బడి బయట పిల్లలు జిల్లాలో 8,459 మంది సహిత విద్య జిల్లా సహాయ సమన్వయకర్త రమణ
చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 8,459 మంది బడి ఈడు పిల్లలు బయట ఉన్నట్లు గుర్తించినట్లు సహిత విద్య జిల్లా సహాయ సమన్వయకర్త పి.వి. రమణ పేర్కొన్నారు. స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం సీఆర్పీలు, పార్ట్‌టైం బోధకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలురు 3,870, బాలికలు 4,589 మంది బడి బయట ఉన్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని అరకులోయ, పెదబయలు, జి.మాడుగుల, డుంబ్రిగుడ, చింతపల్లి, గూడెంకొత్తవీధి, ముంచంగిపుట్టు తదితర గ్రామాలకు చెందిన 1166 మంది బయట ఉన్నారని చెప్పారు. చోడవరంలో 44 మంది బడి బయట ఉన్న పిల్లలను గుర్తించామన్నారు. గాంధీగ్రామం సిటిజన్ కాలనీకి చెందిన అయిదుగురు పిల్లలు అసోంలో చదువుతున్నారని అన్నారు. వచ్చేనెలలో పాఠశాలల ప్రారంభం నాటికి ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలను గుర్తించడంతో పాటు ఏయే పాఠశాలల్లో చదువుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. మన బడికి పోదాం యాప్‌లో గుర్తించిన పిల్లలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాసాధికార సర్వేలో కూడా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎంతమంది పాఠశాలలో, బయట ఉన్నారో గుర్తించామన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి బయట ఉన్న పిల్లలను పాఠశాల్లో చేర్పించేలా కృషిచేయాలని సిబ్బందికి సూచించారు.