News

Realestate News

ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి


ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి

మంత్రి గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం, న్యూస్‌టుడే :ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి 

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే ఉచిత విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించేందుకు ఉపాధ్యాయులు ప్రతిన బూనాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

 

వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన డిజిటల్‌ తరగతి గదుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

జిల్లాలోని 28 పాఠశాలలకు అవసరమైన ఉపకరణాలను ప్రధానోపాధ్యాయులకు అందించి మాట్లాడారు.

విద్యపై ప్రజలకు పూర్తిస్థాయిలో భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నామో… ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నా…

తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కంటే… ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారు 40 వేల మంది అధికంగా ఉన్నారన్నారు.

ఈ పరిస్థితి మారి… అన్ని పాఠశాలలు చంద్రంపాలెం పాఠశాలలా అభివృద్ధి చెందాలన్నారు.

ఇందులో భాగంగానే ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.330 కోట్లు అందిస్తామన్నారు.

డిజిటల్‌ తరగతి గదులు, వర్చువల్‌ తరగతుల నిర్వహణకు ఎన్‌ఆర్‌ఐలు చేసిన కృషిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను సత్కరించారు.

డీఈవో లింగేశ్వరరెడ్డి, విద్యాశాఖాధికారులు ప్రేమ్‌కుమార్‌, రామరాజు, భవాని, సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.