News

Realestate News

ప్రతి స్వరంలో శ్రీవారి స్మరణం

ప్రతి స్వరంలో శ్రీవారి స్మరణం
ఆధ్యాత్మికత పంచిన ‘విశాఖ తీరంలో
విష్ణుపదార్చన’
తొలిరోజు శ్రీహరికి 70 మంది గాయకుల స్వరార్చన
‘తిరువీధుల మెరసీ దేవదేవుడు..’
అంటూ పరవళ్లు తొక్కిన ఆధ్యాత్మిక నాదం…
‘జ్యో అచ్యుతానంద జోజో ముకుందా’..గా సాగిన ఆర్ద్రత కీర్తనం…
‘రాముడు రాఘవుడు రవికులుడితడు’..
బాణీలో సాక్షాత్కరించిన దేవదేవుడి రూపం…
‘ఇదియే సాధనమిహపరములకును’..
అంటూ చాటిన భక్తి తరంగం…
ఎన్నెన్నో స్వరాలు.. మరెన్నో మార్ధవ గీతాలు…
ప్రతి అక్షరంలో అన్నమయ్య పలుకు…
ప్రతి పాదంలో తిరువేంకటేశ్వరుడి రూపు
కనులముందు కదలాడింది…

ఈనాడు, విశాఖపట్నం- పెదవాల్తేరు, న్యూస్‌టుడే
వాగ్గేయకారుడు అన్నమయ్య కీర్తనలను భావితరాలకు అందించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పం కార్యరూపం దాల్చే దిశగా సాగుతున్న బృహత్‌ కార్యక్రమానికి విశాఖ వేదికయ్యింది. నగరంలోని సిరిపురం కూడలిలోని వుడా బాలల ప్రాంగణంలో ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ సీజన్‌-2లో భాగంగా ‘విశాఖ తీరంలో విష్ణుపదార్చన’ కార్యక్రమం నగర వాసులకు మధురానుభూతి పంచింది. నిలువెత్తు శ్రీవారి విగ్రహం చెంత సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతను పంచింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యంలో, రామభట్ల నర్సింహశర్మ, గాయని సునీత సంధాన కర్తలుగా.. డాక్టర్‌ కె.మలయవాసిని విశ్లేషకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆహుతులను ఆద్యంతం ఆకట్టుకుంది.

50 మంది కొత్తగాయకులకు అవకాశం..
రెండురోజులపాటు సాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు విశాఖ జిల్లా నుంచి అయిదు బృందాలుగా 50 మంది గాయకులకు అన్నమయ్య కీర్తనలు ఆలపించే అవకాశం దక్కింది. రెండోరోజైన బుధవారం నాడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మరో 50 మంది ఈ స్వరార్చనలో పాలుపంచుకోనున్నారు. వీరితోపాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన 20 మంది నిష్ణాతులైన గాయకులు ఆలపించిన అన్నమయ్య పాత, కొత్త కీర్తనలకు భక్తిఛానల్‌ ఆధ్వర్యంలో దృశ్యరూపం ఇచ్చి ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అన్నమయ్య సాహిత్యం నేటితరానికి, భావితరాలకు చేరువచేసేందుకే ఈ ప్రయత్నం చేస్తునానమన్నారు.

అలరించిన గానామృతం..
వుడా బాలల ప్రాంగణంలో గత రెండు రోజులుగా సాధన చేసిన గాయకులు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిలతోపాటు అతిథులుగా సినీనటుడు గొల్లపూడి మారుతీరావు, సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. మదిని దోచే సంగీత స్వరాలు.. శ్రావ్యమైన గానామృతంతో కీరవాణితో సహా పలువురు ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కీరవాణి బృందం ఆలపించిన ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు’.. కీర్తన అనంతరం రాఘవేంద్రరావు, గొల్లపూడి తదితరులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. పలువురు కొత్తతరం సంగీత కళాకారులు తమ ప్రావీణ్యాన్ని వేదికపై ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు.