బస్సు షెల్టర్ల నిర్మాణానికి రూ. 2 కోట్లు

బస్సు షెల్టర్ల నిర్మాణానికి రూ. 2 కోట్లు
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కృషి చేస్తుందని హడ్కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (దిల్లీ) మేడితి రవికాంత్ చెప్పారు. విశాఖ మన్యంలో ఆదివారం పర్యటించిన ఆయన అరకులోయలో హడ్కో సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన బస్షెల్టర్లు, డుంబ్రిగుడ మండలం నిమ్మగెడ్డలో ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీలుగా సాంబశివరావు, మాలకొండయ్య ఉన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీఎస్ ఆర్టీసీకి రూ.2 కోట్లు, టీఎస్ ఆర్టీసీకి రూ.1.3 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో ఏపీలో బస్షెల్టర్లు, తెలంగాణలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ఖర్చు చేశారన్నారు. మన్యంలో డౌనూరు, లంబసింగి, హుకుంపేట, అరకులోయ ఎన్టీఆర్ గార్డెన్, తహసీల్దారు కార్యాలయం సమీపంలో బస్షెల్టర్లు, డుంబ్రిగుడ మండలం నిమ్మగెడ్డలో ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అరకు – విశాఖ బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఆర్టీసీ కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏయూలో చదివిన రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆర్టీసీ ఈడీ ఎస్ఏ అన్సారీ, పాడేరు డిపో మేనేజరు రమేష్, ఆర్టీసీ ఇంజినీరింగ్ విభాగం ఈఈ డీఎస్ఎన్ రాజు, డీఈఈ నర్సింగరాజు, హడ్కో, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.