News

Realestate News

ప్రభుత్వ కనుసన్నల్లోనే భూ సమీకరణ పథకం!

ఆదేశాలు అమలు చేయడమే వుడా పాత్ర
గత కుంభకోణం నేపథ్యంలో పలు జాగ్రత్తలు
విడుదలైన మార్గదర్శకాలు
విశాఖపట్నం, ఈనాడు: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో భూ సమీకరణ పథకం (ల్యాండు పూలింగ్‌) కింద మొదటి దశలో దాదాపు 1900 ఎకరాల్లో లేఅవుట్ల అభివృద్ధి కోసం త్వరలో ప్రభుత్వ అనుమతి లభించనుంది. సోమవారం జీవో విడుదల చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంగళవారం పథక అమలుపై మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటికే వుడా నుంచి ప్రభుత్వానికి రెండు విడతలుగా వెళ్లిన భూములను భూసమీకరణ పథకం కింద అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా వూపే అవకాశాలున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన గడువులోగా లేఅవుట్లు అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ అనుమతితో మాత్రమే పథకాన్ని అమలు చేయాలి. సామాజిక అవసరాల కోసం లేఅవుట్లలో నిర్దేశించిన 50 శాతం స్థలాన్ని విడిచిపెట్టగా, మిగతా 50 శాతం స్థలంలో వుడా వాటా ఎంత, భూములిచ్చిన రైతులకు ఎంత కేటాయించాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
భూ సమీకరణ పథకం కోసం భూములిచ్చేందుకు ఎంతోమంది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందులో వుడా సొంత నిర్ణయాలకు అవకాశాలు తక్కువ. భూ సమీకరణ పథకం కింద లేఅవుట్లు వేసినపుడల్లా ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాల్సిందే. అనుమతులొచ్చేకే వుడా అధికారులు తదుపరి ప్రక్రియను చేపడతారు. తాజాగా 1900 ఎకరాలకు సంబంధించి నెలాఖరులోగా అనుమతులొచ్చే అవకాశాలున్నాయి. దీనిపై వుడా అధికారులు ప్రకటన చేసి ఆయా ప్రాంతాల ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాక తదుపరి అనుమతులు వెలువడతాయి. ప్రజల అభ్యంతరాలు సహేతుకంగా ఉన్నా, భూములపై వివాదాలు ఉన్నట్లు వెల్లడైనా ప్రతిపాదనలు ప్రభుత్వం రద్దు చేస్తుంది. అంతా సవ్యంగా ఉందనుకుంటేనే అనుమతులిచ్చి.. లేఅవుట్‌లో వుడా వాటా, భూములిచ్చిన రైతులకు ఎంత వాటా చెల్లించాలో సూచిస్తుంది. గతంలో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 45 శాతం సామాజిక అవసరాల కోసం, మరో 55 శాతాన్ని ఇళ్ల స్థలాల కింద కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతించేది. ఇప్పుడు సామాజిక అవసరాల కోసం 50 శాతం, ప్లాట్ల కోసం మిగతా 50 శాతాన్ని నిర్దేశించారు.

అన్ని దశల్లోనూ ఆచితూచి…
వుడా గతంలో చేపట్టిన భూ సమీకరణ ప్రాజెక్టులో కుంభకోణం చోటుచేసుకున్నందున ఈసారి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి దశలోనూ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. భూములిచ్చిన వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో వాటా స్థలాన్ని కేటాయింపుపైనా వుడా పాత్ర నామమాత్రమే. ఇక్కడి నుంచి వెళ్లిన ప్రతిపాదనలపై ప్రభుత్వమే సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. రైతుల నుంచి భూముల సేకరణ సందర్భంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. లేదంటే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.