పుష్కర కల.. కాసుల కళ
పోలవరం కాలువలకు ఈ బడ్జెట్లో భారీగా నిధులు
కట్టడాల పనులే కీలకం
ఏడాదిలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు
ఎలమంచిలి, న్యూస్‌టుడే

జిల్లాలో 6, 7, 8 ప్యాకేజీల కింద పోలవరం ఎడమ కాలువ తవ్వకం పనులను 2005 మార్చి 14న ప్రారంభించారు. 6, 7 ప్యాకేజీల కింద కొత్తగా కాలువ తవ్వుతుండగా, ఎనిమిదో ప్యాకేజీలో భాగంగా ఏలూరు కాలువను వెడల్పు చేస్తారు. ఇందులో 6, 7 ప్యాకేజీలే కీలకం. ఈ రెండు ప్యాకేజీలను రూ. 371 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. భూసేకరణలో జాప్యం వల్ల కొంత కాలం పనులు జరక్కపోగా నిధుల కొరత కారణంగా బిల్లుల చెల్లింపులు జరక్క కొంత కాలం జాప్యం జరిగింది. ఇలా రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులకు 12 ఏళ్లు పట్టింది. కాలువ పనులు ప్రారంభించాక అత్యధికంగా బడ్జెట్ కేటాయించడం ఇదే తొలిసారి. కేటాయించిన బడ్జెట్లో కూడా కుడి కాలువ పనులు దాదాపు పూర్తికావడం వల్ల ఈసారి ఎడమ కాలువకు ప్రాధాన్యం ఇచ్చారు. 53 కిలోమీటర్ల పొడవున, 53 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వి నీరు భూమిలోకి ఇంకిపోకుండా చుట్టూ కాంక్రీట్‌తో లైనింగ్ వేస్తున్నారు. గ్రామాలకు ఇబ్బంది లేకుండా అవసరం ఉన్నచోట వంతెనలు నిర్మిస్తున్నారు. నదులపై వయాడెక్టులు నిర్మిస్తున్నారు. జిల్లాలో పాయకరావుపేట మండలం నుంచి ప్రారంభమైన కాలువ కశింకోట మండలం తాళ్లపాలెం వరకూ వస్తుంది. అక్కడి నుంచి ఏలేరు కాలువలోకి నీరు మళ్లిస్తారు. జిల్లాలో రైతుల అవసరాలకు పోను మిగులు నీరు విశాఖ స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం కణితి రిజర్వాయర్కి వెళుతుంది. ఈ రెండు అవసరాలకు పోనూ ఇంకా మిగిలే 7,000 క్యూసెక్కుల నీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి మళ్లిస్తారు. అది ఉత్తరాంధ్రాలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అందించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందిరాసాగర్ ఎడమ ప్రధానకాలువ పేరుతో చేపట్టిన ఈ పనులు పూర్తయితే జిల్లాలో రైతుల కష్టాలు తీరతాయి ఉభయగోదావరి జిల్లాల తరహాల్లో ఇక్కడి పంట పొలాలు సస్యశ్యామలంగా మారతాయి. ఈ సారి కేటాయించిన బడ్జెట్‌తో ప్రాజెక్టులో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి.
జిల్లాలో ఆరో ప్యాకేజీ కింద చేపట్టిన మట్టి పనులు మూడొంతులు పూర్తయ్యాయి. లైనింగ్ పనులు శరవేగంతో సాగుతున్నాయి. ఆధునిక యంత్రాలను రప్పించి పనులు చేస్తున్నారు. ఇక్కడ 71 కట్టడాలు కాలువలో నిర్మించాల్సి ఉండగా 11 పూర్తి చేశారు. మరో 20 పూర్తి కానున్న దశలో ఉన్నాయి. మిగిలినవి ప్రారంభించాల్సి ఉంది. ఇందులో కట్టడాలే కీలకం వరహా నదిలో వయాడెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ప్యాకేజీలో ఇదే కీలకం. అలాగే ఏడో ప్యాకేజీలో 68 కట్టడాలు నిర్మించాల్సి ఉండగా 18 పూర్తి చేశారు. మరో 21 కట్టడాలు ముగింపు దశలో ఉన్నాయి. మిగిలినవి పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో వంతెనలు, గెడ్డల వద్ద నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎనిమిదో ప్యాకేజీలో కేవలం వేసవిలో మాత్రమే పనులు చేస్తారు. ఏలూరు కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపి వేసి పనులు చేపడతారు. కణితి రిజర్వాయర్‌లో నీరు తగ్గిపోగానే పనులు ఆపేసి కాలువలోకి నీరు వదులుతారు. ఈ కాలువలో నీరు పరవాడ, అచ్యుతాపురం పరిశ్రమల అవసరాలకు మళ్లిస్తారు.

ఏడాదిలో పనులు పూర్తి చేస్తాం
పోలవరం ఎడమ కాలువ పనులు ఏడాదిలో పూర్తి చేస్తాం. ఈసారి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారు. నిధులకు ఇబ్బంది లేదు. అత్యాధునిక యంత్రాలతో పనులు చేయిస్తున్నాం. గుత్తేదార్లపై ఒత్తిడి పెంచి మరీ పనులు చేయిస్తున్నాం. దీంతో వారు అదనపు యంత్రాలు రప్పిస్తున్నారు. రైతుల కల నెరవేరుస్తాం. కాలువ పనులు వేగవంతం చేశాం. అటవీ భూమిలో సైతం పనులు పూర్తి చేస్తున్నాం.