పీఎఫ్ ఖాతాదారులకు గృహాలు ఈపీఎఫ్ కేంద్ర బోర్డు సభ్యుడు జగదీశ్వరరావు
కొత్తూరు (అనకాపల్లి), న్యూస్టుడే: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులందరికీ ఇళ్లు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, త్వరలోనే పూర్తిస్థాయి నిబంధనలతో ఉత్తర్వులు విడుదల కానున్నాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) కేంద్ర బోర్డు సభ్యుడు మళ్ల జగదీశ్వరరావు పేర్కొన్నారు. అనకాపల్లి వచ్చిన ఆయన సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కార్మికశాఖ, ఈపీఎఫ్ నిధులు సద్వినియోగం చేయడానికి, కార్మికులకు మరింత ఆర్థిక సేవలందించడానికి వీలుగా త్వరలో కార్మిక బ్యాంకులను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కూడా అంగీకరించాయన్నారు. త్వరలోనే ఈపీఎఫ్ జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. యజమానులులేని కార్మికులకు కూడా ఈపీఎఫ్ సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. దీనిలోభాగంగా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నియమించే ట్రస్టీలే యజమానులుగా ఈపీఎఫ్ సంఖ్యను కేటాయించడానికి చర్యలు తీసుకోనున్నామన్నారు. నిర్మాణాల్లో కార్మిక సంక్షేమ కోసం వసూలు చేస్తున్న అర శాతం పన్ను నుంచి వీరికి యజమాని వాటా కట్టడానికి ప్రభుత్వంతో చర్చలు చేపడుతున్నామన్నారు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే సంస్థల కార్మికుల పరిమితిని 20 నుంచి 10 మందికి మార్పు చేయనున్నామన్నారు.