News

Realestate News

పెరగనున్న భూముల విలువ

పెరగనున్న భూముల విలువ
2 నుంచి 5 శాతం మేర అవకాశం
అభివృద్ధి చెందిన ప్రాంతాలపైనే దృష్టి
మొదలైన యంత్రాంగం కసరత్తు
ప్రస్తుతం గజం ధర.. దసపల్లా లేఅవుట్‌లో రూ. 61 వేలు, సీబీఎం కాంపౌండులో రూ. 72 వేలు, మహారాణిపేటలో రూ. 35 వేలు, ఎం.వి.పి.కాలనీలో రూ. 50 వేలు, పెదవాల్తేరులో రూ. 50 వేలు, రామ్‌నగర్‌ (మెయిన్‌రోడ్డు)లో రూ. 72 వేల వరకు ఉంది. మధురవాడ వంటి ప్రాంతాల్లో మెయిన్‌ రోడ్డు, గ్రామం లోపల ఆయా పరిస్థితులను బట్టి గజం రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకూ పలుకుతోంది. ఆయా ధరలపై 2 నుంచి 5 శాతం మేర పెరగనుంది. ఎంతన్నది వచ్చే వారం ఖరారవుతుంది. ఉదాహరణకు ఎంవీపీ కాలనీలో 5 శాతం మేర పెరిగితే గజం విలువ రూ. 52,500 లకు చేరుతుంది. ప్రాంతాల వారీ కసరత్తును అధికారులు తాజాగా చేపట్టారు.

న్యూస్‌టుడే – వన్‌టౌన్‌
నగరంలో భూముల విలువ స్వల్పంగా పెరగనుంది. అభివృద్ధి, విస్తరణ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న విలువపై 2 నుంచి గరిష్ఠంగా 5 శాతం వరకు పెంచనున్నారు. భూముల విలువను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడం లేదు. నిర్దేశిత  లక్ష్యాలను చేరలేకపోతోంది. స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉండే విశాఖ నగరంలో కూడా గతేడాది లక్ష్యాలను చేరుకోలేదు. ఈ పరిస్థితుల్లో భూముల విలువను భారీగా పెంచరాదనే సంకేతాలు ఉన్నతాధికారుల నుంచి వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని స్వల్పంగా పెంచాలని అధికారులు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం జేసీ డాక్టర్‌ జి.సృజన ఆధ్వర్యంలో అధికారులు సమావేశమయ్యారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ సరోజ, విశాఖ జిల్లా రిజిస్ట్రార్‌ కె.ఆనందరావు, నగర పరిధిలోని వివిధ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం నగర పరిధిలో ప్రాంతాల వారీ విలువలపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల జరుగుతున్న తీరుతెన్నులను చర్చించారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వల్పంగా మాత్రమే పెంచాలని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఆగస్టు నుంచి అమల్లోకి: అభివృద్ధి ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లో గరిష్ఠంగా 5 శాతం, నగర పరిధిలోని మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 5 శాతంలోపు పెంచాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జేసీ సృజన అధికారులకు సూచించారు. తదుపరి మళ్లీ ఈ నెల 17న మంగళవారం ఉన్నతాధికార కమిటీ సమావేశం కానుంది. నాటి సమావేశంలో మరోసారి చర్చించి పెంపునకు తుది రూపు ఇవ్వనున్నారు. అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అక్కడ నుంచి ఆమోదం లభించగానే అమలు చేయనున్నారు. భూ విలువ పెంపు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.

2017-18లో జిల్లా ఆదాయ లక్ష్యం రూ. 551.75 కోట్లు. వచ్చింది మాత్రం రూ. 489.29 కోట్లు. అంటే లక్ష్యంలో 88.68 శాతం మేర సాధించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ. 634 కోట్లు. తొలి త్రైమాసికానికి సంబంధించి రూ. 146.82 కోట్లు లక్ష్యంగా నిర్ణయిస్తే రూ. 134.20 కోట్ల మేర వసూలైంది.

అనుకున్నంత వేగంగా స్థిరాస్తి వ్యాపారం వృద్ధి నమోదు చేయకపోవటం వల్ల భూముల విలువను భారీగా పెంచకూడదని అధికారులు నిర్ణయించారు. గత 15 నెలల వ్యవధిలో జరిగిన రిజిస్ట్రేషన్లు, వచ్చిన ఆదాయ వివరాలను విశ్లేషించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అసలు పెంచే అవకాశమేమీ లేదు. ఆయా ప్రాంతాల్లో పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలే రాలేదు. నగర పరిధిలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పెంపు ఇలా ఉండే అవకాశం ఉంది.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo