పోటీతత్వం పెంచేందుకు వేదిక

విద్యార్థుల నుంచి విశేష స్పందన
స్మార్ట్ పరీక్షకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సీబీఎస్ఈ పాఠశాలల్లో 12వ తరగతి విద్యార్థులకు (ఎంబైపీసీ), సీనియర్ ఇంటర్ విద్యార్థులకు (ఎంపీసీ) ఆయా పాఠశాల/కళాశాలల స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌తో పాటు(గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం) ఎంపిక చేసిన అంశంపై వంద పదాలకు మించని వ్యాసాన్ని ఆంగ్లంలో రాసేలా ప్రశ్నపత్రాలను రూపొందించి అందజేశారు. పరీక్ష అనంతరం అక్కడికక్కడే జవాబు పత్రాలను అధ్యాపకులతో మూల్యాంకనం చేయించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి పతకాలతో పాటు ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. తొలిదశలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 125 పాఠశాలలు/కళాశాలల్లో 125 మంది విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేస్తారు. రెండోదశలో ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వీరికి ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బహుమతులు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన విద్యార్థికి ల్యాప్‌టాప్, ద్వితీయస్థానం పొందినవారికి ట్యాబ్, తృతీయ స్థానంలో నిలిచే విద్యార్థికి స్మార్ట్‌ఫోన్‌ను బహుమతులుగా అందజేయనున్నారు.
నవోదయ విద్యాలయంలో…
కిల్తంపాలెం(శృంగవరపుకోట గ్రామీణం), న్యూస్‌టుడే: ఎస్.కోట మండలంలోని కిల్తంపాలెం నవోదయ విద్యాలయంలో మంగళవారం ‘ఎస్ఆర్ఎం-ఈనాడు’ ఆధ్వర్యంలో పోటీ పరీక్ష నిర్వహించారు. ఎంపీసీ, ఎంబైపీసీకి చెందిన విద్యార్థులు హాజరయ్యారు. జీవశాస్త్ర అధ్యాపకులు ఆర్.వి.రాఘవేంద్రరావు పర్యవేక్షించారు. విద్యార్థులకు గణితం, రసాయన, భౌతిక శాస్త్రానికి సంబంధించిన సబ్జెక్టులపై 45 నిముషాలు 75 బిట్లపై పరీక్ష నిర్వహించారు. ఒక్కొక్క సబ్జెక్టుకు 25 చొప్పున మార్కులు కేటాయించారు. ఇందులో 51 మార్కులతో రామగణేష్ ప్రథమ, వనజాక్షి 46 మార్కులతో ద్వితీయ, శశిన్కుమార్, కిరణ్‌సాయి ఇద్దరు సమానంగా 42 చొప్పున మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు అంజయ్య, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.