News

Realestate News

పూడిమడకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

Working on to make Pudimadaka area as tourism place said by Lalam Bhavani in vizag news image

జడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలం భవాని

పూడిమడక (అచ్యుతాపురం), న్యూస్‌టుడే: పూడిమడక తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ లాలం భవాని తెలిపారు. మండలంలో పూడిమడకలో బుధవారం ఆమె పర్యాటక శాఖ కార్యనిర్వాహక సంచాలకులతో కలిసి పర్యటించారు. ముందుగా కడపాలెం వద్ద తీరప్రాంతాన్ని పరిశీలించిన ఆమె తర్వాత ఉప్పుటేరులో బోటులో ప్రయాణం చేశారు. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి వీలున్న ప్రదేశాలను పరిశీలించారు. ఉప్పుటేరును విస్తరించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న సుందర దృశ్యాలు, ఉప్పుటేరు అందాలు, సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న సహజసిద్ధమైన కొండలను సందర్శక అనుకూల ప్రదేశాలగా గుర్తించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ భవానీ మాట్లాడుతూ పూడిమడకను అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దత్తత తీసుకున్నానన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఉండాల్సిన అన్ని రకాలైన అర్హతలు పూడిమడకకు ఉన్నాయన్నారు. పూడిమడకలో తప్ప జిల్లాలో మరెక్కడా సముద్రం స్నానం చేయడానికి వీలుగా లేదని ఆమె గుర్తుచేశారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో కంపెనీలకు విదేశీ ప్రతినిధులు వస్తున్నా వారు సరదాగా గడపడానికి సరైన పర్యాటక ప్రాంతాలు అందుబాటులో లేవన్నారు. వీరందరికీ ఉపయోగపడే విధంగా పూడిమడకను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పర్యాటక ప్రాజెక్టును తీసుకుకెళ్లామని ఆమె తెలిపారు.

త్వరలో సాంకేతిక బృందం పర్యటన
పర్యాటక శాఖ కార్యనిర్వాహక సంచాలకులు శ్రీరాములనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రుషికొండ వద్ద రూ. 3.5 కోట్లతో, మంగమారిపేట వద్ద రూ. 1.5 కోట్లు, కొండకర్ల ఆవను రూ. 50 లక్షలు, రేవుపోలవరాన్ని రూ. 2.5 కోట్లతోనూ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యాటకంగా పూడిమడక ఎంతవరకు ఉపయోగపడుతుందీ తెలుసుకోవడానికి ఈ ప్రాంతంలో పర్యటించినట్లు ఆయన చెప్పారు. సాంకేతిక అధికారుల బృందం కూడా త్వరలో పర్యటించి నివేదిక అందించిన తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ అటవీ, మత్స్యశాఖలతో సమన్వయంతో పని చేస్తామన్నారు. అనంతరం కొండకర్ల ఆవలో పర్యటించి ఆవను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లాలం భాస్కరరావు, మండల పరిషత్తు అధ్యక్షుడు చేకూరి శ్రీనివాసరాజు, జడ్పీటీసీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, సర్పంచి మేరుగు కొండమ్మ, పంచాయతీరాజ్‌ డీఈ శశిభూషణ్‌, సోమశేఖర్‌, తహసీల్దార్లు జ్ఞానవేణి, ప్రసాదు, ఇన్‌ఛార్జ్‌ ఎంపీడీవో శ్రీనివాస్‌, తెదేపా నాయకులు మేరుగు బాపునాయుడు, వాసుపల్లి అప్పారావు, గంగిరి రాజు, ఉమ్మిడి అప్పారావు, జగన్‌, మేరుగు వెంకటరావు, సమ్మింగి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo