News

Realestate News

ప్రగతికి పునాది

ప్రగతికి పునాది!
వర్సిటీపై  సమగ్ర నివేదికలు సిద్ధం
నేడు గవర్నర్ నరసింహన్‌ రాక
వర్సిటీల పర్యటనలకు జిల్లా నుంచే శ్రీకారం
అంబేడ్కర విశ్వవిద్యాలయం సందర్శన
ఈనాడు – శ్రీకాకుళం
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధికి పునాది పడబోతోంది. విశ్వవిద్యాలయం కులపతిగా రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ సోమవారం వర్సిటీని సందర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల సందర్శనకు గవర్నర్‌ శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి.. పలు ప్రాజెక్టుల ద్వారా కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చుకోడానికి ఇప్పటికే ఉపకులపతి కూన రామ్‌జీ సమగ్ర నివేదిక రూపొందించారు. వెనకబడిన జిల్లాలో గ్రామీణ అభివృద్ధితో పాటు వర్సిటీలో కొత్త ప్రాజెక్టులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన నివేదికలను గవర్నర్‌కు అందించేందుకు అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం సర్వసన్నద్ధమైంది.

సందర్శన నేపథ్యమిదే..
సాధారణంగా కులపతిగా గవర్నర్‌ స్నాతకోత్సవానికి ఒక్కసారే వస్తారు. వర్సిటీపై అధికారం కులపతిదే. ముఖ్యమంత్రి సిఫార్సుతో ఉపకులపతిని నియమించేదీ ఆయనే. వర్సిటీకి సంబంధించిన అభివృద్ధి నివేదికను ప్రతినెలా ఉపకులపతులు గవర్నర్‌కు పంపిస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఓ సారి రాష్ట్రంలోని ఉపకులపతులతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ స్వయంగా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తుంటారు. శ్రీకాకుళంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటయిన ఈ పదేళ్లలో గవర్నర్‌ రావడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు స్నాతకోత్సవానికి రావాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దయింది. మరోసారి వస్తానని ఆయన మాటిచ్చారు. ఇంతలోనే ఇటీవల రాష్ట్రాల గవర్నర్‌లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్వహించిన సమావేశంలో వర్సిటీల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్‌లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీలను సందర్శించాలని సూచించారు. గవర్నర్‌ నరసింహన్‌ పర్యటన వెనక నేపథ్యమిదే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వర్సిటీల పర్యటనకు జిల్లాలోని అంబేడ్కర్‌ వర్సిటీతోనే ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర, పాలన, ఈసీ సభ్యులు, విద్యార్థి వర్గాలతో విడివిడిగా సమావేశమవుతారు. వారితో ముఖాముఖి మాట్లాడతారు. చివరిలో వర్సిటీని ఉద్దేశించి ఏర్పాటు చేసే సమావేశంలోనూ ఆయన ప్రసంగిస్తారు.

గ్రామీణాభివృద్ధి దిశగా..
కేంద్రంలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి తదితర మంత్రిత్వ శాఖల నుంచి నిధులు రాబట్టుకోడానికి గవర్నర్‌ సిఫార్సులు కీలకమవుతాయి. గ్రామీణ అభివృధ్ధికి సంబంధించి కూడా వర్సిటీ రూపొందించే సమర్పించే ప్రాజెక్టుల ఆధారంగా అనేక పథకాల నుంచి నిధులు సమకూర్చుకోడానికి వీలవుతుంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చే అవకాశాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాల నుంచి నిధులు తెచ్చుకోడానికి వీలవుతుంది. పొందూరు ఖాదీ పరిశ్రమ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. నేత కార్మికులు ఇతర రంగాలవైపు మళ్లుతున్నారు. బుడితిలో ఇత్తడి పరిశ్రమ.. పలాసలోని జీడిపప్పు పరిశ్రమ.. బుడితిలో ఇత్తడితో తయారు చేసే వస్తువులను స్థానికంగానే మార్కెటింగ్‌ చేస్తారు. వాటికి అదనపు హంగులు అద్దితే.. విదేశాలకు ఎగుమతి చేసేలా తీర్చిదిద్దవచ్చు. జీడిపప్పు పరిశ్రమ నిమిత్తం దేశీయ ఉత్పత్తుల నుంచి విదేశాల నుంచి పిక్కలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి. ఇప్పటికీ పిక్కలపై ఎర్రటి పొరను తొలగించే సాంకేతికత అందిపుచ్చుకోలేకపోతున్నాయి. చేతి వేలిముద్రలు మాయమవుతున్న పరిస్థితుల్లో కార్మికులు మగ్గుతున్నారు. వీటన్నింటినీ సాంకేతికతో అందిపుచ్చుకోవచ్చు. కార్మికులకు ఇబ్బందులను అధిగమింపజేయొచ్చు. వారు తయారు చేసే వస్తువులకు మంచి గిరాకీ కల్పించాలి. ఆ వస్తువులకు మార్కెటింగ్‌ కల్పించేలా.. వర్సిటీ ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తుంది. సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి రూ. 50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మంజూరు చేయించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. సామర్థ్యాన్ని గుర్తించి వర్సిటీలను గుర్తించి కేంద్ర మంత్రిత్వ శాఖలకు సిఫార్సు చేయడంలో గవర్నర్లు కీలకంగా వ్యవహరిస్తారు. ఈ దిశగా జిల్లాలో గ్రామీణ అభివృద్ధితో ముడిపడిన పొందూరు ఖాదీ, బుడితి ఇత్తడి, అంపోలు చేనేత, పలాస జీడిపప్పు, సారవకోట చుప్పులు, అప్పడాలకు వాల్యూ అడిషన్‌ కల్పించే ప్రాజెక్టులను రూపొందించి కేంద్ర సాయానికి అవసరమైన నివేదికలను వర్సిటీ ఇప్పటికే సిద్ధం చేసింది. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్‌.ఆర్‌.డి.సి.) కింద నిధుల సమీకరణకు గవర్నరు ముందు ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నానో, బయో టెక్నాలజీ కేంద్రాల రూపకల్పన
ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన వారికి బయటకు వెళ్లాక ఉద్యోగావకాశాలు పొందేలా తీర్చిదిద్దేందుకు కూడా వర్సిటీ సమగ్ర నివేదికలను పొందుపరిచింది. ఇక్కడే బయోటెక్నాలజీ పూర్తి చేసిన విద్యార్థికి అభ్యాసనలో తప్ప ప్రయోగాత్మక అవగాహన ఉండదు. బయోటెక్నాలజీలో తడి, పొడి వ్యర్థ పదార్థాలను ఉపయోగించి వాణిజ్య పరంగా ఏం చేయాలనే ఆలోచనలు ఉండవు. చదివి పట్టా పొందిన అయోమయం వారిని ఆవహిస్తుంది. వాటిని ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టేలా కార్యాచరణకు అవసరమైన నిధులను సమకూర్చుకోడానికి వీలుగా గవర్నర్‌కు నివేదించేందుకు వర్సిటీ ప్రతిపాదనలు రూపొందించింది. ఏయూలో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఆచార్యునిగా ఉన్నప్పడు రామ్‌జీ తన నేతృత్వంలోనే ఇంక్యుబేషన్‌ సెంటర్‌, ఇన్నోవేషన్‌, నానో టెక్నాలజీకి కేంద్ర మానవ అభివృద్ధి వనరుల శాఖ నుంచి రూ. కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కీలక భూమిక పోషించారు. రూ. 3 కోట్లు, రూ. 2 కోట్ల విలువ చేసే ప్రపంచ స్థాయి పరికరాలను కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. నీటిని పరిశుభ్రం చేయడం.. ఫ్రిజ్‌లో పెట్టినా బ్యాక్టీరియా ఆశించకుండా.. ఇలాంటి కొత్త సాంకేతికను ఆహ్వానించేందుకు ప్రతిపాదనల్లో జోడించారు.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల కోసమూ..
రాష్ట్రంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పది, ఇంటర్మీడియేట్‌, మహా అయితే డిగ్రీ చదివినవారికి మాత్రమే నైపుణ్య సామర్థ్యాన్ని అందిస్తోంది. కేంద్ర స్థాయిలో కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. అలాంటి కేంద్రాలను వర్సిటీకి రావాలంటే గవర్నర్‌ సిఫార్సుపైనే ఆధారపడి ఉంటుంది. ఆల్‌ ఇండియా కౌన్సెల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, మానవ వనరుల అభివృద్ధి సంస్థలు ఇందులో కీలకంగా వ్యవహరిస్తాయి. సాఫ్ట్‌వేర్‌ సహా అనేక రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే దిశగా వాటిని వర్సిటీలో కేంద్రీకరించుకోడానికి వీలుగా గవర్నర్‌కు సమర్పించేందుకు నివేదికలను విశ్వవిద్యాలయం రూపొందించింది. అనేక ప్రభుత్వేర సంస్థలను సమకూర్చుకోడానికి గవర్నర్‌ సిఫార్సు తోడ్పాటును అందిస్తుందని వర్సిటీ భావిస్తోంది. డిగ్రీ, డిప్లొమాలతో పాాటు ఉన్నత విద్య చదివిన వారికి వెనకబడిన జిల్లాలో కేంద్రీకృతమైన అంబేడ్కర్‌ వర్సిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్సార్‌) కింద కూడా ప్రాథమిక స్థాయిలో గవర్నర్‌ సిఫార్సుతోనే నిధులు సమకూర్చుకోడానికి వీలవుతుంది. ఈ దిశగా ప్రణాళికలను వర్సిటీ సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతమైన శ్రీకాకుళంలో ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ సిఫార్సు కీలకం కావడంతో ఆ దిశగానూ ఆలోచనలు చేస్తోంది.

సమస్యలు సరేసరి..
అధ్యాపకుల నియామకాల్లో జాప్యమే వర్సిటీ ఇంతవరకు యూజీసీ నిధులకు అర్హత సాధించలేకపోయింది. ర్యాంకుల్లోనూ బాగా వెనకబడిపోయింది. నిధులు ప్రధాన సమస్య. ఒక్కసారి వర్సిటీ ఏర్పాటైన కొత్తల్లో రూ. 5 కోట్లు మినహా ఒక్క రూపాయి సాయం అందలేదు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాకే రూ. 40 కోట్ల వరకు నిధులు సమకూరాయి. ఇటీవలే నియామకాల ప్రక్రియ మొదలై మౌఖిక పరీక్షలు పూర్తయినా న్యాయస్థానం జోక్యంతో మళ్లీ ఆగిపోయాయి. ఇంతకు ముందే వర్సిటీపై వేసిన ఇలాంటి కేసే న్యాయస్థానం కొట్టేయడంతో దాని ఆధారంగా నియామకాలు షురూ అవుతాయని భావిస్తోంది. మౌలిక వసతులైన వసతి గృహాలు సహా చాలా సమస్యలు ఉన్నాయి. వివిధ కేటగిరీలకు సంబంధించిన అధ్యాపక పోస్టులను భర్తీ చేసుకోవడమే ప్రస్తుత వర్సిటీ కర్తవ్యం. వర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి దానికి కేటాయించిన స్థలంపై కూడా సందిగ్ధత వీడలేదు. సరిహద్దులను గుర్తించని దుస్థితి నెలకొంది. భూములను నిర్దేశిస్తూ చుట్టూ ప్రహరీ నిర్మించుకోవాలని కూడా వర్సిటీ ఎదురుచూస్తోంది.

గవర్నర్‌ పర్యటన సాగేదిలా..
ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాన్ని కులపతి హోదాలో సోమవారం సందర్శించనున్నారు. ఆయన పర్యటన ఇలా సాగనుంది.
* ఉదయం 11 గంటలకు: విశ్వవిద్యాలయాన్ని చేరుకొంటారు.
* 11.05 గంటలకు: వర్సిటీ ఉపకులపతి ఛాంబర్‌ ఎదుట ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తారు.
* 11.10 నుంచి 11.25 వరకు: పాలకమండలి సభ్యులతో సమావేశం.
* 11.25 నుంచి 11.35 వరకు: ఉపకులపతి, రిజిస్ట్రార్‌, ప్రధానాచార్యులు, డీన్‌లు, సమన్వయకర్తలతో సమావేశం
* 11.35 నుంచి 11.45 వరకు: పాలకమండలి సమావేశ మందిరంలో గవర్నర్‌ ప్రసంగం
* ఉదయం 11.50 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు: బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశం
* 12.15 నుంచి 12.40 వర్సిటీ, దాని అనుబంధ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి
* 12.50 నుంచి 1.00 వరకు: ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగం
* 1.00 నుంచి 1.15 వరకు: ఉపకులపతి ప్రసంగం
* 1.15 గంటలకు: రూ. 2 కోట్లతో నిర్మించిన మహిళా వసతిగృహం ప్రారంభం
* 1.20 గంటలు: వర్సిటీలో ఏర్పాటుచేసిన స్టాళ్ల పరిశీలన
* 1.30 గంటలు: భోజనం
* 2.00 గంటలు: వర్సిటీ నుంచి బయలుదేరి శ్రీకాకుళం నగరం చేరుకుంటారు.