News

Realestate News

పేదల గృహ నిర్మాణంపై ప్రభుత్వ దృష్టి

పేదల గృహ నిర్మాణంపై ప్రభుత్వ దృష్టి
ఆకర్షణీయ ప్రాజెక్టుల్లో పురోగతి చూపండి
విశాఖపట్నం, న్యూస్‌టుడే:  రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తోన్న గృహాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని, విశాఖలో స్థలాల సమస్య పరిష్కారానికి అవసరమైన భూసేకరణ జీవోను విడుదల చేస్తామని మంత్రి డాక్టర్‌ పి.నారాయణ అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా వీసీ బసంత్‌కుమార్‌, జేసీ సృజన, టిడ్కో, జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులతో ల్యాండ్‌ పూలింగ్‌, ఆకర్షణీయ ప్రాజెక్టులపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. విశాఖకు 57,499 గృహాలు మంజూరు చేయగా, మొదటి దశలో 4,120 పూర్తి చేశామన్నారు. రెండో దఫా 13,620 గృహాలకు గాను 10,240 నిర్మాణానికి పనులు ప్రారంభించామన్నారు. మరో 1760 టెండరు దశలో ఉన్నాయన్నారు. నగర ఎమ్మెల్యేలు ఇంకా గృహాలు కావాలని కోరుతున్నారని, ముఖ్యమంత్రితో చర్చించి మరో 30 వేలు మంజూరు చేస్తామన్నారు. భూసేకరణ ద్వారా 400 ఎకరాలు సేకరించి గృహ నిర్మాణం చేపడతామన్నారు. ఆకర్షణీయ ప్రాజెక్టులో భాగంగా రూ. 111 కోట్లతో 17 పనులు పూర్తిచేశామని, మరో రూ. 248 కోట్ల విలువైన పనులు టెండరు, డీపీఆర్‌ దశలో ఉన్నాయన్నారు. రూ. 27 కోట్లతో ఇతర ప్రభుత్వరంగ సంస్థలతో కలిసి పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 396 కోట్లు మంజూరు చేశాయని, వచ్చే మార్చిలో మరో రూ. 200 కోట్లు వస్తాయన్నారు. డిసెంబరులోగా రూ. 400 కోట్ల పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు.

అనకాపల్లి జోన్‌కు రూ. 49 కోట్లు మంజూరు
అనకాపల్లి: అనకాపల్లి జోన్‌లోని శివారు ప్రాంతాల అభివృద్ధికి రూ.49 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనిలో రూ. 29 కోట్లు పట్టణ పరిధిలో, రూ. 20 కోట్లు విలీన గ్రామాల్లో ఖర్చు చేస్తామన్నారు. రహదారులు, మురుగు కాలువలు, విద్యుత్తు దీపాలు, మంచినీటి సరఫరాకు ఈ నిధులు వెచ్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకు రూ. 12,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అనకాపల్లిలో నూకాలమ్మ, పెరుగుబజారు రహదారులను విస్తరిస్తామన్నారు. స్థలాలు పోయినవారికి నాలుగురెట్లు టీడీఆర్‌ పత్రాలు అందిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి, పేదలకు పోషకాహారం అత్యంత పరిశుభ్రమై పరిసరాల్లో రూ.5కే అందించే పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటి వరకు 203 క్యాంటీన్లు ప్రారంభించామని, పేదలు ఎక్కువగా లబ్ధిపొందుతుండటంతో మరిన్ని క్యాంటీన్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ఫలహారం, రెండుపూటలా భోజనానికి ఒక్కోరికి రూ. 73 ఖర్చవుతుందన్నారు. దీనిలో రూ. 15 లబ్ధిదారు చెల్లిస్తే మిగిలిన రూ. 58 ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు.  రాష్ట్రంలో అన్నా క్యాంటీన్‌ ద్వారా రోజుకు 2.15 లక్షల మందికి భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ బి.రాము, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జగన్మోహనరావు, తెదేపా నేతలు బుద్ద నాగజగదీశ్వరరావు, డాక్టకు కె.నారాయణరావు, కాయల మురళి, డాక్టరు కె.సత్యవతి, సబ్బవరపు గణేష్‌, బొలిశెట్టి శ్రీనివాసరావు, కొణతాల వెంకటరావు, ఎం.సురేంద్ర, గుత్తా ప్రభాకర్‌చౌదరి, పలకా సత్యనారాయణ, కొణతాల శ్రీను, డాక్టరు కె.విష్ణుమూర్తి, నడిపల్లి గణేష్‌ పాల్గొన్నారు.

భూసేకరణపై దృష్టిపెట్టాలి…
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భూసేకరణ ఉత్తర్వుల కోసం అధికారులు వేచిఉండటం తగదని, ఇతర మార్గాల ద్వారా భూములు స్వాధీనం చేస్తే బాగుండేదన్నారు. కొమ్మాదిలో 100 ఎకరాలు సేకరించాలని అధికారులకు సూచించగా, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, తమ ప్రాంతానికి చెందినవారికి కొమ్మాదిలో గృహ నిర్మాణం చేపట్టడానికి దరఖాస్తులు స్వీకరించారని, ప్రాధాన్యత క్రమంలో తమకు అక్కడి స్థలాన్ని కేటాయించాలని కోరారు. మంత్రి గంటా మాట్లాడుతూ ముందు భీమిలి నియోజకవర్గం వారికి గృహాలు కేటాయించిన తర్వాత మిగతావారికి ఇస్తామన్నారు. రెండు నియోజకవర్గాలకు 25 ఎకరాల చొప్పున కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దక్షిణంలో చిలకపేటలో జి+4 తరహా నిర్మాణం చేపడితేనే లబ్ధిదారులకు ఇళ్లు సరిపోతాయని వాసుపల్లి తెలియజేయగా, జి+3కు మాత్రమే ప్రభుత్వం అనుమతించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ పురంలో భూసేకరణ చేయవద్దని, మిగతా ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. అధికారులు, ఎల్‌అండ్‌టీ, టాటా కన్సల్టెన్సీల మధ్య సమన్వయం లేదని వివరించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ముదపాక భూములను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు మురికివాడల్లో నిర్మాణాలు వేగవంతం చేయాలని, గృహ నిర్మాణానికి సంబంధించి తీసిన గోతుల్లో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లిలో చేపడుతున్న గృహ నిర్మాణ పనులు త్వరగా జరిగేలా చూడాలన్నారు. టీడీఆర్‌ల విషయమై తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నివేదిక సమర్పించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు జీవీవీఎస్‌ మూర్తి, ఎస్‌ఎస్‌ వర్మ, ప్రధాన ఇంజినీరు దుర్గాప్రసాద్‌, వ్యయ పరిశీలకుడు మంగపతిరావు, సీసీపీ విద్యుల్లత,  ఎస్‌ఈలు వెంకటేశ్వరరావు, వినయ్‌కుమార్‌, పల్లంరాజు, వేణుగోపాల్‌, వుడా ఈఈ కేవీఎన్‌రవి, సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.