News

Realestate News

పైలెట్‌.. ఎవరి మాటా వినడు!

పైలెట్‌.. ఎవరి మాటా వినడు!
కార్గో తరలింపు నిర్ణయాధికారం వారి చేతుల్లోనే
విమాన రవాణాలో ఆసక్తికర అంశాలెన్నో..
ఈనాడు – విశాఖపట్నం

విశాఖ విమానాశ్రయం మరో మెట్టెక్కుతోంది. దేశీయ కార్గో స్థాయి నుంచి అంతర్జాతీయ కార్గో సేవలందించేందుకు సమాయత్తమవుతోంది. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ మొదలవబోతోంది. దీనిపై కేంద్ర మంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కార్గోలో కొన్ని ఆసక్తికర అంశాలున్నాయి. సంబంధిత విమాన పైలెట్‌ నిర్ణయం మేరకే సరకు బరువును అనుమతిస్తారు. కాస్త పెంచి వేసినా ఏమాత్రం అంగీకరించరు. విశాఖ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరకు రవాణా చేస్తున్న వ్యాపారులు తరచూ నిర్ణీత బరువుకు మించి తీసుకెళ్తున్నారు. వీటిని పైలెట్లు అంగీకరించకపోవటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

విశాఖ విమానాశ్రయానికి వచ్చే విమానాలు
ఎయిర్‌బస్‌ 320, 321, 330
ఎయిర్‌బస్‌ బోయింగ్‌ 277
ఎయిర్‌బస్‌ బోయింగ్‌ 737
వీటి సాధారణ కార్గో సామర్థ్యం – 2 నుంచి 4 టన్నులు

ఇలా ఎందుకంటే…
ప్రయాణికుల్ని చాలా జాగ్రత్తగా గమ్యానికి తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత పైలెట్లదే. అందుకోసం వారికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. విశాఖ నుంచి ఒక్కో నెలలో ఒక్కో రకమైన సరుకుకు డిమాండ్‌ ఉంటోంది. ఒక్కోసారి ఎక్కువగా ఉండొచ్చు. దీనికి తగ్గట్లు.. విమానం లోపల సరకు పెట్టే స్థలం ఉంటేనే రవాణాకు అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ ప్రయాణికులు ఎక్కువైనా, వేరే ఇతర కారణాలున్నా కార్గోకు కోత విధిస్తున్నారు.

* ఒక విమానం ఎగరాలంటే నిర్ణీత బరువు ఉండాలి. విశాఖ కేంద్రంగా నడుస్తున్న విమానాలు 21 టన్నుల నుంచి 22 టన్నుల బరువును మాత్రమే మోయగలుగుతాయి. ప్రయాణికులు, వారి లగేజి, కార్గో బరువు కలిపి లెక్కిస్తారు.

* విమాన సామర్థ్యానికి మించి బరువు ఎక్కువగా ఉంటే పైలెట్‌లు వెంటనే కోత విధిస్తున్నారు. నిర్ణీత ప్రమాణానికి మించి అధికంగా ఉన్న కార్గోలో కోత విధిస్తున్నారు. సరుకు డిమాండ్‌ లేనప్పుడు ఈ సమస్యేమీ రావట్లేదు.

* సరుకును ఎక్కించడంలోనూ పైలెట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. విమానం ముందు, వెనుక భాగాల్లో సమతూకంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ముందు భాగంలో ఎంత? వెనక భాగంలో ఎంత సరుకు నింపాలో నిర్ణయాధికారం వారిదే. ఒక్కో విమానంలో కార్గోకు సంబంధించి 3 నుంచి 4 క్యాబిన్‌లు ఉంటున్నాయి. వీటిలో సమతూకంగానే వేయాలి.

ఈ సందర్భాల్లో అస్సలు కుదరదు..
విమాన రక్షణలో ఏ చిన్న ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నా, నిబంధనల ప్రకారం కొన్ని కీలక సమయాల్లో కార్గోమీదనే కోత పడుతోంది.

* వీఐపీల సందడి ఎక్కువైనా.. వారి రక్షణలో భాగంగా కార్గోను కొంత తగ్గించే అవకాశం ఉంది. భద్రత కారణాల దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పైలెట్లు చెబుతున్నారు.

* ఒకవేళ విశాఖలోనే సదరు విమానం ఇంధనం నింపుకోవాల్సి వచ్చినా కార్గోకు కాస్త ఇబ్బందే. ఎందుకంటే.. విమానం ఇంధన ట్యాంకును పూర్తిగా నింపుతారు. ఆ బరువునూ విమానం మొత్తం బరువులో లెక్కిస్తారు.

* ఒకవేళ ప్రయాణికులు తక్కువై, వారి దగ్గర ఉన్న లగేజీ కూడా తక్కువే ఉన్నపుడు అదనపు కార్గోకు అనుమతులిస్తున్నారు.

* విమానం గాలిలో ఉండే సమయాన్ని బట్టి కూడా కార్గో సామర్థ్యాన్ని పైలెట్‌ నిర్ణయించే అవకాశం ఉంది. స్వదేశీ రవాణాలో ఎక్కడికెళ్లినా.. 2.30 గంటల సమయంకన్నా ఎక్కువ పట్టడం లేదు. అదే విదేశాలకు ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కూడా.. దానికి తగ్గట్లే కార్గో సామర్థ్యాన్ని పైలెట్‌లు నిర్ణయిస్తారు.

* విమాన ప్రయాణానికి 3 గంటల ముందే కార్గోను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో విమానం బయలుదేరే సమయంలోనూ ‘కార్గో కోత’ నిర్ణయాల్ని వెల్లడిస్తారు.

వారి లెక్కలు ఎలా ఉంటాయంటే..
విమానం గాల్లోకి ఎగిరేముందు.. పైలెట్‌లు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి లెక్కల ప్రకారం కొన్ని అంచనాలిలా…

* ఒక విమానంలో 186 మంది ప్రయాణికులు పట్టే సామర్థ్యం ఉందనుకుందాం. ఒక్కొక్కరి బరువు 75 కిలోలు ఉంటుందనుకుందాం. కేవలం ప్రయాణికుల బరువే 13.95 టన్నులవుతుంది.

* ప్రయాణికులకు 15 కిలోల వరకు లగేజీని అనుమతిస్తారు. అంటే.. ఈ 186 మంది దగ్గర 2.9 టన్నుల లగేజీ ఉన్నట్లు.

* ప్రతీ ప్రయాణికుని దగ్గర చేతి లగేజీలు ఉండొచ్చు. అంటే.. ల్యాప్‌టాప్‌, హ్యాండ్‌బ్యాగ్‌, ఆభరణాలు.. ఇలాంటివి.. ఇవన్నీ ఒక్కొక్కరి దగ్గర 3 కిలోలు ఉంటాయనుకుందాం. వీటి బరువు.. 0.5 టన్ను

* విమానంలో ఇంధనం పూర్తి ట్యాంకు ఉంటే దాని బరువు 2 టన్నుల వరకూ ఉంటుంది.

* ఈ బరువులన్నీ కలిపితే 19.35 టన్నులవుతుంది.

* విమానం కేవలం 21.5 టన్నుల బరువుతోనే గాల్లో ఎగిరే అవకాశం ఉన్నపుడు అంతకుమించి అనుమతించడానికి లేదు.

* ఈ లెక్కలన్నీ చూసుకున్నతర్వాతే కార్గో ఎంతనేది నిర్ణయమవుతుంది. 21.5 టన్నుల బరువు చేరడానికి మరో 2.15 టన్నుల కార్గో మాత్రమే నింపుతారు.

* ఒకవేళ విమానంలో ప్రయాణికుల లగేజీ తక్కువైనా, పిల్లలెక్కువై బరువు తగ్గినా.. కార్గోను పెంచేందుకు పైలెట్‌కు అధికారముంది.

విమానం రాకముందే సిద్ధం..
విమానం రాకముందే ప్రయాణికులు, కార్గోకు సంబంధించి సమగ్ర వివరాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రయాణికులు ఎంతమంది, వారిలో ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్లాలి, వారి దగ్గర ఎంత బరువు లగేజీ ఉంటుంది, అవి ఏవేవి అనే వివరాలూ ఇవ్వాల్సి ఉంటుంది. కార్గోకు సంబంధించి ప్రతీ బ్యాగు వివరాలతో పాటు దాని బరువు, ఎక్కడికి చేరాలనేదీ వివరంగా తెలపాలి. ప్రయాణికుల సంక్షేమం పైలెట్‌ల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి.. అతని మాటే వినాల్సి ఉంటుందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. నిబంధనల్ని అతిక్రమిస్తే విమానం గాల్లో లేపేందుకూ పైలెట్‌ నిరాకరించే అవకాశం ఉంది.