పారదర్శక పాలన

జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతా…
మూడు విభిన్న ప్రాంతాల్లోనూ సమతుల్య అభివృద్ధి
భూ కబ్జాలను అడ్డుకుంటాం తాగు, సాగునీటి సమస్యలపై దృష్టి పెడతా
కొత్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
యువరాజ్ నుంచి బాధ్యతల స్వీకరణ
ఆకర్షణీయ నగరంగా విశాఖ నగరం సహా జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తా. అధికార యంత్రాంగం యావత్తు ఒక బృందంగా పని చేస్తుంది. నాయకుడిగా ఈ బృందాన్ని ముందుకు నడిపిస్తా. మూడు విభిన్న ప్రాంతాలను ఒకదానితో ఒకటి పోటీ పడేలా అభివృద్ధి చేస్తా. తద్వారా జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలబడుతుంది. విద్య, వైద్య రంగాలను విస్తరిస్తాం. పారిశ్రామిక అవసరాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాం. భూకబ్జాలను ఉపేక్షించేది లేదు. సాగు, తాగునీటి అవసరాలపైనా దృష్టి పెడతా…
వన్‌టౌన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మార్గనిర్దేశకత్వంలో విశాఖ నగరం సహా జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని నూతన కలెక్టరు ప్రవీణ్‌కుమార్ చెప్పారు. నీతిమంతమైన, పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జీవీఎంసీ కమిషనర్‌గా పని చేసిన ఆయన సోమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరుగా డాక్టర్ ఎన్. యువరాజ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అధికారిక పత్రాలపై వీరిద్దరూ సంతకాలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం యువరాజ్ వెనుతిరిగారు. ఆ తర్వాత ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. వివిధ అంశాలపై తన మనోభావాలను వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే లక్ష్యంగా ముందుకెళతామని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న మూడు విభిన్న ప్రాంతాల్లోనూ సమతుల్య అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. వుడా, జీవీఎంసీ అధికారులతో కలిసి వివిధ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. విద్య, వైద్య రంగాలను విస్తరిస్తామన్నారు. సంయుక్త కలెక్టరుగా ఇక్కడ పనిచేసిన సమయంలో భూకబ్జాలను అరికట్టామని, అదే తరహాలో కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వానికి చెందిన గజం స్థలాన్నయినా పరాధీనం కాకుండా కాపాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు నీతిమంతమైన, పారదర్శక పాలన అందిస్తామని, ఈ విషయంలో ప్రజలు, జిల్లా అధికారులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారరు. జిల్లా పర్యాటక, ఐటి, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించడానికి మంచి అవకాశాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకొని ముందుకెళతామన్నారు. గిరిజన, గ్రామీణ ప్రాంత సమస్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. విశాఖ జిల్లాలో సంయుక్త కలెక్టరుగా, జీవీఎంసీ కమిషనర్, కలెక్టర్‌గా పనిచేసే అదృష్టం తనకు కలిగిందని, అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సాగునీరు, తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లాపై అవగాహన ఉందని, ఆయా శాఖల అధికారులను కలుపుకుంటూ ముందుకెళతామని చెప్పారు.