పుష్కర, తాండవల నుంచి.. విశాఖకు నీళ్లు

ఉక్కుకు నీటి కష్టాలు రానివ్వం
గోదావరి జలాల నిల్వకోసం అదనపు రిజర్వాయర్లు
మంత్రి యనమల
ఎస్ఈ గైర్హాజరీపై ఆగ్రహం: పోలవరం ఎడమకాల్వ పనులు విశాఖ జిల్లాలో తొందరగా పూర్తిచేయాలని మంత్రి యనమల ఆదేశించారు. పనులకు సంబంధించిన అంశాలను తెలియచేసేందుకు రావాల్సిన పర్యవేక్షక ఇంజినీరు (ఎస్ఈ) ఎన్.రాంబాబు సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఈ నుంచి వివరణ తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇక మీదట జిల్లా అధికారులు సమావేశాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవన్నారు. పోలవరం కుడికాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2017 చివరి నాటికి గ్రావిటీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామన్నారు. సీజన్లో గోదావరి ప్రవాహం అధికంగా ఉంటుందని, అలాంటి సమయంలో వచ్చిన నీటిని ఆదా చేయడానికి అవసరమైన రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. దీని కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు అందచేయాలన్నారు.
వ్యవసాయ రంగ బలోపేతం: జిల్లాలో పది లక్షల ఎకరాల మేర వ్యవసాయ భూములుంటే ప్రస్తుతం 4.20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని, మిగతా భూములకు కూడా సాగునీరు అందించేలా ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అన్ని మంత్రి జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 1.5 లక్షల ఎకరాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జలవనరుల శాఖ అధికారులు సకాలంలో స్పందించడం లేదన్నారు. జంఝావతి నుంచి నీటిని తరలించాలన్నారు.
పెద్దఎత్తున ఇంకుడు గుంతలు: జిల్లాలో ఇంకుడు గుంతలను పెద్దఎత్తున తవ్వాలని అధికారులను మంత్రి యనమల ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో 10 వేల గుంతలను తవ్వనున్నట్లు చెప్పారు. దీనికి మంత్రి జోక్యం చేసుకొని పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనే 40 వేల గుంతలు తవ్వితే విశాఖలో పదివేలు మాత్రమే తవ్వడమేమిటని ప్రశ్నించారు. సాధ్యమైనంత ఎక్కువగా గుంతలు తవ్వాలని సూచించారు.
పూడికలు రైతులకు ఇవ్వాలి : మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో భారీఎత్తున పూడికలు పేరుకుపోయాయని అనకాపల్లి ఎమ్మెల్యే పీలాగోవిందు సత్యనారాయణ అన్నారు. పూడికలను తొలగించే ప్రక్రియను రైతులకు అప్పగిస్తే వారే వాటిని తీసుకెళతారని ఆయన సూచించారు. విశాఖ జిల్లాలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు 137 టీఎంసీల నీటి అవసరం ఉండగా, కేవలం ప్రస్తుతం 47 టీఏంసీలు మాత్రమే అందుబాటులో ఉందని, మిగతా 90 టీఎంసీల నీటిని తెచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి యనమల జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లురవీంద్ర, జడ్పీ ఛైర్పర్సన్ లాలం భవానిభాస్కర్, శాసనసభ్యులు రామకృష్ణబాబు, గణబాబు, కె.ఎస్.ఎన్.రాజు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Source : http://www.eenadu.net/