News

Realestate News

ప్యాకేజీ ఇచ్చేదాకా పనులు చేయనీయం

ప్యాకేజీ ఇచ్చేదాకా పనులు చేయనీయం
రాంబిల్లి, న్యూస్‌టుడే:   మా గ్రామాన్ని నేవీ ప్రాజెక్టు ప్రభావిత గ్రామంగా గుర్తించి ఉపాధి ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ మండలంలోని గోవిందపాలెం గ్రామస్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రత్యామ్నాయ నావికా స్థావరానికి (ఎన్‌ఏఓబీ) నీటి అవసరాలు తీర్చడం కోసం గోదావరి జలాలను తరలించేందుకు చేపట్టిన పైపులైన్‌ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. 2015 మార్చిలో ప్రారంభమైన ఈ పైపులైన్‌ పనులు 2016 డిసెంబరుకు పూర్తి చేయాల్సి ఉంది. రాంబిల్లి శివారు వాడపాలెం మత్స్యకారులు, గోవిందపాలెం గ్రామాల ప్రజలు నావికాస్థావరం ప్రాజెక్టుతో ఉపాధి కోల్పోయామంటూ పైపులైన్‌ పనులను అడ్డుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు 14 కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మాణం పూర్తయింది. ఇంకా నాలుగు కిలోమీటర్ల దూరం పనులు జరగాల్సి ఉంది. ఏపీఐఐసీ ఇంజినీర్ల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనులను ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలు తరచూ అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోవిందపాలెం వద్ద అసంపూర్తిగా ఉండిపోయిన పనులను సోమవారం మొదలుపెట్టడంతో ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడ్డ కుటుంబాలు, గీత కార్మికులు, చేపలవేటపై ఆధారపడే కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని తెలిపారు. ఉపాధి ప్యాకేజీ ఇచ్చేవరకు పనులు చేయనివ్వమంటూ పైపులైన్‌కు గోతులు కప్పుతున్న పొక్లెయిన్‌కు అడ్డుగా నిలుచుని నినాదాలు చేశారు. మూడేళ్లగా మా వినతులను పరిశీలిస్తామని చెప్పడం తప్పితే ఉపాధి గురించి చర్చించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో దూళి నరసింగరావు, జోగా చంటి, పిల్లి సురేష్‌, కిల్లాడ అప్పలరాజు, గొలగాన శ్రీను, రెడ్డి అప్పలకొండ, జోగా పెంటారావు తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo