News

Realestate News

పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తాం

vizag real estate news

పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తాం
మంత్రి మాణిక్యాలరావు
జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖలో పురాతన దేవాలయాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శుక్రవారం కురుపాం మార్కెట్‌లో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ. కోటితో దేవాదాయ శాఖ నిర్మించిన 46 దుకాణాల సముదాయాన్ని మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అంతకుముందు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ సింహాచలంతో పాటు నగరంలోని ప్రముఖ దేవాలయాలన్నింటిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. పాతనగరంలో ఆంధ్ర ఛార్మినార్‌గా పిలుచుకునే కురుపాం మార్కెట్‌ కట్టడాన్ని పునర్‌నిర్మిస్తామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాతనగరానికి పునర్‌వైభవం తీసుకోస్తామన్నారు. జగదాంబ నుంచి పాతనగరం వరకూ ఉన్న రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు చేపడుతామన్నారు. రోడ్డు విస్తరణ ద్వారా ఇక్కడి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, విష్ణుకుమార్‌రాజు, దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఉపకమిషనర్‌ మూర్తి, సహాయ కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.