పర్వతారోహణలో గిరిపుత్రుడు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే
పుట్టింది విశాఖ మన్యం గిరిజన కుగ్రామంలో.. పోడు వ్యవసాయ ఆధారిత గిరిజన కుటుంబంలో.. చదివింది ప్రాథమిక విద్య మాత్రమే.. అయితేనేమి పర్వతారోహకుడిగా అనుభవం లేకున్నా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో హిమాలయ పర్వత సానువుల్లోని 6100 మీటర్ల (అన్నోన్ పీక్) ఎత్తున్న శిఖరాన్ని అధిరోహించాడు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన గిరిపుత్రుడు.. పేరులేని పర్వతానికి ‘అమరావతి’ నామకరణం చేసి పుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని శిఖరాగ్రాన నిలిపేందుకు ప్రయత్నం చేశాడు. మరోవైపు ప్రమాదకరమైన వాటర్‌ఫాల్ రాప్లింగ్లో ప్రతిభను చాటుకుంటున్నాడు.. అతడే విశాఖ మన్యం అరకులోయ మండలం దండబాడు గ్రామానికి చెందిన పెట్టిలి లైబాన్.. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అడ్వంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు పిలిచే పేరు ‘టైకూన్’.
కుటుంబ నేపథ్యం
అమ్మ కలియబుడ్డి, నాన్న పండు.. వారి నలుగురు సంతానంలో లైబాన్ అన్నయ్య బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికవ్వగా, తమ్ముడు స్థానికంగా ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్నాడు. చెల్లి తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేస్తుంది. ఇంటికి రెండోవాడైన లైబాన్ వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి నూతన దారులు, ప్రాంతాల అన్వేషణ.., సాహసకృత్యాల వైపు సాగుతున్నాడు.
పర్వతారోహకుడిగా ఇలా..
లైబాన్ ప్రాథమిక విద్య అనంతగిరి మండలం శివలింగపురం వసతి గృహం పాఠశాలలో చదువుతుండగా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బృందం 1994లో అనంతగిరి కొండప్రాంతంలో ట్రెక్కింగ్ చేసేందుకు వచ్చింది. ఈ బృందం ఈ పాఠశాల ఆవరణలోనే రాత్రి బసచేసేది. అప్పటికే సాహస కృత్యాలపై ఆసక్తి వున్న లైబాన్కు ఈ బృందంతో పరిచయం ఏర్పడింది. దీంతో గత 12 ఏళ్లుగా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా వచ్చే సాహస బృందాలకు నూతన దారుల అన్వేషణ ద్వారా ట్రెక్కింగ్‌కు రూట్‌మాప్ అందిస్తూ, వారికి గైడ్‌గా కొనసాగేవాడు. చివరికి లైబాన్ అదే సంస్థ తరఫున వివిధ ప్రాంతాలకు వెళ్లే బృంద సభ్యుల్లో ఒకడిగా మారాడు.
కటికి జలపాతాన్ని ప్రపంచానికి పరిచయం
ప్రస్తుతం పర్యటక ప్రాంతం అరకులోయలో ప్రఖ్యాత కటికి జలపాతం 1994కు ముందు కొందరికే పరిచయం. అయితే చిన్నగా నడక దారిగా వున్న జలపాత దారిని అడ్వంచర్ క్లబ్ బృందానికి పరిచయం చేయడం ద్వారా మరింత వ్యాప్తి చేసేందుకు దోహదపడ్డాడు లైబాన్. అనంతరం కటికి, భీమిలి, భోగాపురం, తిరుపతి అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ బృందంలో సభ్యుడిగా, రాక్క్లెంబర్గా మారాడు. చివరికి కటికి జలపాతం వద్ద ఈ యేడాది ఫిబ్రవరి 20, 21 తేదీల్లో అడ్వంచర్ క్లబ్ ఆఫ్ ఏపీకి చెందిన 41మంది సభ్యుల బృందంతో 400 అడుగుల ఎత్తునుంచి వాటర్‌ఫాల్ రాప్లింగ్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దేశ వాటర్‌ఫాల్ రాప్లింగ్ చరిత్రలో కటికి జలపాతాన్ని వేదికగా ప్రపంచ రికార్డుల్లో పేరును లిఖించేలా చేశాడీ గిరిపుత్రుడు.
రాప్లింగ్ నుంచి పర్వతారోహణకు..
శిక్షణ పొందిన సభ్యులంతా వివిధ సమయాల్లో రాప్లింగ్ ద్వారా లక్ష్యం చేరగా లైబాన్ మాత్రం తక్కువ సమయంలో ఈ లక్ష్యాన్ని సాధించాడు. దీంతో లైబాన్ సామర్థ్యంపై నమ్మకంతో హిమాలయాల్లోని 6100 మీటర్ల ఎత్తున్న అన్నోన్ పీక్ పర్వతారోహణకు ఎంపిక చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 14మందిని అడ్వంచర్ క్లబ్ ఆఫ్ ఏపీ ఎంపికచేయగా మన రాష్ట్రం నుంచి ఎంపికైన ముగ్గురిలో మన్యంకు చెందిన పెట్టిలి లైబాన్ అలియాస్ టైకూన్ ఒకడు.
రాజధాని పేరు అగ్రభాగాన నిలిపేలా..
ఈ ఏడాది మే చివరి వారంలో 14 మంది సభ్యుల బృందం దిల్లీ నుంచి మనాలి చేరుకుంది. అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ జగత్సుఖ్ ప్రాంతానికి వెళ్లి ఐదు రోజుల పాటు పర్వతారోహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాలినడకన యాత్ర మొదలు పెట్టి ఆరో రోజు చిక్కా, ఏడో రోజు సెర్రి, ఎనిమిదో రోజు బీసీ చోటా చంద్రెటల్ ప్రాంతానికి చేరుకున్నారు. 6100 మీటర్లు ఎత్తుండి, నోర్బు, డియోడిప్పా పర్వతాల మధ్యనుండే అన్నోన్ పీక్ (పేరుపెట్టని) పర్వతానికి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బయల్దేరి మధ్యాహ్నం 12గంటలకు చేరుకున్నారు. శిఖరాగ్రాన నిలిచి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బృంద నాయకురాలు ఐ.విజయలక్ష్మి, లైబాన్, విజయనగరం జిల్లాకు చెందిన పిసిని సత్తిబాబుతో కలిసి పర్వతానికి మన రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ నామకరణం చేస్తూ ప్లకార్డును స్థాపించారు. దీంతో విశాఖ మన్యంలో పుట్టిన లైబాన్ మన రాజధానిని హిమాలయా పర్వత సానువుల్లో అగ్రభాగాన నిలిపే ప్రయత్నం చేశారు.
ఎవరెస్టు అధిరోహణే లక్ష్యం
6100 మీటర్ల ఎత్తున్న అమరావతి పర్వతం అధిరోహణతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. వచ్చే నవంబరులో కటికి జలపాతం వద్ద నిర్వహించనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ వరల్డ్ వాటర్‌ఫాల్ రాప్లింగ్ పోటీల్లో పాల్గొనబోతున్నా. అమరావతి పర్వతారోహణలో పూర్తి ఖర్చులు అడ్వంచర్ క్లబ్ ఆఫ్ ఏపీ సంస్థ భరించింది. పర్వతారోహణకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేయాలన్నా సుమారు రూ. ఆరు లక్షలు వెచ్చించాలి. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ ప్రోత్సహిస్తే మరిన్ని పర్వతాల అధిరోహించడంతో విశాఖ మన్యం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరెస్టు శిఖరంపై లిఖించాలన్న నా లక్ష్యం నెరవేరుతుంది.