పర్యాటకంగా భీమిలికి ఉజ్వల భవిత

భీమునిపట్నం, న్యూస్‌టుడే: రాబోయే రోజుల్లో భీమిలి ప్రాంతానికి పర్యాటకంగా మంచి గుర్తింపు లభిస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉద్ఘాటించారు. భీమిలిలో నిర్మించిన వరుణ్బీచ్-భీమిలి రిసార్ట్ నోవాటెల్ హోటల్‌ను సోమవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చారిత్రక పట్టణమైన భీమిలి విచ్చేసే పర్యాటకులకు వరుణ్బీచ్ రిసార్ట్ చక్కటి ఆతిథ్యం ఇచ్చి మంచి అనుభూతిని కల్గిస్తుందని అభిప్రాయపడ్డారు. నోవాటెల్ హోటల్ ఎండీ ప్రభుకిషోర్ మాట్లాడుతూ భీమిలిలో నిర్మించిన ఈ రిసార్ట్‌లో గోవా తరహాలో పర్యాటక సౌకర్యాలు లభిస్తాయన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్ నుంచి భీమిలి బీచ్ రిసార్ట్‌కు పర్యాటకులను బోటు ద్వారా తీసుకొచ్చి ఆతిథ్యంతో అలరిస్తామన్నారు. దీంతో భీమిలి పర్యాటక స్వర్గధామంగా విలసిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎకార్ హోటెల్స్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జియాన్మైఖేల్కాజ్, వరుణ్ రిసార్ట్ జనరల్ మేనేజరు మాధవ్ బెల్లంకొండ, విశాఖ పోర్టుట్రస్ట్ మాజీ డైరెక్టర్ డి.ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.