News

Realestate News

పారిశ్రామికీకరణ పరుగు!

పారిశ్రామికీకరణ పరుగు!

ఎనిమిది పంచాయతీల్లో ఏపీఐఐసీకి ప్రత్యేక అధికారాలు
పరిశ్రమల ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు
పన్నుల ఆదాయంలో 50 శాతం పంచాయతీలకు

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. విశాఖ నగరంతోపాటు జిల్లాలోని అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని (సెజ్) 3,912 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది.

ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విస్తరించడానికి, కొత్తగా మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు, అధికారాలను పంచాయతీల నుంచి ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది.

జిల్లాలోని ఎనిమిది పంచాయతీల్లో అధికారాలు, విధులను ఏపీఐఐసీకి బదలాయించడానికి బుధవారం ప్రభుత్వ కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

వీటి పరిధిలో ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక వసతులన్నీ ఇండస్ట్రీయల్‌ లోకల్‌ ఏరియా అథారిటీ (ఐలా) కల్పిస్తుంది.

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) విస్తరణకు సంబంధించి 2006లో రెండో విడతగా 3,200 ఎకరాల భూములు సేకరణ చేయాలని నోటిఫికేషన్‌ జారీచేశారు.

అందులో వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూములున్నా మిగతా 2,200 ఎకరాలు జిరాయతీ భూములే. అప్పట్లో ఎకరా రూ. 5 లక్షల చొప్పున వెయ్యి ఎకరాల వరకు సేకరించారు.

ప్యాకేజీగా మరో రూ. 50 వేల చొప్పున ఇచ్చారు. 50 సెంట్ల పైబడి భూమి పోయినవారికి కూడా భూమికి భూమి పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించారు.

కొందరు ఈ భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి అవార్డు తీసుకోకుండా ఉండిపోయారు. మరికొంత మంది తాజా ధరలు ఎకరా రూ. 20 లక్షలకు 200 ఎకరాల వరకు ఏపీఐఐసీకి అప్పజెప్పారు. ఇంకా వెయ్యి ఎకరాలకుపైగా జిరాయితీ భూములను సేకరించాల్సి ఉంది.

సేకరించిన భూముల్లోను పరిశ్రమల ఏర్పాటు చేయడానికి సంబంధిత పంచాయతీల నుంచి అనుమతులు రావడం, నెలకొల్పిన పరిశ్రమలకు పన్నుల విధింపులోనూ ఏపీఐఐసీ, పంచాయతీల మధ్య నిత్యం జగడాలు నెలకొనేవి.

తాజాగా ఈ సెజ్‌ విస్తరణలో భాగంగా గుర్తించిన ఆరు పంచాయతీల ప్రత్యేక అధికారాలను… ఏపీఐఐసీకి బదిలీ చేయడానికి నిర్ణయించారు. దీనివల్ల సెజ్‌ విస్తరణకే కాదు కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ఇక పంచాయతీల అనుమతి అవసరం లేదు.

అన్నీ ఏపీఐఐసీ పరిధిలోకే వస్తాయి. సమకూరే ఆదాయాన్ని 50 : 50 పంచాయతీలకు, ఏపీఐఐసీకి కేటాయించనున్నారు. దీనివల్ల పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూరడంతో పాటు మౌలిక సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయిని ఏపీఐఐసీ అధికారులంటున్నారు.

ఇందుకోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించి చర్యలకు ఉపక్రమించింది. సంక్రాంతి తరవాత ఆయా పంచాయతీల అభిప్రాయాలను తీసుకోవాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు.

నగర పరిధిలో..
పరవాడలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీ విస్తరణకు సంబంధించి మరో 400 ఎకరాలు పక్కన్ను తానాం పంచాయతీ నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామ పరిధిలో ఏ పనులు చేపట్టాలన్నా సంబంధిత పంచాయతీ అనుమతులు తప్పనిసరి.

ఫార్మా విస్తరణకు ఇది కొంతవరకు అవరోధంగా ఉండడంతో తాజాగా ఈ పంచాయతీకి సంబంధించి అధికారాలను ఏపీఐఐసీకి బదలాయించడానికి ఉత్తర్వులు జారీచేశారు.

భీమునిపట్నం మండలంలోని నగరపాలెం పంచాయతీ పరిధిలోని కాపులుప్పాడలో నాలెడ్జ్‌ పార్క్‌ (ఐటీ సెజ్‌) నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి పంచాయతీ అనుమతులు అవసరం అవుతున్నాయి.

ఐటీ పార్క్‌ త్వరితగతిన అభివృద్ధి చెందడానికి పంచాయతీ అనుమతుల అవసరం లేకుండా ఏపీఐఐసీకే కట్టబెడుతున్నారు. ఈ రెండు చోట్లా ఐలా ఆధ్వర్యంలోనే మౌలిక వసతుల కల్పన, ఇతర సదుపాయాలన్నీ నిర్వహించనున్నారు.

ఏపీఐఐసీకి బదలాయించే అధికారాలివే..
* ఆర్థిక పరమైన పన్నుల విధింపును పంచాయతీల నుంచి ఏపీఐఐసీకి కేటాయిస్తారు
* ప్రజా భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన అనుమతులు
* సాధారణ, ఇతర అనుమతులు
* స్థానిక సంస్థల నియమ నిబంధనలు (బైలా), జరిమానాల విధింపు మొదలకు అధికారాలు ఏపీఐఐసీ చేతుల్లోకి వెళ్లనున్నాయి.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo