ప్రతి అపార్ట్మెంట్లోనూ ఇంకుడుగుంత

ప్రతి అపార్ట్మెంట్లోనూ ఇంకుడుగుంత
ఇతరచోట్లా వాబా ఆధ్వర్యంలో కార్యక్రమాలు
విశాఖపట్నం, ఈనాడు: కొత్తగా నిర్మించనున్న ప్రతీ అపార్ట్మెంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తీయడంతోపాటు సామాజిక బాధ్యతగా ఇతరచోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామని విశాఖ అపార్ట్మెంట్ బిల్డర్ల అసోసియేషన్ (వీఏబీఏ) అధ్యక్షుడు పి.వి.ఎల్.నర్శింహరాజు తెలిపారు. ‘ఈనాడు – ఈటీవీ’ సుజలాం – సుఫలాం, వాబా సంయుక్తంగా మంగళవారం లెబెన్స్ హిల్ఫే మానసిక వికలాంగుల పాఠశాలలో నాలుగు ఇంకుడు గుంతల పనులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహా నగరంలో నానాటికీ తీవ్రమవుతున్న నీటి సమస్యపై ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఈనాడు – ఈటీవీ’ పిలుపును అందుకొని వాబా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. సేవా దృక్పథంతో పని చేసే విద్యా సంస్థలు, ఇతర సేవా కేంద్రాల్లోనూ ఇంకుడు గుంతలను వాబా ఖర్చుతో తవ్వించాలని నిర్ణయించామన్నారు. లెబెన్స్ హిల్ఫే వ్యవస్థాపకురాలు టి.సరస్వతీదేవి మాట్లాడుతూ జల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వాబా ఛైర్మన్ ఎం.అనిల్‌బాబు, వ్యవస్థాపక అధ్యక్షుడు తాళ్లూరి శివాజీ, కార్యదర్శి పంచకర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు డి.ఆర్.కె.రాజు, కార్యవర్గ సభ్యులు టి.శాంతారాం, ఎం.సతీష్, సి.హెచ్.ఎస్.ఆర్.వి.రావు, జగదీశ్వరరావు, ప్రభు, అప్పారావు, ఎల్.అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Source : http://www.eenadu.net/