బిల్లుల భారం నుంచి ఊరట
వినియోగమే కాదు.. విక్రయించుకోవచ్చు..
సౌర విద్యుత్తు ప్లాంట్లపై 30 శాతం రాయితీ
మిగులు యూనిట్లకు డబ్బులు జమ
న్యూస్‌టుడే- గుజరాతీపేట (శ్రీకాకుళం)
సూర్యరశ్మి.. ఎన్నటికీ తరగని వనరు.. సంప్రదాయ ఇంధన వనరులు నానాటికి తరిగిపోవడంతో పాటు ఖరీదవుతున్న నేపథ్యంలో సౌర విద్యుచ్ఛక్తికి ఆదరణ పెరుగుతోంది. గృహాలు, వాణిజ్య అవసరాలు, పరిశ్రమల్లో సౌర విద్యుత్తు వినియోగం ద్వారా జల, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అవసరాలు గణనీయంగా తగ్గుతాయి. ఉత్పత్తి వ్యయంతో పాటు వినియోగ వ్యయమూ తగ్గుతుంది. మరోవైపు మిగులు విద్యుత్తును గ్రిడ్ ద్వారా అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు కూడా.
ఏర్పాటు చేసుకోవడం ఎలాగంటే..
సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు నగరంలోని జిల్లా నెడ్‌క్యాప్ కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలి. సంబంధిత అధికారులు ఈపీడీసీఎల్ అధికారులకు విషయం తెలియజేసి ఉమ్మడిగా తనిఖీ చేస్తారు. గృహాలకు సాధారణంగా ఒక కిలోవాట్ నుంచి అయిదు కిలోవాట్ల ఉత్పత్తి ప్లాంటు అమరుస్తారు. పరిశ్రమలకు ఒక మెగావాట్ నుంచి ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్తు కావాలన్నా అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఒక కిలోవాట్ యూనిట్ ఏర్పాటుకు రూ. 60 వేల ఖర్చు అవుతుంది. ఇందులో 30 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. గృహావసర వినియోగదారులు అవసరనుకుంటే అయిదు కిలో వాట్లకు మించి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
నెట్‌మీటర్
సౌర విద్యుత్తు వినియోగించుకునే వారి ఇంట్లో నెట్‌మీటర్ ఏర్పాటు చేస్తారు. వినియోగదారు ఈపీడీసీఎల్ విద్యుత్తు ఎన్ని యూనిట్లు వినియోగిస్తున్నారు. సౌర విద్యుత్తు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో ప్రతిరోజు ఇందులో నమోదవుతుంది. రెండింటినీ బేరీజు వేసి.. నెలకు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అయితే దాన్ని వినియోగం నుంచి మినహాయించి గ్రిడ్‌కు పంపిస్తుంది. మిగిలిన మొత్తాన్ని గ్రిడ్ నుంచి వినియోగదారు ఖాతాకు జమ చేస్తారు. ఉదాహరణకు నెలకు రూ. 500 విద్యుత్తు బిల్లు వచ్చే వినియోగదారునికి సౌర విద్యుత్తును వినియోగంతో రూ. 250 నుంచి రూ. 300 బిల్లు వస్తే.. మిగతా రూ. 200 విలువ చేసే విద్యుత్తు గ్రిడ్‌కు అనుసంధానం అవుతుంది. వినియోగదారుని ఖాతాకు ఆ డబ్బులు జమవుతాయి.
నిర్వహణపై భయం
సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేసుకున్న తరువాత సాంకేతిక లోపాలు తలెత్తితే సంబంధిత ఏజెన్సీలు తక్షణం స్పందిస్తాయో లేదా అనే మీమాంసతో ఎక్కువ మంది వినియోగదారులు మందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్లాంటు మరమ్మతులకు గురైతే తక్షణం బాగుచేసే సాంకేతిక సిబ్బంది తగినంత మంది అందుబాటులో లేకపోవడం కూడా ఓ కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహణ విషయంలో ఏజెన్సీలకు ప్రభుత్వం గట్టి సూచనలు చేసిందని విద్యుత్తు సంస్థ అధికారులు చెబుతున్నారు. సాంకేతిక నిపుణుల సంఖ్యను పెంచడానికి కార్యాచరణ తయారు చేస్తోందని చెబుతున్నారు.
* జిల్లా కేంద్రంలోని రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో సౌర విద్యుత్తు కొంత భాగంలో 30 కిలో వాట్ల యూనిట్ ఏర్పాటు చేశారు. దీని వల్ల విద్యుత్తు బిల్లులో నెలకు రూ. 25 వేల వరకు ఆదా అవుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
* జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 40 కిలో వాట్లు, తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్ఈ కార్యాలయం, నగరపాలక సంస్థ కార్యాలయం పైకప్పులపై 30 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్తు వినియోగం పెరిగిన తరువాత అంతకుముందు వచ్చిన విద్యుత్తు బిల్లు సగానికి తగ్గుతోందని ఆయా కార్యాలయాల అధికారులు చెబుతున్నారు.
* నగరానికి చెందిన డాక్టర్ అరవింద్ తన ఇంటి పైకప్పుపై మూడు కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు పలకలు అమర్చుకున్నారు. సౌర విద్యుత్తు సదుపాయం కల్పించుకోకముందు ఆయన నెలకు రూ. 1500 వరకు విద్యుత్తు బిల్లు చెల్లించేవారు. సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైన తరువాత నెలకు రూ. 500 నుంచి రూ. 600 వరకే బిల్లు వస్తోంది.
* పైడి భీమవరంలో ఉన్న అరబిందో కర్మాగారంలో రోజుకు లక్ష యూనిట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు చేశారు. బిల్లు గణనీయంగా తగ్గడంతో మరో సౌర ప్లాంటు ఏర్పాటుకు యత్నాలు ఆరంభించారు.
ఉత్పత్తి ఇలా..
* ఒక కిలోవాట్ సౌర విద్యుత్తు యూనిట్ ఏర్పాటు ద్వారా రోజుకు ఏడు యూనిట్ల చొప్పున నెలకు 210 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
* రెండు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్ ఏర్పాటు చేసుకుంటే రోజుకి 14 యూనిట్ల చొప్పున నెలకు 420 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
వినియోగదారులు ముందుకు రావాలి
జిల్లాలో విద్యుత్తు వినియోగదారులు సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకురావాలి. నెడ్‌క్యాప్ ద్వారా రాయితీ వస్తుంది. సౌర విద్యుత్తు ఉత్పత్తి, వినియోగదారుల వాడకం యూనిట్లు బేరీజు వేసి విద్యుత్తు బిల్లులో మినహాయింపు వస్తుంది. వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువగా ఉంటే గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి వినియోగదారులకు సొమ్ము జమ అవుతుంది. లేదా విద్యుత్తు బిల్లులో దశలవారీగా మినహాయిస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే సౌర పలకలు ఏర్పాటు చేసిన ఏజెన్సీ పూర్తి బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.