడు పీవీ నరసింహం, ఉపాధ్యక్షుడు లంక సత్తిబాబు, సహకార సంఘం ఉపాధ్యక్షుడు దాసరి కనకరాజు, రాంబాబు, సర్వేయర్‌ రవి పట్నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

అటవీ ప్రాంతంలో…
బీఆర్టీఎస్‌ రహదారి విస్తరణలో భాగంగా పాత అడివివరం కూడలి గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న కంబాలకొండ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. డిప్యూటీ రేంజ్‌ అధికారి ఎల్‌బీకే పాత్రుడు ఆధ్వర్యంలో సిబ్బంది అటవీ ప్రాంత సరిహద్దు రాళ్ల ఆధారంగా సర్వే జరిపారు. పాత్రుడు మాట్లాడుతూ సరిహద్దు రాళ్ల వద్ద నుంచి సుమారు 6 మీటర్లు కొండవైపు రహదారి విస్తరణకు ప్రతిపాదించారన్నారు. ప్రజోపయోగ అవసరాలకు అటవీ భూమిని అనుమతించే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందుకోసం హెక్టారు భూమిని కేటాయిస్తారని, ఇక్కడ పరిస్థితి ఉన్నతాధికారుల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని సర్వే నిర్వహించి వారికి నివేదిస్తామన్నారు.