పేదరికంపై గెలుపే ప్రభుత్వ ధ్యేయం
పేదరికంపై గెలుపే ప్రభుత్వ ధ్యేయం
ప్రతి కుటుంబం రూ. 10 వేల ఆదాయం పొందాలి
అందుకోసమే వృత్తి పరికరాలు, రాయితీ రుణాల పంపిణీ
ఆదరణ-2 పరికరాల పంపిణీ సభలో మంత్రి అయ్యన్నపాత్రుడు
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా చేతివృత్తుల ఆధునికీకరణ,
పరిరక్షణ ద్వారా పేదరికంపై గెలుపు సాధించాలన్నది ప్రభుత్వ ఆశయమని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
పెదబొడ్డేపల్లి మార్కెట్‌యార్డులో సోమవారం ఆదరణ-2 పథకం కింద వృత్తి పరికరాల పంపిణీ,
వివిధ కార్పొరేషన్ల రాయితీ రుణాల మంజూరు పత్రాల అందజేసే డివిజన్ స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ ఒకప్పుడు కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమయ్యే కొన్ని రకాల వృత్తులు కాలానుగుణంగా ఇప్పుడు
అనేక సామాజిక వర్గాలవారు చేపడుతున్నారని తెలిపారు.
వీరిలో క్షతియ, బ్రాహ్మణ తదితర అగ్రకులాల పేదలు సైతం ఉన్నారన్నారు.
గొలుగొండ మండలం ఏటిగైరంపేటలో ఒక మహిళ నెలకు పదివేల రూపాయల ఆదాయం సంపాదించే మార్గం చెప్పింది.
తనకున్న ఒక గేదె ద్వారా నెలకు ఐదువేల రూపాయల ఆదాయం వస్తోందని,
ప్రభుత్వం మరో గేదె ఇస్తే పదివేల రూపాయల ఆదాయం పొందుతానని పేర్కొంది.
ఆ స్ఫూర్తితోనే ఆదరణ-2 ద్వారా చేతివృత్తిదారులు అధికంగా ఆదాయం సంపాదించడానికి పరికరాలు,
విరివిగా రాయితీ రుణాలు ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 8 లక్షల మందికి రూ.4 వేలు కోట్లు ఆదరణ-2 కింద వెచ్చిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో 13 వేల మందికి రూ.84.4 కోట్లు, నర్సీపట్నం డివిజన్లో 3265 మందికి రూ. 31.55 కోట్లు,
నియోజకవర్గంలో 1500 మందికి రూ.11.15 కోట్లు విలువైన పరికరాలు ఇస్తున్నామని వివరించారు.
లబ్ధిదారులు వీటిని అమ్ముకోవద్దని కోరారు.
పేదలకు రాయితీ రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు సహకరించని విషయాన్ని ఇటీవల సమీక్షలో గుర్తించామన్నారు.
రుణాలు పొందిన వారిలో తిరిగి చెల్లించేవారు 20 శాతమన్నా ఉండడం లేదన్నారు.
ఆరేళ్లగా ఈ పరిస్థితి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారని పేర్కొన్నారు.
కొంత ఆర్థిక భారమైనా ప్రభుత్వమే నేరుగా రుణాలిచ్చేలా చూడాలన్న యోచన ఉందన్నారు.
కార్పొరేషన్ల ద్వారా పేదలకు ఇన్నోవా కార్లు సైతం ఇస్తున్నామన్నారు.
వారాకోసారి కారుని తమ కుటుంబం అవసరాలకు వాడుకున్నా మిగతా రోజుల్లో ఆదాయం సంపాదించుకునేందుకు ఉపయోగిస్తే త్వరితంగా బ్యాంకు
రుణం తీర్చవచ్చని సూచించారు.
రెండెకరాల పొలంలో ఏడాదికి మిగిలే ఆదాయం పదివేల రూపాయలకు మించడం లేదని,
ప్రభుత్వం ఇచ్చే పింఛను రూ.12 వేలుగా ఉందని గుర్తించాలన్నారు.
ప్రభుత్వం ఇచ్చే రాయితీపై ఒక బ్యాంకు వడ్డీ తీసుకుంటోందని లబ్ధిదారుడొకరు తనకు చెప్పారని తెలిపారు.
ఏ బ్యాంకు వారైనా ఇలాచేస్తే చొక్కా పట్టుకుని తోసేసి, బ్యాంకుకు తాళం వెయ్యండి. మిగతా సంగతి నేను చూసుకుంటానని మంత్రి భరోసా ఇచ్చారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే వి.అనిత ప్రసంగిస్తూ ప్రతి ఇంట్లో శుభకార్యానికి ప్రభుత్వం సాయపడుతోందని,
ఏ ఇంట్లో కష్టమొచ్చినా ఆదుకుంటోందని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఎ.సిరి, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, పురపాలిక వైస్‌ఛైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు,
మార్కెట్ కమిటీ ఛైర్మన్ అడిగర్ల నానిబాబు, మండలాధ్యక్షులు రమణమ్మ, చిన్నయ్యమ్మ, సన్యాసిదేవుడు, సత్యనారాయణ,
జడ్పీటీసీ సభ్యుడు తారక వేణుగోపాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బి.వి.రమణ, తాండవ ఛైర్మన్ కొండబాబు, మంత్రి అయ్యన్న కుమారుడు విజయ్,
డెయిరీ డైరెక్టర్ సూర్యనారాయణ, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భద్రతను ఏఎస్పీ ఆరిఫ్‌హఫీజ్ పర్యవేక్షించారు.
నర్సీపట్నం అర్బన్: వైకాపా నాయకుడు జగన్‌పై తల్లిగా విజయమ్మకు ప్రేమ ఉండడం సహజమేనని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కొడుకు తప్పుటడుగు వేస్తే మందలించాల్సిన బాధ్యత ఆమెపై ఉందన్నారు.
నిజంగా ఎవరినైనా చంపాలని అనుకుంటే కోడికత్తితో దాడి చేస్తారా? అని ప్రశ్నించారు.
హత్యా రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ తొలి నుంచి వ్యతిరేకమన్నారు.
హత్యలతో రాజకీయాలు చేయలేమనేది గుర్తించాలన్నారు.
విచారణ నీరుగారుస్తున్నారని విజయమ్మ అంటున్నారని, ఏ విచారణకైనా సిద్ధమేనని అయ్యన్న స్పష్టం చేశారు.