పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రం
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రం
జీసీసీ ఎండీ సొంతఖర్చుతో ఏర్పాటు
పాడేరు, న్యూస్టుడే: పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రం
మన్యం ప్రాంతానికి చెందిన జీసీసీ ఎండీ బాబూరావునాయుడు స్థానిక ఆదివాసీ యువతకు పోటీ
పరీక్షల్లో ఉపయోగకరంగా ఉండేలా మై డ్రీమ్ స్టడీ సెంటర్ను తన సొంత ఖర్చులతో ప్రారంభించారు.
పాడేరులోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కేంద్రాన్ని ఆదివాసీలకు
అంకితమిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ యువత సివిల్స్, గ్రూప్-1 వంటి ఉన్నత పోటీ పరీక్షలకు
సిద్ధమయ్యేందుకు అవసరమైన శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇక్కడున్న విలువైన పుస్తకాల ద్వారా ఉన్నత పోస్టులకు యువత సిద్ధం కావచ్చని చెప్పారు.
పోటీ పరీక్షల్లో గిరిజన యువత నెగ్గుకు రావాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు.
టీడబ్ల్యూటీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పడాల్ మాట్లాడుతూ గిరిజన యువత పోటీ పరీక్షలను ఎదుర్కోవాలంటే
ఇప్పటి వరకూ వారికి సరియైన సూచనలు,
సలహాలు అందించే వారు లేరన్నారు.
గిరిజన ప్రాంతంలో పుట్టి ప్రజలకు సేవ చేస్తున్న ఐఏఎస్ అధికారి ముందుకొచ్చి ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయడం
మంచి పరిణామమన్నారు.
రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ రామారావు దొర మాట్లాడుతూ ఆదివాసీ యువతకు ఇటువంటి శిక్షణ,
సలహా కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ప్రారంభ కార్యక్రమానికి టీడబ్ల్యూటీయూ రాష్ట్ర నాయకులు గంగన్న పడాల్, కృష్ణారావు,
కోటేశ్వరరావు, అప్పలనాయుడు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.