పాలిటెక్నిక్ కోర్సులతో చక్కటి ఉద్యోగావకాశాలు
పాలిటెక్నిక్ కోర్సులతో చక్కటి ఉద్యోగావకాశాలు
పదో తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు త్వరిత గతిన ఉద్యోగావకాశాలు లభించే కోర్సుల్లో మొదటి స్థానంలో నిలుస్తాయి పాలిటెక్నిక్ కోర్సులు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందాలంటే ముందుగా పాలిసెట్ రాయాలి.
ఇందులో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో సీట్లు పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా మొత్తంగా 16వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 21 దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ కావడంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కోర్సులు చేస్తే ఉపయోగాలు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో లభించే కోర్సులు ఏమిటి? తదితర అంశాలపై కంచరపాలెంలోగల ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.దేముడు ‘ఈనాడు’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే…
దరఖాస్తు చేసేందుకు ఈనెల 21 చివరి తేదీ
అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు ఈనెల 21 చివరి తేదీ. దరఖాస్తు చేసిన వెంటనే అభ్యర్థికి ప్రవేశ పరీక్షకు సంబంధించి సెంటరు ఎక్కడనేది హాల్‌టిక్కెట్ ఇచ్చేస్తాం. ఈనెల 30న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు పరీక్ష జరుగుతుంది.
జిల్లాలో 8 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు : జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. కంచరపాలెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, భీమిలి (బాలికలకు మాత్రమే), అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, నర్సీపట్నం, పాడేరులలో కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు పదిహేడు వరకు ప్రయివేటు కళాశాలలు ఉన్నాయి.
* ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 84 ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉండగా, 243 వరకు ప్రయివేటు కళాశాలలు ఉన్నాయి. మొత్తం సీట్లు 62 వేల వరకు ఉన్నాయి.
బీటెక్ చేయొచ్చు
బీటెక్ వంటి కోర్సులు చేద్దామనుకుంటే ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో ఏడాదిలో చేరేందుకు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం ఉంది.
పరిశ్రమల్లో చక్కటి శిక్షణ : పాలిటెక్నిక్ చేస్తున్న విద్యార్థులకు మూడు, మూడున్నరేళ్ల కోర్సులు ఉన్నాయి. కోర్సులు పూర్తయ్యే సమయానికి అయిదు, ఆరు సెమిస్టర్ల సమయంలో వివిధ పరిశ్రమలకు పంపుతాం. అక్కడ మరింత మెరుగైన శిక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటాం. ఇది చేసిన అనంతరం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.