News

Realestate News

పేదల దరికి… ఖరీదు వైద్యం

పేదల దరికి… ఖరీదు వైద్యం
పోర్టు ఆసుపత్రిలో హోమిబాబా క్యాన్సర్‌ విభాగం
అందరికీ అందుబాటులోకి తెచ్చిన విశాఖ పోర్టు
ఈనాడు, విశాఖపట్నం

అత్యాధునిక క్యాన్సర్‌ వైద్యం నగర రోగులకు అందుబాటులోకి వచ్చింది. జాతీయ రహదారిని ఆనుకుని సాలగ్రామపురంలో ఉన్న పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రి దీనికి వేదికైంది. విశాఖ పోర్టు, హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రి – పరిశోధన కేంద్రం ఉన్నతాధికారులు పరస్పర సహకారంతో ఒక అంగీకారానికి వచ్చి క్యాన్సర్‌ రోగులకు అత్యంత ఖరీదైన వైద్యాన్ని అతితక్కువ ఖర్చుతో అందించడానికి నిర్ణయించారు. ఫలితంగా ఒక్క పోర్టు ఉద్యోగులకే కాకుండా నగరంలోని పేద, సామాన్య ప్రజలకు కూడా అత్యాధునిక శస్త్రచికిత్సలు పోర్టు ఆసుపత్రిలో నిర్వహించడానికి మార్గం సుగమం అయ్యింది.

గనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రికి ప్రస్తుతం శస్త్రచికిత్సల విభాగం లేదు. ఒ.పి.కే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం 30 కి.మీ.ల దూరంలోని హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రి ఉన్న అగనంపూడి వరకు వెళ్లడం క్యాన్సర్‌ బాధితులకు ఒకింత ఇబ్బందికరంగా మారుతోంది. శస్త్రచికిత్సలు చేయించుకోవాలంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి రూ.వేలు, రూ.లక్షల చేతిచమురు వదిలించుకోవాల్సిందే. కాన్సర్‌ బాధితుల ఇబ్బందులన్నింటినీ పరిష్కరించేవిధంగా పోర్టు, హోమీ బాబా క్యాన్సర్‌ ఆసుపత్రి అధికారులు పరస్పర ఆమోదయోగ్య ఒప్పందానికి వచ్చారు. ఫలితంగా శస్త్రచికిత్సలు అవసరమయ్యే పేదరోగులకు అతితక్కువ ఖర్చుతోనే శస్త్రచికిత్స చేయించుకునే అధునాతన సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లైంది.

పోర్టు ఉద్యోగులకే కాదు…..ఇతర పేద, సామాన్యులకూ సేవలు….
నగరంలోని జాతీయరహదారిని ఆనుకుని సాలిగ్రామపురం ప్రాంతంలో సువిశాల ప్రాంగణంలో ఉన్న పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రి ప్రత్యేకించి పోర్టు ఉద్యోగులకే ప్రస్తుతం సేవలందిస్తోంది. అయితే క్యాన్సర్‌ శస్త్రచికిత్సలు మాత్రం పోర్టు ఉద్యోగులకే కాకుండా ఎవరైనా సరే చేయించుకునేలా నిబంధనలను సడలించింది. ఫలితంగా పోర్టు ఉద్యోగులతోపాటు పేదలు, సామాన్యులు కూడా అధునాతన క్యాన్సర్‌ వైద్యాన్ని పోర్టు ఆసుపత్రిలో పొందే వెసులుబాటు కలుగుతోంది. పోర్టు ఉద్యోగులకు ప్రాథమిక పరీక్షలు సైతం గోల్డెన్‌జూబ్లీ ఆసుపత్రిలోనే నిర్వహిస్తారు. పోర్టు ఉద్యోగులుకాని వారు మాత్రం తొలుత అగనంపూడి హోమీబాబా కేన్సర్‌ ఆసుపత్రిలో తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స అవసరమని నిర్థరించిన తరువాత మాత్రమే పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రికి సిఫార్సు చేస్తారు. శస్త్రచికిత్స అనంతర సేవలు కూడా పోర్టు ఆసుపత్రిలోనే పొందవచ్చు. కీమో థెరపీతో సహా అన్ని సేవలు పోర్టు ఆసుపత్రిలో అందించడానికి ఏర్పాట్లు చేశారు.

పోర్టు ఉద్యోగులు కానివారి కోసం ప్రత్యేక బస్సు
పోర్టు ఉద్యోగులు కానివారు ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడానికి అగనంపూడి ఆసుపత్రికి రావాల్సి ఉన్న నేపథ్యంలో వారు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటు చేశారు. ఆ బస్సు ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు రైల్వేస్టేషన్‌ నుంచి 7.40గంటలకు ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్‌ నుంచి బయలుదేరుతుంది. ఆ బస్సులో ఉచితంగా అగనంపూడి క్యాన్సర్‌ ఆసుపత్రికి నేరుగా చేరుకోవచ్చు.

రూ.5 కోట్లతో అధునాతన సదుపాయాలు:పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రిలో మూడో అంతస్తును హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రి అధికారులు రూ.5 కోట్ల వ్యయంతో కార్పొరేట్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి దీటుగా అభివృద్ధి చేశారు.

హెపా ఫిల్టర్డ్‌ లామినార్‌ ఎయిర్‌ఫ్లో ఆపరేషన్‌ థియేటర్‌ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇలాంటి ఆపరేషన్‌ థియేటర్లలో శస్త్రచికిత్సలు చేస్తే ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది.

మూడు వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చారు.

క్యాన్సర్‌ విభాగం ఉన్న మూడో అంతస్తును అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి రూ.కోటి వెచ్చించారు.

ఒక్కో వార్డులో ఆరు పడకలు చొప్పున మూడు అధునాతన వార్డులను అభివృద్ధి చేసి 18 పడకలు అందుబాటులోకి తెచ్చారు.

అత్యంత అధునాతనంగా ఆరు పడకలతో ఐ.సి.యు.ను అభివృద్ధి చేశారు. ఫలితంగా మొత్తం 24 పడకలు క్యాన్సర్‌ బాధితులకు అందుబాటులోకి వచ్చినట్లైంది.

శస్త్రచికిత్సలకు మార్గం సుగమం అయ్యింది: పోర్టు ఉన్నతాధికారులు పోర్టు ఆసుపత్రి మూడో అంతస్తు మొత్తాన్ని క్యాన్సర్‌ శస్త్రచికిత్సలు చేయడానికి వీలుగా ఆధునికీకరించడానికి అంగీకరించారు. పలు రకాల క్యాన్సర్లకు అవసరమైన శస్త్రచికిత్సలను నగరంలోని పోర్టు ఆసుపత్రిలో నిర్వహించడానికి అవకాశం కలిగింది. ఫలితంగా రోగులకు రూ.వేలు, రూ.లక్షల విలువైన చికిత్సలు నామమాత్రపు ధరతో అందించడానికి వీలవుతుంది. విభిన్న క్యాన్సర్‌ శస్త్రచికిత్సలు చేసే నైపుణ్యాలు మావద్ద ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన ఆపరేషన్‌ థియేటర్లో రొమ్ముక్యాన్సర్‌, తదితర శస్త్రచికిత్సల్ని రోజుకు ఆరు వరకు సునాయాసంగా చేయవచ్చు. కొన్ని సంక్లిష్ఠ క్యాన్సర్‌ శస్త్రచికిత్సలకు మాత్రం ఎనిమిది గంటలకు పైగా పట్టే అవకాశం ఉంటుంది.

– డాక్టర్‌ డి.రఘునాధరావు, డైరెక్టర్‌, హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రి- పరిశోధన కేంద్రం

పేద, సామాన్యులకు వరం :
పోర్టు గోల్డెన్‌జూబ్లీ ఆసుపత్రిలో వినియోగించకుండా ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని హోమీబాబా ఆసుపత్రికి కేటాయించాం. రూ.5కోట్ల వ్యయంతో అధునాతన సదుపాయాలతో క్యాన్సర్‌ శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రారంభించడం పేద, సామాన్యులకు వరమనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రప్రభుత్వ భారత అణుశక్తి విభాగం, టాటా మెమోరియల్‌ సంస్థలు సంయుక్తంగా అతితక్కువ ధరలకు అత్యాధునిక క్యాన్సర్‌ వైద్యాన్ని అందిస్తున్నాయి. ఆ విభాగాన్ని పోర్టు ఆసుపత్రిలో ఏర్పాటు చేయడంతో పోర్టు ఉద్యోగులకే కాకుండా నగరంలోని వేలాది మంది పేద, సామాన్యులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా రోగుల తాలూకూ బంధువులు బస చేయడానికి, సేదదీరడానికి వీలుగా సమీపంలోని భవనాన్ని ఆధునికీకరిస్తున్నాం.

– ఎం.టి.కృష్ణబాబు, ఛైర్మన్‌, విశాఖ పోర్టు

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo