పర్యావరణ పర్యాటక ఉద్యానవనంగా ‘కంబాల కొండ

రూ. 12 కోట్లతో అభవృద్ధి
నేడు, రేపు విశాఖలో నిపుణులతో సదస్సు
విశాఖపట్నం, ఈనాడు:
హుద్‌హుద్ తుపాను బీభత్సానికి దెబ్బతిన్న విశాఖలోని కంబాలకొండకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు మొదలయ్యాయి. ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని పర్యావరణ పర్యాటక ఉద్యానవనం (ఎకో టూరిజం పార్క్)గా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు రూ. 12 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను వెచ్చించనున్నారు. ఇందులో సీతాకోక చిలుకల పార్క్, ఔషధ మొక్కల పెంపకం, నడక దారి, నీటి కందకాలు, చెక్ డ్యాములు, బయో పార్క్, ఎకో ఫ్రెండ్లీ కాటేజి, పగోడాలు, విశ్రాంతి గదులు, పిల్లల పార్క్, జెట్టీ, ఫైబర్ బోట్లు, ఫైర్ వాచ్ టవర్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్ తదితర సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఎకో టూరిజం పార్కును ఆంధ్రప్రదేశ్ విపత్తుల ఉపశమన పథకం కింద తిరిగి అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం అటవీ, పర్యావరణం, జీవవైవిధ్య రంగాల నిపుణులు, ఎన్జీవోలు, పర్యాటక ప్రియులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించడానికి ఈ నెల 21, 22 తేదీల్లో విశాఖలోని నోవాటెల్ హోటల్లో సదస్సు నిర్వహిస్తున్నారు. తొలిరోజు సదస్సు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, చర్చ, క్షేత్రపర్యటనల అనంతరం ఏ తరహాలో అభివృద్ధిచెయ్యాలన్నదానిపై స్పష్టతకు వస్తారు.
అందరూ మెచ్చేలా పనులు
– ఎన్.ప్రతీప్‌కుమార్, అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, విశాఖపట్నం
హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న జూపార్క్, కంబాలకొండలతోపాటు తీరప్రాంతంలో షెల్టర్ బెల్టు అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు 20 మిలియన్ డాలర్లు మంజూరయ్యాయి. ఈ పనులను ఐదేళ్లలో పూర్తి చేయాలి. ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో చర్యలు చేపట్టాం. కంబాలకొండను ఎకోటూరిజం పార్కుగా అభివృద్ధి చేసే క్రమంలో నిపుణుల, ప్రజల సలహాలు తీసుకునేందుకు రెండు రోజుల సదస్సు నిర్వహిస్తాం. అందరూ మెచ్చేలా.. అందరికీ ఉపకరించేలా ఈ పనులు చేపట్టాలన్నదే మా ఉద్దేశం.