News

Realestate News

ప్రగతి కిరణం సోకి… ‘స్వర్ణభారత’మై మెరిసి…

ప్రగతి కిరణం సోకి… ‘స్వర్ణభారత’మై మెరిసి…
కేంద్రుమంత్రి వెంకయ్యనాయుడి చొరవతో చేపలుప్పాడలో ఆధునిక సదుపాయాలు
రూ. 5 కోట్లతో అభివృద్ధి పనులు
న్యూస్‌టుడే, చేపలుప్పాడ(గ్రామీణభీమిలి)
చారిత్రక పట్టణం చెంతనే ఉన్నా ప్రగతి పొద్దు ఆ నేలను తాకలేదు… మహానగరి కూతవేటు దూరంలోనే ఉన్నా ఆ పల్లె మాత్రం ఎవరికీ పట్టని తీరులోనే నిలిచిపోయింది… సాగర జలాల చెంతన… మత్స్య సంపదలతో తులతూగే ఆరు గ్రామాలను కలబోసుకున్న ఆ పంచాయతీ మాత్రం కనీస సదుపాయాలకు కూడా అలమటించాల్సిన పరిస్థితి… మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఆ పల్లెను 2014 నాటి హుద్‌హుద్‌ తుపాను చుట్టేసింది… అధమస్థాయికి నెట్టివేసింది… అదే చేపలుప్పాడ పంచాయతీ. అలా అట్టడుగున మిగిలిపోయిన ఆ పంచాయతీలో ఇప్పుడు ప్రగతిపూలు వెలుగులీనుతున్నాయి… కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఆ పల్లెలన్నీ ఆధునిక సదుపాయాల సొబగులు అద్దుకుంటున్నాయి.

2014 హుద్‌హుద్‌కు ముందు పరిస్థితి…
భీమిలి తీరంలోని చేపలుప్పాడ గ్రామ అభివృద్ధి చరిత్రను.. 2014లో హుద్‌హుద్‌ పెనుతుపానుకు ముందు, ఆ తర్వాత అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.

హుద్‌హుద్‌కు ముందు..
* తాగడానికి రక్షిత నీరు లేదు
* గ్రామస్థులకు గృహ వసతి అంతంతమాత్రమే
* ప్రభుత్వ కార్యాలయాలకు కూడా స్థలం లేదు.
* పాడుబడిన తుపాను రక్షిత భవనం
* శిథిల పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు
* ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, అధ్వాన పారిశుద్ద్యం

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి దృష్టిలో పడింది ఇలా…
2014 అక్టోబరు వచ్చిన హుద్‌హుద్‌ విలయం చేపలుప్పాడను కోలుకోలేని దెబ్బతీసింది. జీవనాధారమైన బోట్లు, వలలు, నివాసాలు దెబ్బతిన్నాయి. దిక్కుతోచని స్థితిలో ఇక్కడి ప్రజానీకం ఉందన్న విషయాన్ని తెలుసుకున్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు హుద్‌హుద్‌ సంభవించిన మూడోరోజుకే చేపలుప్పాడకు వచ్చారు. స్థానికంగా పరిస్థితులను తెలుసుకున్నారు. నేనున్నానని భరోసానిచ్చారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని తన కుమార్తె దీపా వెంకట్‌ నడుపుతున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు అప్పగించారు. దీపావెంకట్‌ రెండున్నరేళ్లలో ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు.

ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు
* 13వ ఆర్థికసంఘం నిధులు రూ. 48 లక్షలతో కాపులుప్పాడ సమీపంలో కొత్త బోరు ఏర్పాటుచేశారు. ట్యాంకు, మెయిన్‌ పంపింగ్‌ వంటివి చేశారు. శిథిలావస్థలో ఉన్న ట్యాంకుకు, మెట్లకు రూ.7లక్షలతో మరమ్మతులు చేశారు. దీనిద్వారా ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు.

* చినఉప్పాడ, పెదఉప్పాడ, చేపలదిబ్బడిపాలెం గ్రామాల మధ్యలో జాతీయ తుపాను విపత్తు నివారణ పథకం కింద రూ. 1.04 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో బహుళప్రయోజక తుపాను రక్షిత భవనం నిర్మించారు.

* రూ. 11.80 లక్షల ఆర్‌వీఎం నిధులతో చినఉప్పాడ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు అంతస్తు, తరగతి గదులు నిర్మించారు.

* రూ. 6 లక్షల మండల పరిషత్తు నిధులతో పుక్కెళ్లపాలెంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మించారు.

* రూ. 13 లక్షల ఉపాధి హామీ నిధులతో నూతన పంచాయతీ కార్యాలయం భవన నిర్మించారు.

* రూ. 3.20 లక్షల ఉపాధిహామీ (70%), పంచాయతీ(30%) నిధులతో చేపలదిబ్బడిపాలెంలో రెండు సీసీరోడ్లు వేశారు.

* ఆరోగ్యఉపకేంద్రం నూతన భవనం నిర్మాణానికి వైద్య, ఆరోగ్యశాఖ నుంచి రూ. 9 లక్షల నిధులు మంజూరయ్యాయి. అయితే ఇంకా పనులు ప్రారంభం కాలేదు.

* పంచాయతీకి 154 మరుగుదొడ్లు మంజూరు కాగా 78 పూర్తయ్యాయి. వీటికి ప్రభుత్వం అందించే రూ. 15 వేలకు అదనంగా చిప్పాడ దివీస్‌ సంస్థ రూ. 3 వేలను ఇస్తుంది.

* చినఉప్పాడ సామాజిక భవనంపై రూ.3లక్షల ఎంపీపీ నిధులను మంజూరుచేశారు. దీంతో పైఅంతస్తు నిర్మించి అందులో గ్రంథాలయం ఏర్పాటుచేయనున్నారు.

* రూ. 38 లక్షల ప్రభుత్వ నిధులతో బహుళప్రయోజన సామాజిక భవనానికి ప్రహరీ, సీసీ రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు(సీఎస్‌ఆర్‌)తో చేపట్టిన పనులు…
* నెల్లూరుకి చెందిన శ్రీసిటీ నుంచి రూ. 1.33 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులను తాగునీటి పథకాలకు, పైపులైన్ల నిర్మాణానికి మంజూరు చేయించారు. ఇందులో రూ.50లక్షలతో నిధులతో పంచాయతీ కార్యాలయానికి సమీపంలో 1.20 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్‌ సర్వీసు రిజర్వాయరు నిర్మాణం, రూ.50లక్షలతో ఆరు గ్రామాలకు అంతర్గత నీటి పంపిణీకి 6.50 కిమీ మేర పైపులైన్ల నిర్మాణం, మరో రెండు కిలోమీటర్లు చొక్కవానిపాలెంలో పైపులైను వేయాల్సి ఉంది. రూ. 33 లక్షలతో గంభీరం గెడ్డలోని జీవీఎంసీ వాటర్‌సోర్సు నుంచి ఓహెచ్‌ఎస్‌ఆర్‌కి పంపింగు మెయిన్‌ను నిర్మించారు.

* చిప్పాడ దివీస్‌ కంపెనీ రూ.30లక్షలతో సామూహిక మరుగుదొడ్లను, ఆర్వోప్లాంటును నిర్మించింది.

* విశాఖకు చెందిన ఐనాట్‌ పవర్‌ టెక్నాలజీ కంపెనీ రూ.24.5లక్షలతో 301 ఎల్‌ఈడీ వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో 6 సీసీ కెమెరాలు, వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వీటిని ఏడేళ్ల పాటు నిర్వహించేందుకు కూడా సమ్మతించింది.

* రూ.25లక్షలతో విజయ్‌మందాని గ్రూప్‌ పంచాయతీలోని నాలుగు పాఠశాలలకు కార్పొరేట్‌ హంగులు తీసుకొచ్చింది. మరుగుదొడ్లు, ఫ్లోరింగు, సీలింగు, తలుపులు, కిటికీలు, పెయింటింగులు, ఫ్యాన్‌లు, ప్రహరీలు ఏర్పాటుచేసింది.

వూహకందని అభివృద్ధి
మా పంచాయతీకి ఏటా వచ్చే ఆదాయం సగటున రూ. 3 లక్షలు. ఇవి మౌలిక వసతుల కల్పనకు ఏమాత్రం సరిపోతాయి. అలాంటిది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆయన కుమార్తె దీపావెంకట్‌లు మా గ్రామాన్ని దత్తత తీసుకుని రెండున్నరేళ్ల కాలంలో ఏకంగా రూ. 5 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు. ఇది మా ­హకందని అభివృద్ధి.

-మైలపల్లి నల్లమ్మ, చేపలుప్పాడ సర్పంచి

ప్రణాళికబద్ధంగా అభివృద్ధి
పంచాయతీలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ఇందులో లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. లక్ష్యాలసాధనకు అవసరమైన ఆర్థిక వనపరులను ప్రభుత్వ, సీఎస్‌ఆర్‌ నిధుల రూపేణా తెచ్చి ఈ గ్రామాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి కుమార్తె దీపావెంకట్‌ ఎంతో అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే చేపలుప్పాడ ఓ ఆదర్శగ్రామంగా కానుందని విశ్వసిస్తున్నాం.

-కె.హరిప్రసాదరావు, భీమిలి మండలాభివృద్ధి అధికారి

నాన్నగారి స్ఫూర్తితోనే
మా తండ్రి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిగారి మాటప్రకారం చేపలుప్పాడను ట్రస్ట్‌ తరఫున దత్తత తీసుకున్నాను. ఇక్కడికి రాగానే ప్రజలు కోరింది తాగునీరు. ప్రస్తుతానికి తాత్కాలికంగా నీటికి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులోనూ ఇంటింటికి కొళాయిల ద్వారా తాగునీటిని అందించాలన్నదే మాలక్ష్యం. భీమిలి, తగరపువలస పరిసరాల్లో నెల్లూరు వెంకటాచలం మాదిరి స్కిల్‌ డవలప్‌మెంటు సెంటరును నిర్మించనున్నాం.

– దీపా వెంకట్‌, స్వర్ణభారత్‌ట్రస్ట్‌ మేనేజింగు ట్రస్టీ

చేపలుప్పాడ గణాంకాలు
పంచాయతీ: చేపలుప్పాడ
గ్రామాలు: పెదఉప్పాడ, చినఉప్పాడ, చేపలదిబ్బడిపాలెం, కొత్తూరు, పుక్కెళ్లపాలెం, చొక్కవానిపాలెం
జనాభా: 4545
నివాసాలు: 932
కుటుంబాలు-1089
విస్తీర్ణం: 4కిమీ
జీవనాధారం: చేపలవేట
భూమి: 260.4 ఎకరాలు
బోర్లు-26
కొళాయిలు-107
డ్వాక్రా సంఘాలు-59(824 మంది సభ్యులు
చౌకదుకాణాలు-5
పాఠశాలలు-4
అంగన్‌వాడీలు కేంద్రాలు-3
హాస్టల్‌-1