News

Realestate News

పుస్తకాల హుండీ.. మీకోసమేనండి!

పుస్తకాల హుండీ.. మీకోసమేనండి!
సేకరణకు గ్రంథాలయ శాఖ కొత్త విధానం
ప్రవాసాంధ్రుల సాయం తీసుకోవాలని నిర్ణయం
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే
ఆలయాల్లో డబ్బు లేయడానికి హుండీలు ఉంచుతారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు వేయడానికి ఇప్పుడు హుండీలు పెట్టారు. దాతలెవరైనా మంచి పుస్తకాలను తీసుకువచ్చి వీటిలో వేయవచ్చు. వీటిని సేకరించి పాఠకులకు అందుబాటులో ఉంచుతారు. పుస్తకాలను విరాళంగా ఇవ్వడానికి చాలామంది సుముఖంగా ఉన్నా ఇప్పటి వరకు దీనికోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఇప్పుడు హుండీల విధానం అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో పాటు ప్రవాసాంధ్రుల సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.

జిల్లాలో ప్రస్తుతం 63 శాఖా గ్రంథాలయాలు, ఐదు గ్రామీణ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. వీటిలో 132 మంది అధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 63మంది పనిచేస్తున్నారు. జిల్లాలో ఏటా పదిహేడు లక్షల మంది వీటిలోకి చదువుకోవడానికి వస్తారని అంచనా. వీరిలో పఠనం వ్యసనంగా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. వీరి వద్ద అనేక విలువైన పుస్తకాలు ఉంటాయి. తమకు అవసరం లేనివాటిని సమాజ అవసరాలకు ఉపయోగపడేలా చూడాలని చాలమంది యోచిస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించేందుకు ఇప్పుడు అన్ని చోట్లా పుస్తక హుండీలు ఏర్పాటు చేశారు. అరుదైన పుస్తకాలు దానమివ్వాలని ఆశించేవారు హుండీలను ఉపయోగించుకోవాలని గ్రంథాలయ శాఖ అధికారులు కోరుతున్నారు. గత నెల 28నే వీటి ఏర్పాటుకు సంబంధించి జిల్లా అధికారి నుంచి ఆదేశాలొచ్చినా చాలామంది అట్టపెట్టెలను మొక్కుబడిగా ఏర్పాటు చేసిన వూరుకున్నారు. కొంతమంది మాత్రం పెట్టెలను ముస్తాబు చేసి అమర్చారు. ఇలాంటి చోట్ల మాత్రం కొందరు పుస్తకాలను వేస్తున్నారు. నర్సీపట్నంలోనూ గురువారం పుస్తకాభిమాని ఒకరు పుస్తకాలేశారు. జిల్లాలో 63 అధికారులు శ్రద్ధ చూపితే ఇదో ఉద్యమంలా రూపుదిద్దుకుని పుస్తకాల విరాళం వెల్లువెత్తుతుంది.

ఎన్నారైల సహకారంతో…
గ్రంథాలయాల అభివృద్ధిలో ఎన్నారైల సహకారం తీసుకోవాలన్నది తాజా నిర్ణయం. పాఠకుల కోసం మరుగుదొడ్లు నిర్మాణం, అవసరమైన చోట భవనాలకు మరమ్మతులు, ఫర్నీచర్‌ కొనుగోలు వంటివి ప్రవాసాంధ్రుల సాయంతో చేపట్టాలని ఆదేశాలొచ్చాయి. తమ పరిధిలోని ఎన్నారైలను గుర్తించి గ్రంథాలయ అవసరాలను వారికి వివరించి సహకరించమని కోరాలని సూచనలొచ్చాయి. ముందుకొచ్చిన ఎన్నారైలను సముచిత రీతిలో సత్కరించాలని కూడా ఆదేశించారు. సామాజిక బాధ్యతతో ఇప్పటికే అనేకమంది ఎన్నారైలు సమాజ అభివృద్ధికి విశేషంగా తోడ్పాటు అందిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పౌరులు, విద్యాలయాల అభివృద్ధికి సహకరిస్తున్నారు. స్వయంగా మాట్లాడి పరిస్థితి వివరిస్తే సాయం అందించడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నారు. వీరిని వినియోగించుకునే సామర్థ్యం, బాధ్యత గ్రంథాలయాల అధికారులపైనే ఉందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచిస్తున్నారు. విద్యార్థులంతా పత్రికలు, పుస్తకాలు చదువుకోవడానికి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని, తద్వారా విద్యార్థులను గంథాలయాల వైపు ఆకర్షింపజేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

హుండీ ఏర్పాటు చేశాం
నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో పుస్తక హుండీ ఏర్పాటు చేశాం. దాతలెవరైనా పుస్తకాలు తీసుకువచ్చి హుండీలో వేయొచ్చు. ఇప్పటికే కొందరు పుస్తకాలు వేశారు. అరుదైన పుస్తకాలను హుండీలో వేస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది. పోటీ పరీక్షల పట్ల ఇప్పుడు అనేకమంది మొగ్గు చూపుతున్నారు. గ్రంథాలయాలను వినియోగించుకునే వారిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వారికి ఉపయోగపడే పుస్తకాలను అందజేస్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. తమ గ్రామాల్లోని గ్రంథాలయాల అభివృద్ధికి ప్రవాసాంధ్రులు కూడా ముందుకొచ్చి చేయూతనందించాలి.

– అట్టా నూకరాజు, గ్రంథాలయ అధికారి, నర్సీపట్నం

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo