బంగారు పతకం.. దేశానికే గర్వకారణం
30 అడుగుల టవర్ నిర్మాణానికి చర్యలు
తీరంలోని పది మండలాలతో అనుసంధానం
సమాచార మార్పిడికి ఆధునిక సంపత్తి
కలెక్టరేట్లో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు
న్యూస్‌టుడే, వన్‌టౌన్

ప్రకృతి వైపరీత్యం సంభవించినపుడు ఆ సమాచారం జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయికి చేరేసరికి కొంత సమయం పడుతోంది. క్షేత్రస్థాయిలో అప్రమత్తమయ్యేసరికే కొన్నిసార్లు పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. విలువైన ఆ కొద్ది సమయాన్ని వినియోగించుకుంటూ సమర్థంగా ప్రాణ, ఆస్తి రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగానే అత్యాధునిక వ్యవస్థను రాష్ట్ర విపత్తుల శాఖ అందుబాటులోకి తెస్తోంది. అన్ని తీర ప్రాంత జిల్లాల్లోనూ ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉపగ్రహ వ్యవస్థ ద్వారా…: డీఈవోసీ, ఎంఈవోసీలు ఉపగ్రహ వ్యవస్థ ద్వారా సేవలందిస్తాయి. తీర ప్రాంతంలో ఉన్న భీమిలి, విశాఖ గ్రామీణం, విశాఖ అర్బన్, పెదగంట్యాడ, గాజువాక, పరవాడ, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఎంఈవోసీలను కలెక్టరేట్లోని డీఈవోసీతో అనుసంధానిస్తారు. విపత్తుల సమయంలో ఈ కేంద్రం సేవలు కీలకం కానున్నాయి.ప్రస్తుతం విధానం ఇదీ…: ప్రస్తుతం కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఉంది. తుపాను హెచ్చరికల కేంద్రం బులెటిన్లను కలెక్టరేట్ అధికారులు మండల యంత్రాంగానికి పంపుతారు. వారు గ్రామాల్లోని వీఆర్వోలకు చేరవేసి, దండోరా వేయించడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులు గ్రామాలకు వెళ్లి లోతట్టులో ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తుపాను భవనాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి కొంత సమయం పడుతోంది. మండల కేంద్రాల నుంచి ఆయా గ్రామాలకు అవసరమైన సామగ్రి తరలింపు, వాహనాలను చేరవేయడం వంటి వాటికి సమయం తీసుకుంటోంది.
కొత్త విధానం పనిచేసి ఇలా… :
ఇక నుంచి దండోరాలు ఉండవు. కలెక్టరేట్ అధికారులు అప్రమత్తం చేయాల్సిన అవసరం లేదు. బీ కలెక్టరేట్లో ఏర్పాటు చేసే జిల్లా స్థాయి కేంద్రమే విపత్తుల సమాచారాన్ని మండల కేంద్రాలకు చేరవేస్తుంది. అక్కడి నుంచి గ్రామాలకు సమాచారం వెళుతుంది.
తీరంలో ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాల వెంబడి పబ్లిక్ అనౌన్సుమెంటు సిస్టం ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా విపత్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుగుభాషలో ప్రకటిస్తారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు అప్రమత్తం కావచ్చు.
విశాఖ నగరంలో బీచ్‌రోడ్డు వెంబడి పబ్లిక్ అనౌన్సుమెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. చేపలరేవులో కూడా ఇలాంటి విధానం ప్రవేశపెడతారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసే కేంద్రంలో పది కంప్యూటర్లు ఉంటాయి. 30 అడుగుల ఎత్తున ఓ స్తంభాన్ని నిర్మిస్తారు. విపత్తుల సమయంలో ఫోన్లు పనిచేయకున్నా సమాచార మార్పిడి అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
కేంద్రం నిర్వహణకు అత్యధిక సామర్థ్యంతో కూడిన జనరేటర్‌ను ఇప్పటికే కలెక్టరేట్‌కు తరలించారు. పదిమంది ఉద్యోగులను కేటాయించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక భవంతిని కలెక్టరేట్లో సిద్ధం చేస్తున్నారు.
సెల్ టవర్లు కూలిపోయినా, సెల్ఫోన్లు, ల్యాండు లైన్లు పనిచేయకున్నా కలెక్టరేట్ కేంద్రం నుంచి విపత్తుల సమస్య ఉండే పది తీర ప్రాంత మండలాలకు సమాచారం వెళ్లే విధంగా అత్యాధునిక వ్యవస్థను నెలకొల్పనున్నారు. మండల కేంద్రాల్లో కూడా ఇలాంటి స్తంభాలను, జనరేటర్లను ఏర్పాటుచేయనున్నారు.