News

Realestate News

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు
విశాఖపట్నంలో ఫుడ్‌ పార్క్‌
అచ్యుతాపురంలో గిరిజన మోడల్‌ ఐటీఐ
ఒప్పంద ఉద్యోగులకు ­రట..
రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం
విశాఖపట్నం, ఈనాడు:
ఆశల బడ్జెట్‌ వచ్చేసింది.. అమరావతి రాజధానిగా వెలువడిన బడ్జెట్‌లో సర్కారు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. తొలి పద్దుతో ప్రగతి పరుగులు పెట్టించడానికి భారీ నిధుల కేటాయించింది. రూ. 1,56,999 కోట్ల బడ్జెట్‌లో అన్ని శాఖలకు భారీగా కేటాయింపులు జరిగినా.. ప్రాథమికంగా జిల్లాలో కొన్ని అంశాలకు కేటాయింపులు నేరుగా ప్రకటించడంతో ఆయా వర్గాల ఆశలు సజీవమయ్యాయి..

వ్యవసాయ వికాసం..
బడ్జెట్‌లో గ్రామీణాభిµవృద్ధికి పెద్దపీట వేశారు. పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకు భారీగానే కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి ఆయిల్‌పామ్‌ తోటల విస్తర్ణకు, పండ్లతోటల పెంపకానికి నిధులు కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 9,091 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.19,565 కోట్లు కేటాయించడంతో జిల్లాకు భారీగానే నిధులు దక్కొచ్చనే ఆశతో ఉన్నారు.
* జిల్లాలో 4.74 లక్షల మంది రైతులు ఉంటే.. ఇందులో సన్నకారు రైతులు 3.60 లక్షలు, చిన్నకారు రైతులు రూ. 68,929 మంది, పెద్ద రైతులు 1,080 మంది ఉన్నారు. ఖరీఫ్‌లో 1.86 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. అర్హులైన రైతులకు ప్రోత్సాహం అందుతుందనే ఆశతో ఉన్నారు.
* రైతు రుణమాఫీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 3,600 కోట్లు కేటాయించారు. జిల్లాలో 2,16,710 మంది రైతుల ఖాతాలకు నాలుగు విడతల సొమ్ము రూ.638.32 కోట్లులో ఇప్పటివరకు రెండు విడతల నిధులే ఖాతాల్లో చేరాయి. ఈ కేటాయింపులతో మిగిలిన సొమ్ము జమకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు.
* ఉత్తరాంధ్ర అభివృద్ధిని వేగవంతం చేయడంలో విశాఖపట్నంలలో ఫుడ్‌పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
* పాడేరు ఐటీడీఏ పరిధిలో రూ.526.16 కోట్లతో కాఫీ తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బడ్జెట్‌ పాఠంలో ప్రకటించడం ­రటనిచ్చిన అంశం.

ఉత్తరాంధ్రకు ­రట.. విశాఖకు..?
నీటిపారుదల రంగానికి రూ.12,770 కోట్లు కేటాయించిన సర్కారు విశాఖలోని జలవనరుల శాఖ ఉత్తర కోస్తా చీఫ్‌ ఇంజినీరు పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాకు రూ. 539.47 కోట్లు కేటాయించింది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని వంశధార, తోటపల్లి, మహేంద్రతనయకు భారీ కేటాయింపులు జరిగినా.. జిల్లాకు మాత్రం స్వల్ప నిధులతో నిరుత్సాహపరిచారు. జిల్లాలో పరిశ్రమల అవసరాలకు నీటి సరఫరాకు వీలుగా నీటి వనరుల నిర్వహణకు నిధులు కేటాయించలేదు. జిల్లాలో సాగునీటి పథకాలు సమస్యలతో అల్లాడుతున్నాయి. వీటికి ప్రత్యేక కేటాయింపులు ఇచ్చుంటే బాగుండేదనేది పలువురి వాదన.
* తాండవకు రూ.5.05 కోట్లు.. పెద్దేరు రిజర్వాయర్‌కు రూ. 5 లక్షలు, రైవాడ రిజర్వాయర్‌ రూ. 6.10 లక్షలు, కోణాం రిజర్వాయర్‌కు రూ. 5.60 లక్షలు, తాటిపూడి రిజర్వాయర్‌ రూ.10 లక్షలు చొప్పున నిర్వహణ నిధులు కేటాయించి సరిపుచ్చారు.

ప్రగతి దారులేనా..?
బడ్జెట్‌లో గ్రామీణ రహదారులకు రూ. 262 కోట్లు.. రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ. 4,041 కోట్లు కేటాయించడంతో రవాణా వ్యవస్థ గాడిలో పడినట్లేనని అంతా భావిస్తున్నారు.
* జిల్లాలో పంచాయతీరాజ్‌ రహదారులు 5,742 కిలోమీటర్ల పొడవున ఉంటే.. ఆర్‌అండ్‌బీ రహదారులు 2,159 కిలోమీటర్లు, జాతీయ రహదారులు 126 కిలోమీటర్ల నిడివిన ఉన్నాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వీటి బాగుకు జిల్లాకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉంది. పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న చంద్రన్న బాట రహదారులకు పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకం కింద భారీగానే కేటాయింపులు జరగడంతో ఈ రహదారుల బాగుకూ మార్గం సుగమమైంది. జాతీయ రహదారి విస్తరణ పనులు సాగితే రవాణా వ్యవస్థ జిల్లాలో మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
* విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి పథకం కింద 372 కిలోమీటర్ల పొడవుగల రహదారులను నాలుగు లైన్ల ప్రమాణాలకు తగ్గట్లు ఆధునికీకరించాలని ప్రతిపాదించారు.

యువ సేనకు దన్ను..
ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. నైపుణ్యాల అభివృద్ధికి రూ.398 కోట్లు, యువత సంక్షేమానికి రూ.275 కోట్లు కేటాయించడం ­రటనిచ్చిన అంశం.
* జిల్లాలో యువత 18.18 లక్షల మంది ఉన్నారు. 3,100 యువజన సంఘాలు ఉన్నాయి. నిర్వీర్యమైన యువజన సంఘాలకు పునర్జీవం పోయడంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు సమర్థంగా వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి ద్వారా పలువురు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుపడే సూచనలున్నాయి.

మహిళలకు ప్రోత్సాహం..
డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద రూ.1,600 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. మహిళా సాధికార సంస్థకు రూ.400 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు.
* జిల్లాలో ఒక జిల్లా సమాఖ్య, 39 మండల సమాఖ్యలు ఉన్నాయి. 5.13 లక్షల మంది డ్వాక్రా సభ్యులున్నారు. మహిళల ఆర్థిక పరిపుష్ఠికి రూ.508.78 కోట్లు మంజూరకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇందులో రెండో విడతగా 4.71 లక్షల మంది ఖాతాలకు రూ.141.33 కోట్లు జమయ్యింది. ఈ కేటాయింపులతో మిగిలిన మొత్తం జమ అవుతుందనే ఆశతో సభ్యులున్నారు.
* గ్రామీణ మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లకు రూ.250 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. జిల్లాలో పొగరహితంగా మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ జిల్లాలో మొత్తం 8.03 లక్షల కుటుంబాలుంటే.. 4.01 లక్షల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. గ్యాస్‌ కనెక్షన్లు లేని కుటుంబాలు 4.02 లక్షలున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న 3,866 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయితే గ్యాస్‌ కనెక్షన్ల లేమితో కట్టెల పొయ్యిపైనే వంటలు సాగుతున్నాయి. తాజా కేటాయింపులతో సమస్యకు తెరపడొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఆశలన్నీ సొంతింటిపైనే..
గ్రామీణ, పట్టణ నిరుపేదలకు శాశ్వత గృహనిర్మాణానికి రూ. 1,456 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించడంతో పేదోడి సొంతింటి కల సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఎన్టీఆర్‌ గృహాల కేటాయింపులు ప్రస్తుతం స్వల్పంగా ఉండడంతో ఇవి పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఆక్రమణల క్రమబద్ధీకరణపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటుచేసుకున్న పేదలకు ­రట కలిగే సూచనలున్నాయి.

వైద్యానికి ­రట..
రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 7,021 కోట్లు.. ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించడం ­రటనిచ్చిన అంశం. జిల్లాలో 584 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, 89 ఆరోగ్య కేంద్రాలు, 13 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ వైద్యశాల, 35 రాత్రిపగలూ పనిచేసే వైద్యశాలలు, ఎనిమిది సీమాంక్‌ కేంద్రాలు, ఆరు పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాలున్నాయి. అన్ని మౌలిక వసతులూ ఉన్నాయి. అయితే వైద్యనిపుణులు, ఇతర సిబ్బంది లేమితో వైద్యసేవలు సమర్థంగా అందడంలేదు. మన్యంలోని 11 మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ మాతాశిశు మరణాలు, రక్తహీనత చావులకు అడ్డుకట్ట పడడం లేదు. తాజా కేటాయింపులతో ఈ లోపాలు అధిగమించవచ్చన్న గంపెడు ఆశతో జిల్లావాసులున్నారు.

సంక్షేమానికి పెద్దపీట..
బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. దివ్యాంగుల సంక్షేమానికి రూ.89.51 కోట్లు కేటాయించారు. దీంతో ఆయా వర్గాల్లో ఆశలు వెల్లివిరిశాయి.
* ప్రపంచ బ్యాకు సాయంతో విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం వద్ద గిరిజన విద్యార్థుల కోసం మోడల్‌ ఐటీఐ ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
* 2017-18ని ఈ-ప్రగతి సంవత్సరంగా ప్రకటించారు. వివిధ రకాల సేవలను సమగ్రంగా ఉచితంగా అందించడానికి 33 ప్రభుత్వ శాఖలు, 315 సంస్థలు, 745 సేవలను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మరింత మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.
* వసతిగృహాలన్నీ గురుకుల పాఠశాలలుగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలు ఉన్నతీకరిస్తూ, నాబార్డ్‌, విదేశీ సహాయ పథకాల ద్వారా మరిన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నారు.
* విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించే వృద్ధాశ్రమంలో 100 మంది సీనియర్‌ పౌరులకు సంరక్షణ లభిస్తుంది.
* ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల పారితోషికాన్ని పెంచే విషయం ప్రభుత్వం పరిశీలిస్తోంది.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు రెండు విడతల కరవు భత్యం బకాయిలు విడుదల చెయ్యనున్నారు.
* విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పొరుగు సేవల సిబ్బంది 7000మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సంఖ్య 12వేల మంది వరకు ఉంటుంది. వీరికి తాజా ప్రకటన ­రటనిచ్చిన అంశం.

బడ్జెట్‌పై భిన్నస్వరాలు..
యువతకు నిరాశే
– వి.వి.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్‌ఐ
యువజన విధానాన్ని ప్రకటిస్తుందని ఎదురుచూసిన నిరుద్యోగులకు, యువతకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌లో క్రీడలు, యువజన రంగాలకు రూ.810 కోట్లు నామమాత్రపు కేటాయింపులు చేసి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతికి కూడా రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా దీని విధివిధానాలు ప్రకటించకపోవడంతో కంటితుడుపు చర్యగా భావిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రూ.2వేల నిరుద్యోగ భృతికి తగిన నిధులు, విధివిధానాలు వెంటనే ప్రకటించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులు భర్తీ, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ వంటివి, స్కిల్‌ డెవలప్‌మెంటు కేంద్రాలు పెట్టి ఐటీ, ఇతర వృత్తి నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పిన హామీలన్నీ ప్రగల్బాలుగానే మిగిలిపోయాయి.

ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‌
– పసుపులేటి బాలరాజు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు
ప్రజలను మభ్యపెట్టే.. స్పష్టతలేని బడ్జెట్‌ ఇది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత మొత్తంలో బడ్జెట్‌ పెట్టలేదు. ఆర్థిక నష్టాలున్నాయంటున్నారు.. డబ్బుల్లేవంటున్నారు.. ఇంత మొత్తంలో బడ్జెట్‌ ఏ వనరులతో పెట్టారు…? ఇది నాలుగో బడ్జెట్‌.. ఎన్నికలలోపు ఇంకో బడ్జెట్‌ ఉంది.. సంక్షేమానికి, అభివృద్ధికి ఎక్కడా సరిపడా కేటాయింపులు లేవు. నిరుద్యోగ భృతి, రైతు, మహిళల రుణమాఫీ అన్నారు.. ఎక్కడా సరిపడా కేటాయింపులు లేవు. ఉప ప్రణాళిక నిధులు స్పష్టంగా చూపించలేదు. ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్‌ పరిధిలో లబ్ధికోసం ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమానికి సంబంధించిన నిధుల కేటాయింపు సరిగ్గాలేదు. గత ఆర్థిక సంవత్సరం కంటే కేటాయింపులు తగ్గాయి. పేదోడి సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.

ఉత్తరాంధ్రకు ఉత్తచేతులే..
– సీహెచ్‌ నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం
రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అభివృద్ధి ప్యాకేజీ గురించి గానీ, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి నిధుల ప్రస్తావన ఎక్కడా లేదు. రాష్ట్రం 2.16 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది. ఈ అప్పులు తీర్చడానికి ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలపై ఆధారపడినట్లు ఆర్థిక మంత్రి ప్రస్తావించడం చూస్తే రాష్ట్ర బడ్జెట్‌ అప్పుచేసి పప్పుకూడులా మారింది. మొత్తం బడ్జెట్‌ను అంకెల్లో అతిగా చూపించారు. ఈ అంకెలు ఆచరణలో అమలు కావన్నది గత అనుభవం చెబుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ పథకాల్లోని నిధులు ఖర్చుపెట్టకుండా దారిమళ్లించడం గతం నుంచి చూస్తున్నాం. కుల కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే. వ్యవసాయ, అనుబంధ రంగాలకు గత బడ్జెట్‌లో కేటాయించిన 6.4 శాతాన్ని ఈ బడ్జెట్‌లో 5.79 శాతానికి తగ్గించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలుదారులుంటే.. కేవలం 80వేల మందికి మాత్రమే రూ.202 కోట్లు మాత్రమే బ్యాంకు రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించడం కౌలుదారులపట్ల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవు.

అన్ని రంగాలకూ ప్రాధాన్యం
– పప్పల చలపతిరావు, జిల్లా అధ్యక్షులు, తెదేపా
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం అన్ని రంగాలకూ ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజా సంక్షేమం కోసమే గతంలో కంటే భారీ నిధులతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వ్యవసాయం, వైద్య, విద్య, యువత ఇలా అన్ని రంగాలకూ భారీగా నిధులు కేటాయించడం స్వాగతించాల్సిన అంశం. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు నిధులు కేటాయించారు. ఈ పనుల్లో కదలిక వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.